అసలేం జరిగింది? 

Safety Committee Team Examining Hazardous Dumper In NTPC - Sakshi

ఓసీపీ–3లో ప్రమాదంపై డీడీఎంఎస్‌ ఆరా!

సాక్షుల నుంచి వివరాల సేకరణ

రెండోరోజు కొనసాగిన విచారణ

ప్రాజెక్టులో పనులు నిలిపివేయాలని ఆదేశం 

సాక్షి, గోదావరిఖని(కరీంనగర్‌): సింగరేని సంస్థ రామగుండం డివిజన్‌ – 2 పరిధిలోని ఓసీపీ – 3 ప్రాజక్టులో సోమవారం ఉదయం జరిగిన డంపర్‌ ప్రమాదంపై డీడీఎంఎస్‌(డిప్యూటీ డైరెక్టర్‌ మైన్స్‌ సేఫ్టీ) అధికారులు కూపీ లాగుతున్నారు. ప్రమాదంలో కార్మికుడు మృతిచెందడాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు అసలు ఏం జరిగింది.. ప్రమాదం ఎలా జరిగింది.. అనే వివరాలు ఆరా తీస్తున్నారు. డీడీఎంఎస్‌ అధికారులు బాలసుబ్రహ్మణ్యం, రంగారావు మంగళవారం ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు. సోమవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగిన వెంటనే ఆర్జీ–2 ఏరియాకు  చేరుకున్న అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించడంతోపాటు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలను సేకరించారు. సోమవారం రాత్రి 9గంటల వరకు సంఘటనపై విచారణ జరిపారు. నిబందనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నట్లు గుర్తించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో బొగ్గు, ఓబీ వెలికితీత పనులు నిలిపివేయాలని ఆదేశించారు.  

క్షుణ్ణంగా తనిఖీ చేసిన డీడీఎంఎస్‌లు 
ప్రమాదంపై డీడీఎంఎస్‌ అధికారులు ప్రాజెక్టు క్వారీ, హాలేజీ రోడ్లు, డంప్‌యార్డులను క్షుణ్ణంగా రక్షణ చర్యలను తనిఖీ చేశారు. సేఫ్టీ కమిటీ టీంలను మూడు బృందాలుగా విభజించి షావల్స్, హాలేజీ రోడ్లు, డంప్‌యార్డు వైపు రక్షణ చర్యలు తనిఖీ నిర్వహించారు. సేఫ్టీ మెజర్స్‌ ప్రకారం షావల్స్‌ పనిచేస్తున్నాయా లేదా? అనే విషయాలను సేఫ్టీ బృందం ద్వారానే చెప్పించారు. షావల్‌ నిలిచే ప్రాంతం ఎగుడు, దిగుడుగా ఉందా.. రెస్ట్‌ షెల్టర్‌ సేఫ్టీ ప్రాంతంలో ఉందా? ఆప్రాంతంలో రాత్రి పూట లైటింగ్‌ ఏవిధంగా ఉంది అనే విషయాలను సేఫ్టీ బృందం సభ్యులతో చెప్పించారు. సేఫ్టీ రూ ల్స్‌ ఏమి చెబుతున్నాయి? ఇక్కడ అమలు ఏవిధంగా ఉందనే విషయాలని సేఫ్టీటీం సభ్యుల ద్వారా తనిఖీ చేయించారు. రక్షణ విషయంలో ఎట్టిపరిస్థితుల్లో రాజీ పడేది లేదని, పూర్తిస్థాయిలో రక్షణచర్యలు చేపట్టిన త ర్వాతే పనులకు నిర్వహించేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసినట్లు తెలిసింది.   

ఉత్పత్తి నిలివేయడం ఇదే ప్రథమం..  
ప్రమాదంపై సీరియస్‌గా ఉన్న డీడీఎంఎస్‌ అధికారులు ప్రాజెక్టుకు చేరుకున్న వెంటనే  పూర్తిగా పనులు నిలిపివేయాలని ఆదేశించారు. ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు తాము చెప్పే వరకు పనులు ని ర్వహించొద్దని సూచించారు. సోమవారం రోజుంతా ఉత్పత్తి నిలిచిపోగా, మంగళవా రం ఉదయం 10 గంటల వరకు పనులు ప్రా రంభం కాలేదు. ఆతర్వాత కొద్దిగా వె నక్కి తగ్గిన డీడీఎంఎస్‌ అధికారులు మూడు షా వల్స్‌ ద్వారా ఓబీ పనులు నిర్వహించుకోవాలని, ఇంటర్నల్‌ డంప్‌యార్డు వద్దకే పనులు చేపట్టాలని సూచించినట్లు సమాచారం. దీంతో పాక్షికంగా పనులు సాగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదాలపై విచారణ చేపట్టడం, సాక్షుల నుంచి వివరాలు సేకరించడం సాధారణంగా జరుగుతుండగా, ప్రాజెక్టులో పూ ర్తిగా ఉత్పత్తి నిలిపివేయడం ఇదే ప్రథమం. 

బాధ్యులపై చర్య తీసుకోవాలి
ఓసీపీ–3లో జరిగిన ప్రమాద ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలని టీబీజీకేఎస్‌ ఆర్జీ–2 ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు డీడీఎంఎస్‌ అధికారులకు వినతిపత్రం అందజేశారు. రక్షణ చర్యలు పాటించడంలో యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఏదైనా సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే కార్మికుడిని ప్రాజెక్టు అధికారి వ్యక్తిగతంగా బెదిరించి క్రమశిక్షణ లేఖలు ఇస్తున్నారని ఆరోపించారు.  

రక్షణ వైఫల్యంతోనే ప్రమాదం
ఏఐటీయూసీ  ఓసీపీ–3లో ప్రమాదానికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు. ఈమేరకు డీడీఎంఎస్‌కు వినతిపత్రం అందజేశారు. వంద టన్నుల సామర్థ్యం గల డంపర్‌ సంస్థాగతమైన రక్షణ ఏర్పాట్ల లోపాలతో ప్రమాదం జరిగి ఈపీ ఆపరేటర్‌ రమేశ్‌ మృతిచెందాడని తెలిపారు.    

అధిక పనిభారంతోనే ప్రమాదాలు.. 
సింగరేణి యాజమాన్యం పనిభారం పెంచడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని జీఎల్‌బీకేఎస్‌ రాష్ట్ర నాయకులు ఐ.కృష్ణ, ఇ.నరేష్, మల్యాల దుర్గయ్య ఒక ప్రకటనలో ఆరోపించారు. ఓసీపీ–3లో డంపర్‌ ఆపరేటర్‌ రమేశ్‌ ప్రమాదానికిగురై మరణించాడని తెలిపారు. సరైన రక్షణ చర్యలు యాజమాన్యం పాటించకపోవడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. రమేశ్‌ కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top