ఆ ఫొటోలు పంపితేనే ఉద్యోగం.. లేదంటే!

Software company HR harrasing a female graduate - Sakshi - Sakshi

బీటెక్ యువతికి సాఫ్ట్‌వేర్ హెచ్‌ఆర్‌ వార్నింగ్

షీ-టీమ్స్‌ను ఆశ్రయించిన బాధితురాలు

సాక్షి, హైదరాబాద్‌ : అశ్లీల ఫొటోలు పంపితేనే ఉద్యోగం వచ్చేలా చేస్తానంటూ ఓ యువతిని వేధిస్తున్న నిందితుడిని హైదరాబాద్‌ షీ–టీమ్స్‌ సోమవారం అరెస్టు చేసినట్లు అదనపు సీపీ స్వాతిలక్రా వెల్లడించారు. సదరు యువతి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రముఖ సంస్థలో నిందితుడు హెచ్‌ఆర్‌ విభాగం అధిపతిగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇటీవలే ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఓ యువతి సిటీకి చెందిన ప్రముఖ కంపెనీలో ఐటీ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్వ్యూ సైతం పూర్తి చేసిన ఆమెకు ఉద్యోగం వచ్చింది, లేనిది తర్వాత చెప్తానంటూ చెప్పిన ఆ సంస్థ హెచ్‌ఆర్‌ విభాగాధిపతి బి.నరేందర్‌ సింగ్‌ తన ఫోన్‌ నెంబర్‌ ఇచ్చాడు.

కొన్ని రోజుల తర్వాత ఈ నెంబర్‌కు యువతి వాట్సాప్‌ ద్వారా సంప్రదించి తన ఉద్యోగం విషయం ఏమైందంటూ అడిగారు. దీనికి సమాధానంగా ‘నీ హాట్‌ ఫొటోస్‌ పంపాలంటూ’ అతడి నుంచి సమాధానం వచ్చింది. దీంతో షాక్‌కు గురైన బాధితురాలు కొన్నాళ్ల వరకు మిన్నకుండిపోయారు. ఆపై మరోసారి సంప్రదించగా.. అలాంటి సమాధానమే వచ్చింది. తాను మరికొన్ని ప్రముఖ సంస్థలకూ రిక్రూట్‌మెంట్స్‌ చేస్తుంటానని, హాట్ హాట్ ఫొటోలు పంపితేనే ఉద్యోగం వచ్చేలా చేస్తానని, లేకుంటే భవిష్యత్తులోనూ ఎక్కడా ఉద్యోగం రాకుండా చేస్తానంటూ బెదిరించాడు. ఈ పరిణామంతో షాక్‌కు గురైన బాధితురాలు సిటీ షీ–టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేసిన అధికారులు సోమవారం నిందితుడిని అరెస్టు చేశారు. వేధింపులు ఎదుర్కొంటున్న బాధితులు ఎవరైనా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని స్వాతిలక్రా కోరారు. వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top