సాక్షి, మదనపల్లె క్రైం: తల్లిదండ్రులు చదివించలేమని చెప్పడంతో ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత‍్నం చేసింది. ఈ సంఘటన మదనపల్లెలో మంగళవారం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నక్కలదిన్నెతాండాకు చెందిన క్రిష్ణమూర్తి కుమార్తె సింధూజ(22) స్థానికంగా ఉన్న ఓ ప్రయివేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బి.టెక్ చదువుతోంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా తల్లితండ్రులు సింధూజను చదువు మానేయమనడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మ హత్యాయత్నం చేసింది. గమనించిన ఇరుగుపొరుగువారు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సింధూజ ఆస‍్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున‍్న ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.