వీళ్లు సామాన్యులు కాదు.. | Robbery Gang Arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

వీళ్లు సామాన్యులు కాదు..

Oct 1 2019 11:10 AM | Updated on Oct 1 2019 11:10 AM

Robbery Gang Arrest in Hyderabad - Sakshi

పోలీసుల అదుపులో నిందితులు

కుత్బుల్లాపూర్‌: బంగారు నగల దుకాణం లూటీకి  యత్నిస్తుండగా అడ్డుకునేందుకు వచ్చిన ఎస్సైని కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించిన ముఠాను బాలానగర్‌ జోన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి నాలుగు కార్లు, ఓ బైక్‌ స్వాధీనం చేసుకున్నారు.  విచారణలో నగరంతో పాటు సైబరాబాద్, రాచకొండ పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరిగిన పలు చోరీ కేసుల్లో చిక్కుముడి వీడింది. సోమవారం బాలానగర్‌ డీసీపీ కార్యాలయంలో డీసీపీ పద్మజారెడ్డి, పేట్‌ బషీరాబాద్‌ ఏసీపీ నర్సింహారావు, డీఐ లు శంకర్, సుమన్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. బోయిన్‌పల్లి హస్మత్‌పేట ప్రాంతానికి చెందిన రంజిత్‌ సింగ్,  బాన్సువాడ కు చెందిన రనీత్‌ సింగ్, మహారాష్ట్రకు చెందిన నర్సింగ్‌ సింగ్, కరన్‌ సింగ్, కర్తార్‌ సింగ్, మనోహర్‌ సింగ్‌ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. మారుతీ ఎగో కారును చోరీ చేసిన వీరు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని పేట్‌ బషీరాబాద్, అల్వాల్‌ ప్రాంతాల్లో తొమ్మిది చోరీలు, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని నేరేడ్‌మెట్‌లో ఒకటి, బోయిన్‌పల్లిలో ఒక చోరీకి పాల్పడ్డారు. మహారాష్ట్ర నుంచి రైళ్లలో నగరానికి చేరుకునే వీరు చోరీ అనంతరం రైలులోనే స్వస్థలాలకు చేరుకునే వారు. 

ఎస్సైపై దాడికి యత్నించి  
పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గత నెల 23న ఓ బంగారు నగల దుకాణంలో వీరు చోరీకి యత్నిస్తుండగా  డ్యూటీలో ఉన్న దుండిగల్‌ ఎస్సై శేఖర్‌రెడ్డి వీరిని అడ్డుకున్నారు. దీంతో రంజిత్‌సింగ్, రజీత్‌సింగ్, నర్సింగ్‌ సింగ్‌ కారుతో ఏకంగా ఎస్సైపై హత్యాయత్నానికి ప్రయత్నించి అక్కడినుంచి పరారయ్యారు. పోలీసులు వెంట పడడంతో కారును చెట్టుకు ఢీకొట్టి మరో కారులో తప్పించుకున్నారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న బాలానగర్‌ డీసీపీ పద్మజారెడ్డి పేట్‌ బషీరాబాద్, దుండిగల్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, మేడ్చల్‌ ప్రాంతాలకు చెందిన ఎస్‌హెచ్‌ఓ లు, డీఐలతో పాటు బాలానగర్‌ సీసీఎస్, సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వారు నగరం దాటి పోకుండా కట్టడి చేశారు. నిందితులు హస్మత్‌పేట ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో నిఘా ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో కొంపల్లి చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాలు అంగీకరించారు. వీరికి సహకరించిన మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, ప్రస్తుతం ఈ ముగ్గురిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. నిందితుల్లో రనీత్‌సింగ్‌ పై నిజామాబాద్‌ జిల్లాలో 2016లోనే పీడీయాక్ట్‌ నమోదై ఉందని తెలిపారు.  కేసును చేధించడంలో ప్రధాన భూమిక పోషించిన అధికారులు, సిబ్బందిని డీసీపీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement