నెత్తురోడిన రహదారులు

Road Accidents In Nalgonda - Sakshi

కట్టంగూర్‌(నకిరేకల్‌) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. గురు, శుక్ర వారాల్లో వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమా దాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా కట్టంగూర్‌ మండలం అయిటిపాముల, ముత్యాలమ్మగూడెం గ్రామాల్లో 65వ నంబర్‌ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు గ్రామానికి చెందిన చెరుకు శేఖర్‌ (25) స్నేహితులతో కలిసి విజయవాడలో జరిగిన ఓ శుభకార్యంలో ఫొటోలు, వీడియో తీసిన అనంత రం కారులో స్వగ్రామానికి బయలుదేరాడు.

మార్గమధ్యలోని అయిటిపాముల గ్రామశివారులో డ్రైవర్‌ అతివేగంగా కారును నడపడంతో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో శేఖర్‌ అక్కడికక్కడే మృతి చెందగా అమర్‌రాజు, ప్రశాంత్‌లకు గాయాలయ్యాయి. దుగినవెల్లి గ్రామానికి చెందిన నాగోజు లక్ష్మణాచారి(35) ముత్యాలమ్మగూడెం లోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. గ్రామ శివా రులో డివైడర్‌ను దాటుతుండగా హైదరాబాదు నుంచి విజయవాడకు వెళ్లే కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మణాచారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇరువురి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరపుతున్నట్లు ఎస్‌ఐ అంతిరెడ్డి పేర్కొన్నారు.

చికిత్స పొందుతూ ప్రశాంత్‌ మృతి
అయిటిపాముల గ్రామ శివారులో గురువారం కారు బోల్తా పడడంతో సంఘటనలో గాయాలపాలైన విడిగోజు ప్రశాంత్‌ (23) గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడిది హైదరాబాదులోని కర్మన్‌ఘాట్‌.

అంబులెన్స్‌ ఢీకొని వృద్ధురాలు..
కోదాడరూరల్‌ : రోడ్డు దాటుతున్న మహిళను అంబులెన్స్‌ ఢీకొట్టడంతో ఓ వృద్ధురాలు దుర్మరణం చెందింది. ఈ సంఘటన కోదాడ మండలం చిమిర్యాల క్రాస్‌ రోడ్‌లో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లబండగూడెం గ్రామానికి చెందిన చల్లా వీరమ్మ(68) చిమిర్యాల క్రాస్‌రోడ్‌లో టిఫిన్‌ చేసి జాతీయ రహదారి దాటుతుండగా విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ప్రైవేట్‌ అంబులెన్స్‌ వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ ఎం.దశరథ తెలిపాడు.

కూతురి ఇంటికి వెళ్తుండగా ఒకరు.. 
సంస్థాన్‌నారాయణపురం(మునుగోడు) : సంస్థాన్‌నారాయణపురం మండలం మూడు గుడిసెల తండా శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వాంకుడోతు సీతారాం(46)అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీస్‌లు, తండావాసులు తెలి పిన వివరాల ప్రకారం.. వాచ్యాతండాకు సీతా రాం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దసరా పండుగ కావడంతో సంస్థాన్‌ నారాయణపురం కూతురు ఇంటికి గురువారం ఉదయం కుంటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అక్కడ దసరా పండుగ జరుపుకున్నాడు. శుక్రవా రం ఉదయం ఇంటి దగ్గర ఆవుకు నీళ్లు తాపించి, మేత వేసి వస్తానని బైక్‌పై ఇంటికి వెళ్లాడు. పనిచేసుకుని అనంతరం అక్కడి నుంచి బయలుదేరాడు.

మార్గమధ్యలో ఉన్న గంగమూలతండాలో అత్తామామల ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి సంస్థాన్‌నారాయణపురానికి బయలుదేరాడు. మూడు గుడిసెల తండా దాటిన తర్వాత రోడ్డు అంచువద్ద బైక్‌ జారి కిందపడడంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుంటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంది. సీతారాం మృతి పట్ల పీఏసీఎస్‌ చైర్మన్‌ గడ్డం మురళీధర్‌రెడ్డి, గడ్డం యాదయ్యలు సంతాపం వ్యక్తం చేశారు. 

బైక్‌ అదుపు తప్పి యువకుడు..
యాదగిరిగుట్ట(ఆలేరు) : బైక్‌ అదుపు తప్పి బోల్తాపడడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని యాదగిరిపల్లి శివారులో గల పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కాచారం గ్రామానికి చెం దిన తిరుపతి (28) ద్విచక్రవాహనంపై యాదగిరిగుట్ట వైపు వస్తున్నాడు. యాదగిరిపల్లి శివారులో ఉన్న పాలిటెక్నిక్‌ కళా శాల వద్దకు రాగానే అక్కడ రోడ్డుపై ఉన్న కందకాన్ని గమనించక అందులో అదుపుతప్పి పడిపోయాడు. దీంతో తిరుపతి తలకి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top