రంగంలోకి ఏడు బృందాలు.. నెలలోపే చార్జ్‌షీట్‌

Seven Special Teams to Investigate Disha Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యావత్‌ దేశాన్ని కుదిపేసి.. మహిళల భద్రతపై పెను సవాళ్లు విసిరిన దిశ అత్యాచారం, హత్య కేసు విచారణను సైబరాబాద్‌ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శరవేగంగా దర్యాప్తు జరిపి.. నెలరోజుల్లోపే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా ఈ కేసులో ఏ చిన్న అంశాన్ని వదిలిపెట్టకుండా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్‌ చేసేందుకు పోలీసులు ప్రత్యేకంగా ఏడు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఏడుగురు పోలీసులు ఉండనున్నారు. మొత్తం 50 మంది పోలీసులు దిశ కేసును విచారించనున్నారు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మొదలు కానిస్టేబుల్‌ వరకు ప్రతి ఒక్కరూ ఇన్వెస్టిగేషన్‌తో తమవంతు పాత్ర పోషించనున్నారు. ఈ కేసులో అత్యంత కీలకంగా మారిన చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసేవరకు ఈ ఏడు పోలీసు బృందాలు పనిచేయనున్నాయి.
చదవండి: దిశ కేసు: పోలీసు కస్టడీకి నిందితులు

ఇక, దిశను అత్యాచారం చేసి, క్రూరంగా చంపేసిన నిందితులను కస్టడీలోకి తీసుకొచి విచారించేందుకు డీసీపీ ప్రకాశ్‌ రెడ్డి నేతృత్వంలో విచారణ బృందం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ బృందం ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకొని.. విచారణను కొనసాగిస్తుంది. ఇక మిగిలిన పోలీసు బృందాల్లో ఒక బృందం సాక్ష్యాలను సేకరించనుండగా.. మరో బృందం ఫోరెన్సిక్ , డీఎన్‌ఏ ఆధారాలను పరిశీలించనుంది. ఇంకొక బృందం లీగల్ ప్రొసీడింగ్స్‌ సమర్థంగా చేపట్టేందుకు ఏర్పాటైంది. కేసులో ప్రధానంగా ఉన్న ప్రత్యక్ష సాక్షుల విచారణ, ఐడెంటిఫికేషన్ పీరియడ్ కోసం మరొక టీమ్ రంగంలోకి దిగింది.

కేసులో కీలకం కానున్న సీసీటీవీ కెమెరా దృశ్యాల వీడియో అనాలసిస్‌, టెక్నీకల్‌ ఎవిడెన్స్‌ అనాలసిస్‌కు ఇంకొక టీమ్‌ పనిచేస్తోంది. సీన్ టు సీన్ అనాలసిస్ , క్రైమ్ సీన్ రికన్‌స్ట్రక్షన్ కోసం మరో టీమ్‌ రంగంలోకి దిగింది. మొత్తానికి ఈ ఏడు బృందాలు సమన్వయంతో పనిచేస్తూ... సత్వరమే ఆధారాలు సేకరించి.. సాక్ష్యాలు క్రోడీకరించే సమగ్రంగా నెలరోజుల్లో చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని సీపీ సజ్జనార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయడంతో నెలరోజుల్లోపు విచారణ జరిగి దోషులకు శిక్షలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top