
సాక్షి, భోపాల్ : విద్యాసంస్థల ధనదాహం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఓ విద్యార్థి తాను చెల్లించాల్సిన ఫీజు కంటే కేవలం రూ 300 తక్కువ చెల్లించాడనే కారణంగా పరీక్షకు అనుమతించకపోవడంతో మరుసటి రోజు బాధిత విద్యార్థి గుండెపోటుతో మరణించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని సత్నాలో చోటుచేసుకుంది. రామకృష్ణ కాలేజ్‌లో బీసీఏ చదువుతున్న మోహన్‌లాల్ అనే విద్యార్థి అనూహ్యంగా కుప్పకూలడంతో ఆస్పత్రికి తరలిస్తుండగానే మరణించాడు.
కాలేజ్ ఫీజుల నిమిత్తం మోహన్‌లాల్ అప్పటికే రూ 25,700 చెల్లించాడు. మిగిలిన రూ 300 బకాయి కోసం పరీక్షకు అడ్మిట్ కార్డును కాలేజ్ నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. రూ 300 కోసం తనను పరీక్షకు అనుమతించకపోవడంపై మోహన్‌లాల్ కుమిలిపోయాడని, ఆ బాధతో గుండెపోటుతో మరణించాడని బాధిత విద్యార్థి బంధువులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఘటనతో బంధువులు, స్నేహితులు నిరసనలు చేపట్టి రహదారిని ముట్టడించారు. కళాశాల యాజమాన్యంపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.