చదువుల తల్లికి ఉరి

student suicide in college with raging harrasement - Sakshi

బలిగొన్న ర్యాగింగ్‌

గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోని కాలేజీ పెద్దలు

ఉద్యాననగరిలో ఘోరం

ఆరుగురు విద్యార్థులపై కేసు

యశవంతపుర: ఐటీ సిటీలో విషాదం చోటుచేసుకుంది.  ఒక కాలేజిలో తరగతి ప్రతినిధి ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ర్యాగింగ్‌ను తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ దుర్ఘటన రాజరాజేశ్వరి నగర పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాలు.. చన్నసంద్ర ద్వారకనగర శబరి అపార్టమెంట్‌లో మేఘన (18) తల్లిదండ్రులు చంద్రశేఖర్, లతాలతో కలిసి ఉంటుంది. ఆమె కుమారస్వామి లేఔట్‌లోని దయానందసాగర కాలేజీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ ద్వితీయ ఏడాది చదువుతోంది. ఆమె చిన్నప్పటి నుంచి చదువుల్లో టాపర్‌. ఇంటర్‌లోనూ మంచిర్యాంక్‌తో పాసైంది. సీఈటీలోనూ ఉత్తమ ర్యాంక్‌తో ఫ్రీ సీట్‌ తెచ్చుకుంది.

క్లాస్‌ ఎన్నికలతో వివాదం
ఇటీవల కాలేజి యాజమాన్యం ప్రతి తరగతికి క్లాస్‌ రెప్రజెంటేటివ్‌ (తరగతి ప్రతినిధి) ఎన్నికలను నిర్వహించగా, అందులో మేఘన, సౌదామిని అనే విద్యార్థినితో పోటీ పడిఓడిపోయింది. అప్పటినుంచి సౌదామిని, ఆమె మిత్రులు మేఘనను నాయి (కుక్క) అని పిలుస్తూ అవమానించేవారు. ప్రతి రోజు క్లాస్‌రూంకు వెళ్తే చాలు కుక్కవచ్చిది చూడండీ అంటు అవహేళనగా మాట్లాడేవారు. తనకు రోజు జరుగుతున్న అవమానం గురించి తల్లిదండ్రులు చంద్రశేఖర్, లత దృష్టికి కూడ తెచ్చింది. క్లాస్‌లోని 70 మంది విద్యార్థులు మేఘన ప్రవర్తన సరిలేదంటూ ఇతర విద్యార్థులకు వాట్సప్‌ మెసేజ్‌లు పంపించారు. ఇలా ఎవరూ కూడా మేఘనాతో మాట్లాడకూడదు, ఆమె వైపు కూడ చూడకూడదనే విధంగా వాట్సప్‌లో హల్‌చల్‌ చేశారు.

శాఖాధిపతి నిర్లక్ష్యం
తమ కూతురిపై విద్యార్థుల వేధింపులు ఆపాలని మేఘన తండ్రి కాలేజీ డిపార్టుమెంట్‌ హెడ్‌కు ఫిర్యాదు చేశారు. సౌదామిని, సందీప్, నిఖిల్, నిఖితా, పూజా, సంధ్యాలపై ఫిర్యాదు చేశారు. తన కుతూరు ర్యాంక్‌ విద్యార్థిని, అంతమంది వేధిస్తున్నా ఎందుకు ప్రశ్నించటంలేదని హెచ్‌ఓడి రాజ్‌కుమార్, మరిస్వామిలని ఆన నిలదీశారు. వారు ఎంతమాత్రం పట్టించుకోకుండా ఫ్రీ సీటు వచ్చింది, గొడవ చేయకుండా చదువుకోండి అని చులకనగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో వేధింపులు తట్టుకోలేని మేఘన మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని తనువు చాలించింది. దివ్యాంగుడైన చంద్రశేఖర్‌ బ్యాంక్‌ డ్యూటీకు వెళ్లగా, లతా సహకార సొసైటీ విధులకు వెళ్లారు. మేఘన అక్క కూడా ఇంజనీరింగ్‌ చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. ముగ్గురూ విధులు ముగించుకుని సాయంత్రం వచ్చేసరికి మేఘన మృతదేహం ఉరికి వేలాడుతోంది. అందరూ బోరుమన్నారు. కాలేజికి పోతానని చెప్పి ఆత్మహత్య చేసుకుని అన్యాయం చేశావంటూ విలపించారు.

ఎమ్మెల్యే ఓదార్పు
ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ చేరుకుని బాధితకుటుంబాన్ని ఓదార్చారు. ఘటనపై న్యాయ జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. తప్పు చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోనేలా అధికారులతో మాట్లాతానని చెప్పారు. తమ కుతూరికి జరిగిన అన్యాయంపై ఎన్నిసార్లు మౌఖికంగా ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని తల్లి లతా తండ్రి చంద్రశేఖర్‌లు ఆరోపించారు. ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మా కుతూరి మరణానికి కాలేజి యాజమాన్యం బాధ్యత వహించాలని స్పష్టంచేశారు. అంత విషాదంలోనూ వారు మేఘన నేత్రాలను దానం చేయడం గమనార్హం. వారి ఫిర్యాదు మేరకు సౌదామని, మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. రాజరాజేశ్వరినగర సీఐ శివారెడ్డి కేసును దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top