సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు శ్రీధర్ వెంబు సూచన | Why Zoho cofounder Sridhar Vembu urged engineers to stop vibe coding? | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు శ్రీధర్ వెంబు సూచన

Jan 21 2026 12:38 PM | Updated on Jan 21 2026 12:43 PM

Why Zoho cofounder Sridhar Vembu urged engineers to stop vibe coding?

సాఫ్ట్‌వేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం కొనసాగుతోంది. ముఖ్యంగా ‘కర్సర్’ (Cursor) వంటి ఏఐ సాధనాల ద్వారా కేవలం ప్రాంప్ట్‌లు ఇస్తూ వందల సంఖ్యలో కోడ్ లైన్లను రాయడాన్ని డెవలపర్లు అలవాటు చేసుకుంటున్నారు. దీనినే ‘వైబ్ కోడింగ్’ అని పిలుస్తున్నారు. అయితే, ఈ ధోరణిపై జోహో అధినేత శ్రీధర్ వెంబు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైబ్ కోడింగ్‌కు ప్రత్యామ్నాయంగా ఏసీఈ(AI-Assisted Code Engineering) అనే కొత్త విధానాన్ని ఆయన తెరపైకి తెచ్చారు.

ఏంటి వైబ్ కోడింగ్?

ఓపెన్‌ఏఐ సహ వ్యవస్థాపకులు ఆండ్రెజ్ కార్పతి ఇటీవల వైబ్ కోడింగ్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు. డెవలపర్లు లోతైన ప్రోగ్రామింగ్ పరిజ్ఞానం లేకపోయినా కేవలం సహజ లాంగ్వేజీ ప్రాంప్ట్‌ల ద్వారా (Natural Language Prompts) ఏఐ అసిస్టెంట్లను ఉపయోగించి సాఫ్ట్‌వేర్ నిర్మించే ప్రక్రియను ఇది సూచిస్తుంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఇది భవిష్యత్తు అని అంగీకరించినప్పటికీ శ్రీధర్ వెంబు మాత్రం దీనివల్ల జరిగే నష్టాలను హెచ్చరించారు.

‘ఏసీఈ’ ఎందుకు ముఖ్యం?

శ్రీధర్ వెంబు అభిప్రాయం ప్రకారం, కేవలం ఏఐ ఇచ్చే ఫలితాలపై ఆధారపడటం వల్ల కంప్యూటర్ సైన్స్‌లోని మౌలిక అంశాలైన ఆప్టిమైజేషన్, అబ్‌స్ట్రాక్షన్, కంపైలేషన్‌ వంటి క్లిష్టమైన దశలను డెవలపర్లు విస్మరించే ప్రమాదం ఉంది.

అసిస్టెడ్ కోడ్ ఇంజినీరింగ్ ప్రత్యేకతలు

క్రమశిక్షణ కలిగిన ఇంజినీరింగ్‌గా దీనికి గుర్తింపు ఉంది. ఏసీఈ అనేది కేవలం కోడ్ రాయడం మాత్రమే కాదు, సాఫ్ట్‌వేర్‌ సాధనాలు, కోడింగ్‌ పద్ధతులపై అవగాహన పెంపొందించేలా ఉపయోగపడుతుంది. ఇందులోని ఏఐ మీకు సహాయం చేస్తుంది. అదేసమయంలో నిత్యం మీ నైపుణ్యాన్ని పెంచుకుంటూనే ఉండాలి. వైబ్ కోడింగ్ వల్ల భవిష్యత్తులో ఉద్యోగ కోతలకు అవకాశం ఉంటుందని చర్చ జరుగుతుండగా, ఏసీఈ విధానం అనుభవజ్ఞులైన ఇంజినీర్లను అందిస్తుందని వెంబు స్పష్టం చేశారు.

టెక్ పరిశ్రమ ఇప్పటికే లేఆఫ్స్ ఎదుర్కొంటున్న తరుణంలో శ్రీధర్ వెంబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కేవలం ‘వైబ్’ మీద ఆధారపడకుండా క్రమశిక్షణతో కూడిన ఏఐ అసిస్టెడ్ కోడింగ్‌ను అలవాటు చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: ‘చీఫ్ ఆఫ్ ఫ్లైట్‌ సేఫ్టీ’ నియామకం తప్పనిసరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement