సిబ్బంది నిర్లక్ష్యం.. తల్లికి గర్భశోకం

staff neglected death child in stomach - Sakshi

 శిశువు మరణించాడని తెలిసినా వైద్యం నిరాకరణ

మృతశిశువుతో వారం రోజులు తల్లడిల్లిన మాతృమూర్తి

ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రైవేటు ఆస్పత్రికి పరుగులు

శ్రీకాకుళం, కాశీబుగ్గ : ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం తల్లికి తీరని గర్భశోకాన్ని మిగిల్చింది! తల్లి కడుపులోనే బిడ్డ మరణించాడని తెలిసినా.. ఆమెకు వైద్యం చేసేందుకు వైద్యులు నిరాకరించారు. ఫలితంగా వారం రోజుల పాటు మృత శిశువును గర్భంలోనే ఉంచుకుని పంటి బిగువున ఆ బాధను దిగమింగింది ఆ మాతృమూర్తి!! ఈ హృదయ విదారక సంఘటన పలాసలో జరిగింది. కాశీబుగ్గకు చెందిన గర్భిణి ఎల్‌.గాయత్రి మొదటి నుంచి పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రతినెలా క్రమం తప్పకుండా వచ్చి పరీక్షలు చేయించుకుంటోంది. సెప్టెంబరు 30వ తేదీన కడుపులో బిడ్డ కదలికలు లేవని గ్రహించి.. ఈ విషయాన్ని భర్త జీవన్‌రావుకు తెలిపింది. హుటాహుటిన ఇద్దరూ పలాస ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. వైద్యం చేసేందుకు నిరాకరించి తర్వాత రావాలని సూచించారు.

మళ్లీ ఈనెల 2న మరోసారి ఆమె ఆస్పత్రికి వెళ్లింది. వైద్యపరీక్షలు చేసి బిడ్డ చనిపోయాడని చెప్పడంతో గాయత్రి హతాశురాలైంది. బాధను దిగమింగి చనిపోయిన బిడ్డను తీయించేందుకు 5వ తేదీన వెళ్లారు. అప్పటికీ వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించలేదు. ఇలా ప్రభుత్వాసుపతిల్రో వైద్యం కోసం ఎదురుచూడలేక స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో 6వ తేదీన చేరారు. ఉమ్మ మింగిన మగ శిశువును బయటకు తీసి తల్లి ప్రాణాలు రక్షించారు. గాయత్రి ఆరోగ్యం కుదుటపడటంతో 9వ తేదీ ఇంటికి చేరింది. పలాస ఆస్పత్రిలో ప్రసూతి వైద్యులు ముగ్గురు ఉండే వారు. ప్రస్తుతం ప్రభుత్వం స్పందించక వైద్యులను నియమించకపోవడంతో ఒక్క వైద్యురాలే రేయింబళ్లు పనిచేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల, ప్రభుత్వం ప్రకటనలే తప్ప ప్రాణాలను కాపాడలేకపోతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top