విమానాల సర్వీస్‌ మార్పిడితో స్మగ్లింగ్‌ 

Smuggling with aircraft service conversion - Sakshi

దీన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న స్మగ్లర్లు 

1.9 కేజీల బంగారం స్వాధీనం, లోతుగా విచారిస్తున్న అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌/శంషాబాద్‌: విదేశాల నుంచి అంతర్జాతీయ సర్వీసుగా వచ్చి... దేశంలోకి ప్రవేశించాక దేశీయ సర్వీసులుగా మారే విమానాలను ఎంచుకొని సాగుతున్న బంగారం అక్రమ రవాణా వ్యవహారం వెలుగు చూసింది. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు ఆదివారం తెల్లవారుజామున ఓ వ్యక్తిని పట్టుకుని రూ.66 లక్షల విలువైన 1.99 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్‌కు పాల్పడిన కేరళ వాసిని అదుపులోకి తీసుకున్న డీఆర్‌ఐ విభాగం దీని వెనుక ఉన్న వ్యవస్థీకృత ముఠా కోసం లోతుగా విచారిస్తోంది. దుబాయ్, మస్కట్, సౌదీ అరేబియా తదితరదేశాల నుంచి భారత్‌లోకి ప్రవేశించే వరకు అంతర్జాతీయ సర్వీసుగా ఉండే విమానాలు దేశంలో డొమెస్టిక్‌గా మారుతాయి. వీటి ఆసరాగా ఈ అక్రమ రవాణా సాగుతోంది. 

పట్టుబడింది ఇలా... 
తాజాగా మధ్యప్రదేశ్‌ రాజధాని ఇండోర్‌ నుంచి ఇండిగో సంస్థకు చెందిన 6ఈ–648 విమానం ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయానికి వచ్చింది. అందులో హైదరాబాద్‌కు వచ్చిన ఓ కేరళ వాసి స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు డీఆర్‌ఐకు సమాచారం అందింది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో కాపుకాసిన అధికారులు అతనిని పట్టుకొని  నాలుగు బంగారం బిస్కెట్‌ ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.66.27 లక్షలు ఉంటుందని డీఆర్‌ఐ ప్రకటించింది.అతను ప్రయాణించిన విమానం షార్జా నుంచి కేరళలోని త్రివేండ్రానికి అంతర్జాతీయ సర్వీసుగా నడుస్తోంది. ఆపై దేశీయ సర్వీసుగా మారి మధ్యప్రదేశ్‌ రాజధాని ఇండోర్‌కు వెళ్తుంది. అక్కడ నుంచి హైదరాబాద్‌కు వస్తుంది.

ఇలా సూత్రధారుల ఆదేశాల ప్రకారం షార్జా నుంచి బంగారాన్ని తీసుకువచ్చిన వారు దాన్ని ఆ విమానం బాత్‌రూమ్స్‌లోని రహస్య ప్రదేశాల్లో దాచి దేశంలోకి ప్రవేశించగానే దాన్ని వదిలేసి తనిఖీల్లో చిక్కకుండా దిగి వెళ్లిపోతాడు.ఆపై అదే విమానంలో దేశీయంగా ప్రయాణించే వ్యక్తికి ముందస్తు సమాచారం ఇచ్చి అదే విమానంలో ప్రయాణించేలా చేశారు. ఆ వ్యక్తి అదను చూసుకుని టాయ్‌లెట్స్‌లో ఉన్న బంగారం తీసుకుంటాడు.ఆపై గమ్య స్థానం చేరగానే కస్టమ్స్‌ తనిఖీలు లేకుండా బయటకు వచ్చేస్తాడు.

ఈ తరహాలోనే ప్రస్తుతం పట్టుబడిన కేరళ వాసి ఇండోర్‌ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించాడు. ఈ స్మగ్లర్‌కు ఓ మారు పేరు పెట్టి, బోగస్‌ ఆధార్‌కార్డు సృష్టించి సూత్రధారులు ఇచ్చారు. డీఆర్‌ఐ అధికారులు ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో... 
ఇలాంటి వ్యవహారమే కిందటి గురువారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌ నుంచి ఇంటర్నేషనల్‌ సర్వీసుగా బెంగళూరు వరకు వచ్చి ఆపై కొలంబియా వెళ్లి చెన్నైకు తిరిగి వచ్చి డొమెస్టిక్‌ సర్వీస్‌గా ఆ విమానం మారింది. ఇందులోని టాయిలెట్స్‌లోని అద్దాల వెనుక స్మగ్లర్లు రూ.60 లక్షల విలువైన 30 బంగారం కడ్డీలను అమర్చారు. ఇది జనవరి 13న చెన్నై నుంచి పుణేకు వెళ్లింది. ఆ తర్వాత పుణే–చెన్నై, చెన్నై–హైదరాబాద్, హైదరాబాద్‌–రాయ్‌పూర్, రాయ్‌పూర్‌–ఢిల్లీ, ఢిల్లీ–శ్రీనగర్, శ్రీనగర్‌–అమృత్‌సర్, అమృత్‌సర్‌–బెంగళూరుల్లో దేశీయంగా తిరిగింది. అయినా విమానంలోని బంగారాన్ని ఎవరూ గుర్తించలేదు, చివరకు గురువారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్నప్పుడు దీనిపై అక్కడి కస్టమ్స్‌ అధికారులకు సమాచారం అందింది. వారు తనిఖీలు చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు స్మగ్లింగ్ల వెనుక ఒకే సూత్రధారులు ఉన్నారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top