ఇది దొంగలు చేసిన కీడు!

Robbery in Women Suicide home Chittoor - Sakshi

ఓ మహిళ మృతి తమ కీడు కలిగిస్తుందేమోనని అనుమానం

శాంతి కోసం ఆలయంలో నిద్రించేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులు

ఇదే అవకాశంగా దొంగలు పడి ఊడ్చేశారు

80 సవర్ల బంగారు, రూ.1.50లక్షలు చోరీ

శకునాలు, అపశకునాలంటే ఎంతో గురి ఉన్న ఆ వ్యక్తి తామున్న ప్రాంతంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడాన్ని కీడుగా భావించాడు. తమ ఇంటిపై ఆ కీడు పడకుండా ఉండాలని కుటుంబ సభ్యులందరినీ ఓ ఆలయంలో నిద్రించి రావాలని వేరే ప్రాంతానికి పంపాడు. ఆయనేమో తన భవనంపై చల్లగా ఉంటుందని పడుకుని నిద్రించాడు. ఇదే అవకాశంగా దొంగలు పడి పెద్ద కీడే చేశారు! నగా నట్రా డబ్బూ మొత్తం ఊడ్చేశారు.

చిత్తూరు అర్బన్‌ : స్థానిక సాయినగర్‌ కాలనీ ఎక్స్‌టెన్షన్‌లోని ఓ ఇంటిని దొంగలు ఓ చూపుచూశారు. ఆదివారం అర్ధరాత్రి రూ.19లక్షల విలువ చేసే 80 సవర్ల బంగారంతోపాటు రూ.1.50లక్షలు చోరీ చేశారు.  కూతవేటు దూరంలోనే ఎస్పీ నివాసం, క్రైమ్‌ స్టేషన్‌తో పాటు మరో రెండు పోలీస్‌ స్టేషన్లు ఉన్నా దొంగలు దర్జాగా తమ పనికానిచ్చేశారు. బాధితులు, పోలీసు కథనం.. చిత్తూరులోని రాములగుడివీధికి చెందిన ఓ కాఫీ పౌడర్‌ దుకాణ యజమాని యోగీశ్వరన్‌ సాయినగర్‌ కాలనీ ఎక్స్‌టెన్షన్‌లో కాపురముంటున్నాడు.

ఇటీవల వారి నివాస ప్రాంతం సమీపంలో అమర్‌రాజా ఫ్యాక్టరీలో పనిచేసే ఉమామహేశ్వరి అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్నారు. దీనిని కీడుగా భావించి యోగీశ్వరన్‌ శాంతి కోసం తన తల్లి, భార్య, ఇతర కుటుంబ సభ్యులు ఓ ఆలయంలో నిద్రించి రావాలని చెన్నైకు పంపించాడు. ఆదివారం రాత్రి  యోగీశ్వరన్‌ ఇంటి మిద్దెపైన పడుకున్నాడు. ఉదయం కిందకు వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి ఉండటం చూసి ఆందోళన చెందాడు. తీరా ఇంట్లో చూడగా బీరువాను పగులగొట్టి దాదాపు రూ.19 లక్షల విలువ చేసే 80 సవర్ల బంగారు ఆభరణాలతోపాటు రూ.1.50 లక్షల నగదు సైతం చోరీ చేసినట్లు గుర్తించి బావురుమన్నాడు. చోరీకి గురైన నగలన్నీ రెండు తరాల క్రితం నాటివని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిత్తూరు క్రైమ్‌ సీఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో వెళ్లి చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. అలాగే, క్లూస్‌ టీమ్‌ పోలీసులు  వేలిముద్రలు సేకరించారు. సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top