స్కూల్‌ భవనం పైనుంచి పడి విద్యార్థిని మృతి

Student Fell Down From School Building And Died - Sakshi

శ్రీనాగార్జున పాఠశాలలో ఘటన

స్కూల్‌ను సీజ్‌ చేసిన విద్యాశాఖ అధికారులు

విద్యార్థి సంఘాల ధర్నా

నాగోలు: అనుమానాస్పద స్థితిలో స్కూల్‌ భవనంపై నుంచి పడి ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన గురువారం నాగోల్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  తట్టిఅన్నారం హనుమాన్‌ నగర్‌ కాలనీకి చెందిన నల్లా నర్సింగ్‌రావ్, అనురాధ దంపతుల మూడో కుమార్తె వివిక(14) నాగోల్, సాయినగర్‌ కాలనీలోని శ్రీనాగార్జున పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. గురువారం ఉదయం స్కూల్‌కు వచ్చిన వివిక ఐదో అంతస్తులోని తన క్లాస్‌ రూమ్‌కు వెళ్లింది. స్కూల్‌ బ్యాగ్, టిఫిన్‌ బాక్స్‌ అక్కడే వదిలేసిన ఆమె పక్కనే ఉన్న కిటికీలో నుంచి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. పాఠశాల సిబ్బంది వివికను కామినేని హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా విద్యార్థిని మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివిక భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుందా.. లేదా ఎవరైనా తోశారా..? అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

భద్రతా ప్రమాణాలు లేనందునే..
శ్రీనాగార్జున పాఠశాల భవనం ఐదో అంతస్తులోని కిటికీకి గిల్స్‌ లేకపోవడం, సైడ్‌ అద్దాలు మాత్రమే ఉండటంతో వివిక అందులోంచి దూకినట్లు తెలుస్తోంది. వందలాది మంది విద్యార్థులు చదువుకునే పాఠశాలలో భద్రతా ప్రమాణాలు పాటించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పాఠశాల సీజ్‌..
సంఘటనా స్థలాన్ని సందర్శించి విద్యాశాఖ అధికారులు పాఠశాలలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార సముదాయంలో   స్కూల్‌ను నిర్వహిస్తున్నట్లు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మేడ్చల్‌ డీఈఓ ఆదేశాల మేరకు ఆర్‌ఐ రోజ, ఉప్పల్‌ ఎంఈఓ మదనాచారి పాఠశాలను సీజ్‌ చేశారు. ఉప్పల్‌ తహసీల్దార్‌ ప్రమీళారాణి, వీఆర్‌ఓ అలేఖ్య పాఠశాలను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

విద్యార్థి సంఘాల ధర్నా..
వివిక మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్‌ చేసి క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరుణ్‌కుమార్‌గౌడ్, ఎమ్మార్పీఎస్‌ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిన సుధాకర్‌ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నేతలు పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు.  

హత్యా కోణంలో విచారణ జరిపించాలి..
నాగార్జున స్కూల్‌ విద్యార్థిని వివిక మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని ఈ సంఘటనపై హత్య కోణంలో విచారణ జరిపించాలని బాల హక్కుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు డిమాండ్‌ చేశారు. 

కామినేని హాస్పిటల్‌ వద్ద హై డ్రామా..
 వివిక మృతదేహాన్ని స్కూల్‌ వద్దకు తీసుకువచ్చేందుకు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ప్రయత్నించగా ఎల్‌బీనగర్‌ పోలీసులు అందుకు నిరాకరించడంతో కామినేని ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎల్‌బీనగర్‌ పోలీసులు స్కూల్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top