రూటు మార్చిన ఎర్రచందనం స్మగ్లర్లు

Sandle Wood Smuggling in YSR Kadapa - Sakshi

ముగ్గురు అంతర్‌ జిల్లా  ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

భారీగా దుంగలు స్వాధీనం

కడప అర్బన్‌: రాయలసీమ జిల్లాల్లోని అటవీప్రాంతాలు ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం కలిగి ఉన్నాయి. ఈ ఎర్రచందనంను విదేశాలకు అక్రమంగా తరలిస్తూ జిల్లా స్థాయి నుంచి అంతర్‌ జిల్లా, అంతరాష్ట్ర, అంతర్జాతీయ స్మగ్లర్లుగా పలువురు ఎదిగారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఎంతో మం ది స్మగ్లర్లను అరెస్ట్‌ చేసి కటకటాల పాలు చేయడంలో సక్సెస్‌ అయ్యారు. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు, కటిగెనహళ్లి, తమిళనాడు రాష్ట్ర చెన్నై నగరం రెడ్‌హిల్స్, ఇతర ప్రాంతాల నుంచి జిల్లా వ్యాప్తంగా ఎర్రచందనం స్మగ్లర్లు, తమిళనాడు నుంచి వచ్చే వుడ్‌కట్లర్లు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో చొరబడి ఎర్రచందనం కొల్లగొట్టారు. అదే స్థాయిలో జిల్లా పోలీసు యంత్రాంగం వారిని ఆటకట్టించారు. ఆటకట్టిస్తున్నారు.

అంతర్‌ రాష్ట్రాలకు తరలింపు  
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు, అక్కడి నుంచి షిప్‌లద్వారా విదేశాలకు తరలించేవారు. ఎక్కడికక్కడ పోలీసు యంత్రాంగం కృషితో ఎర్రచందనం స్మగ్లర్లను నియంత్రిస్తున్నారు. దీంతో పోలీసుల కళ్లుగప్పి ఎర్రచందనం స్మగ్లర్లు రూటు మార్చారు. రాయలసీమ జిల్లాల అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను నరికించి పశ్చిమగోదావరి జిల్లాకు తరలించడం పోలీసుల నిఘాకు చిక్కింది. అప్రమత్తమైన పోలీసులు పాత నేరస్థుల కదలికలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎప్పటికపుడు కనిపెట్టారు. జిల్లా ఎస్పీ అభిషేక్‌ మహంతి ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) బి.లక్ష్మినారాయణ పర్యవేక్షణలో పాత నేరస్తుల జాడకోసం తమ వంతు పోలీసులు ప్రయత్నించారు. రాజంపేట పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో పుల్లంపేట మండలం తిప్పాయపల్లెకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్‌ తోట మహేంద్రారెడ్డి గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతూ పట్టుబడ్డాడు. ప్రస్తుతం అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తే, పశ్చిగోదావరి జిల్లా ఏలూరు పరిధిలోకి తరచూ వెళ్లి వచ్చేవాడని, అక్కడి వారితో రెగ్యులర్‌గా ఫోన్‌లలో మాట్లాడుతూ వుండేవాడని  విచారణలో తెలుసుకున్నారు. జిల్లాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్‌ మహేంద్రారెడ్డి తన రూటును మార్చడంతో అతని కదలికలతో ఈనెల 21న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు బైపాస్‌లోని ఓ హోటల్‌ వద్ద అరెస్ట్‌ చేశారు. మహేంద్రారెడ్డి సమాచారంతో అదే రోజు రాత్రి నిందితులను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి 5642 కిలోల బరువున్న 175 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top