విద్యార్థినులపై ఎస్‌ఓ కర్కషం

SO Harassment on KGBV Students in Vikarabad - Sakshi

వాచ్‌ఉమన్‌ ఫోన్‌ పోయిందని  ఎండలో కూర్చోబెట్టిన ప్రత్యేకాధికారి

కాళ్లకు బొబ్బలు రావడంతో ఆస్పత్రికి వెళ్లిన బాధితులు

మోమిన్‌పేట కేజీబీవీలో ఘటనప్రత్యేకాధికారిపై వేటు

మోమిన్‌పేట: వాచ్‌ఉమన్‌ ఫోన్‌ పోయిందని కేజీబీవీ ప్రత్యేకాధికారి విద్యార్థినులను మిట్ట మధ్యాహ్నం ఎండలో బండలపై కూర్చోబెట్టింది. ఎండకు కాళ్లు కాలడంతో కదిలిన విద్యార్థినులను కర్రతో కొట్టింది. కాళ్లకు బొబ్బలు రావడంతో విద్యార్థినులు ఆస్పత్రికి వెళ్లారు. ఈ సంఘటన మోమిన్‌పేటలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో ఆదివారం సోమవారం వెలుగుచూసింది. విద్యార్థినుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని చంద్రా యన్‌పల్లిలో ఉన్న కస్తూర్బాగాంధీ  పాఠశాలలో దాదాపు 160 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. శనివారం రాత్రి నైట్‌ వాచ్‌ఉమన్‌ నర్సమ్మ ఫోన్‌ పోయింది. ఈ విషయం ఆదివారం ఉద యం ఆమె ప్రత్యేకాధికారి(స్పెషల్‌ ఆఫీసర్‌) శైలజకు తెలిపింది. దీంతో ఎస్‌ఓ విద్యార్థినులను పిలిచి ఫోన్‌ తీసుకొన్నవారు మర్యాదగా అప్పగించండి.. లేదంటే అందరికి  మధ్యాహ్నం భోజనం బంద్‌ అంటూ బెదిరించింది. విద్యార్థులు స్పందించకపోవడంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఎండలో పాఠశాల ఆవరణలో బం డలు వేసిన ప్రదేశంలో వారిని కూర్చోబెట్టింది.

ఎండకు తాళ లేక విద్యార్థినులు అంద రూ రూ.10 చొప్పున పోగేసి ఫోను కొనిస్తామని వేడుకున్నా ప్రత్యేకాధికారి వినిపించుకోలేదు. ఎండ వేడిమికి విద్యార్థులు కదలడంతో వారిని కర్రతో దండించింది. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే పరిస్థితి మరోలా ఉంటుందని ఎస్‌ఓ వారిని బెదిరించింది. కాళ్లకు బొబ్బలు రావడంతో ప్రత్యేకాధి కారి విద్యా ర్థులను సోమ వారం మండల కేంద్రం లోని ప్రభు త్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అనంతరం మధ్యాహ్నం నగరంలోని తన ఇంటికి వెళ్లిపోయింది. పాఠశాల ప్రత్యేకాధికారి శైలజ భర్త మధుసూదన్‌ సైతం తరచూ రాత్రి వేళలో పాఠశాలలోనే బస చేస్తాడని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి సైతం మధుసూదన్‌ వచ్చాడని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి సమయంలో పురుషులు హాస్టల్‌కు రాకూడదని, ఎస్‌ఓ భర్త తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, నైట్‌ వాచ్‌ఉమన్‌ నర్సమ్మ నిత్యం రాత్రి పాఠశాలకు కల్లు తీసుకొచ్చి తాగుతుందని విద్యార్థినులు ఆరోపించారు.రాత్రి సమయంలో బయటకు వెళ్లా ల్సి వచ్చినా.. ఆమె స్పందించేది కాదని చెప్పారు.  

వివరాలు సేకరించిన అధికారులు
పాఠశాలలో జరిగిన సంఘటనపై పలువురు అధికారులు సోమవారం వివరాలు సేకరించారు. జిల్లా బాలికల, పిల్లల అభివృద్ధి అధికారి వసుం ధర, ఎంపీడీఓ శైలజారెడ్డి, ఎంఈఓ శంకర్‌ పాఠశాలను సందర్శించి జరిగిన సంఘటనను విద్యార్థినులతో మాట్లాడి తెలుసుకొన్నారు. చిన్న విషయానికే కఠినంగా శిక్షించే ప్రత్యేకాధికారి తమకు వద్దని విద్యార్థులంతా అధికారులకు తెలిపారు. ప్రత్యేకారిని వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయా లని కోరారు.  ఘటనపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని చెప్పారు. అయితే, ప్రత్యేకాధికారి శైలజను ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించే యత్నం చేయగా ఫోన్‌ స్విఛాఫ్‌ వచ్చింది.

ప్రత్యేకాధికారి సస్పెన్షన్‌
సోమవారం సాయంత్రం జిల్లా విద్యాధికారి రేణుకాదేవి పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు తమ ఇబ్బందులను డీఈఓతో వెల్లబోసుకున్నారు. ప్రతి చిన్న విషయానికి ప్రత్యేకాధికారి శైలజ ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఆమెను వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయాలని కోరారు. వివరాలు సేకరించిన డీఈఓ ప్రత్యేకాధికారిని సస్పెండ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top