షార్ప్‌షూటర్‌ అరెస్ట్‌..

Sharp Shooter Arrested In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అతడో కరుడుగట్టిన నేరగాడు, ప్రత్యర్ధులకు చెమటలు పట్టించడంతో పాటు పోలీసులను ముప్పతిప్పలు పెట్టే గ్యాంగ్‌స్టర్‌. ఖాకీలకు టోకరా వేస్తూ అజ్ఞాతంగా నేరాలకు పాల్పడే ఆ ఘరానా నిందితుడికి రాజధాని పోలీసులు ఝలక్‌ ఇచ్చారు. నీరజ్‌ బవానా గ్యాంగ్‌కు చెందిన షార్ప్‌షూటర్‌ రాజ్‌ కుమార్‌ అలియాస్‌ బంభాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిందితుడికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. నాలుగు హత్యలతో సహా ఆరు కేసుల్లో మోస్ట్‌ వాండెట్‌గా ఉన్న నిందితుడిని ఇప్పటికే పరారీలో ఉన్న నేరగాడిగా ప్రకటించారు. ఆయన తలపై రూ లక్ష రివార్డును ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. కాగా ఓ వ్యక్తిని కలిసేందుకు నిందితుడు ప్రహ్లాద్‌పూర్‌ రోడ్డుకు వస్తున్నాడనే సమాచారంతో వలపన్ని అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కుమార్‌ నుంచి ఓ సెమీ ఆటోమేటిక్‌ పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బైక్‌పై వచ్చిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా బైక్‌ను వదిలి పారిపోతూ పోలీసులపై కాల్పులు జరిపాడని, ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు గాయపడ్డాడని అధికారులు వెల్లడించారు. తాను నీరజ్‌ బవానా సోదరుడు పంకజ్‌ నుంచి డబ్బు తీసుకున్నానని, ఆ మొత్తం చెల్లించలేక వారి వద్ద పనిచేస్తున్నానని విచారణ సందర్భంగా రాజ్‌ కుమార్‌ విచారణలో వెల్లడించాడని పోలీసులు చెప్పారు. కాగా, నిందితుడికి ప్రత్యర్థి వర్గానికి చెందిన పలువురి హత్య కేసులతో పాటు ఇతర హత్య కేసుల్లో సంబంధం ఉందని వెల్లడించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top