
సేలం(తమిళనాడు): రోజు మద్యం తాగి ఇంటికి వచ్చి గొడవ చేస్తున్న తండ్రి ఆగడాలు భరించలేక కన్న కొడుకులే మంచానికి కట్టేసి బావిలో పడేశారు. ఈ సంఘటన సేలం జిల్లాలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలివి.. జిల్లాలోని మేచ్చేరి సమీపంలో ఎర్కుండపట్టి కాట్టువళవు ఊరికి చెందిన వ్యక్తి జయరామన్(55). ఇతను కొయ్యల దుకాణంలో కూలీ పనిచేస్తున్నాడు. అతని భార్య శరవణ(48). వీరికి మునివేల్(25), సతీష్(20), గోపాల్(16) అనే కుమారులు, నదియా(14) అనే కుమార్తె ఉన్నారు.
తండ్రి ఆగడాలు భరించలేక: జయరామన్ ప్రతిరోజు మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్య, పిల్లలతో గొడవ పడుతూ ఉండేవాడు. అదే విధంగా మూడు రోజుల క్రితం ఇంట్లో ఉన్న మేకను తీసుకెళ్లి మద్యం కోసం అమ్మేశాడు. మత్తులో ఇంటికి వచ్చి భార్య పిల్లలతో గొడవకు దిగాడు. తండ్రి ఆగడాలు భరింలేక కుమారులు మునివేల్, సతీష్‌లు జయకుమార్ను మంచానికి కట్టేశారు. అతడు నిద్రపోయిన తర్వాత
అర్ధరాత్రి మంచంతోపాటు సమీపంలోని బావిలో వేశారు.
ఇది గమనించిన స్థానికులు మెచ్చేరి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, మేట్టూర్ అగ్నిమాపక సిబ్బంది బావిలో రెండు గంటల పాటు గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. మునివేల్, సతీష్‌లను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.