భారీ సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు

Pollachi RapeCase: Modus Operandi of Alleged Rapists Revealed - Sakshi

తమిళనాడులోని పొలాచ్చిలో  దారుణం

500పైగా అమ్మాయిలు, మహిళలపై  అఘాయిత్యం

వీడియోలతో బెదిరింపులు

కీలక నిందితుల్లో  అన్నాడీఎంకే యువనేత

పార్టీ బాధ్యతలనుంచి తొలగింపు

సాక్షి, చెన్నై: తమిళనాడులో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ భారీ సెక్స్‌ రాకెట్‌ ముఠాను పోలీసులు ఛేదించారు. సుమారు 10 సభ్యుల గల ఈ ముఠా 5 వందలమందికి పైగా అమ్మాయిలను, మహిళలను వేధింపులకు గురిచేస్తోంది. వారిపై అత్యాచారాలు చేసి, వీడియోలు చిత్రీకరించి వారిపై  బెదిరింపులకు, వేధింపులకు పాల్పడుతోంది. గత ఏడేళ్లుగా వీళ్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. అయితే ఓ విద్యార్థిని ధైర్యంగా ముందుకొచ్చి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఠా గుట్టు రట్టయింది.  విచారణలో నిందితులు చెప్పిన వివరాలు  విని పోలీసులే నివ్వెర పోయారు.  ఈ రాకెట్‌ను నడిపించిన ముఠాలోని ఒకరు అధికార పార్టీకి చెందిన ఓ యువనేత కావడం రాజకీయాల్లో కలకలం రేపింది. ఫేస్‌బుక్‌లో అమ్మాయిలతో పరిచయం ఏర్పరచుకోవడం, ఆపై ప్రేమిస్తున్నానంటూ  వారిని నమ్మించి అత్యాచారాలకు తెగబడటం,  ఈ దృశ్యాలను వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడటం వీరి  మోడస్‌ ఒపరాండీ. 

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం పొల్లాచిలో  జ్యోతి నగరలో ఉండే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్తో శబరీ రాజన్ (25) అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా స్నేహం చేశాడు. మొబైల్‌నంబరు తీసుకుని..బాగానమ్మబలికి..తనతో బయటికి రావాలని కోరాడు. అలా ఆ అమ్మాయిని తన స్నేహితులు సతీష్‌, వసంతకుమార్‌తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. దీన్ని వీడియో కూడా తీశారు. అనంతరం కారులో ఆమెను తీసుకొచ్చి ఇంటి దగ్గర పడేసి పారిపోయారు. అక్కడితో ఆగకుండా, డబ్బులు ఇవ్వాలని లేదంటే.. వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తామంటూ ఫోన్‌ ద్వారా వేధింపులకు దిగారు. ఈ టార్చర్‌తో ప్రియా తొలుత తన సోదరుడికి విషయాన్ని చెప్పింది. అతను నిందితులతో ఘర్షణకు దిగాడు. దీంతో నిందితులు అతనిపై తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇక విసిగిపోయి బాధితురాలు తల్లిదండ్రుల సాయంతో ఫిబ్రవరి 24న పోలీసులకు ఫిర్యాదు చేసింది.  అయితే ఈ ఫిర్యాదును వెనక్కి తీసుకోకుంటే చంపేస్తామంటూ మరింత బెదిరింపులకు పాల్పడింది నాగరాజు బృందం.  దీనిపై  కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసిన కూపీ లాగగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. పదిమందికి పైగా ఉన్న ముఠా  ప్రేమ పేరుతో అమ్మాయిలకు వల వేస్తారు. చిన్నాపాలయం దగ్గర ఉన్న ఫామ్హౌస్‌కు తరలించి అక్కడ వారిని లైంగికంగా వేధించడం, వీడియోలు తీయడం, బెదిరించడం  చేసేవారు.  ఈ ఫాం హౌస్‌ "బార్" నాగరాజన్ గా పిలిచే  వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. ఇతను ఎఐడీఎంకే  యువనేతగా ఉన్నాడు. 

బాధితులు బయటికొచ్చి ఫిర్యాదు చేయకపోవడంతో ఏడేళ్లుగా ఈ రాకెట్‌ యథేచ్ఛగా సాగించినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో పొల్లాచ్చికి చెందిన శబరి రాజన్, సతీష్‌, వసంతకుమార్ అనే కీచకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అమ్మాయిల అశ్లీల చిత్రాలు, వీడియోలు గుర్తించారు. అంతేకాదు నిందితుల వద్ద ఉన్న సెల్ఫోన్లలో వెయ్యికిపైగా అసభ్యకర వీడియోలు గుర్తించారు పోలీసులు. సోదరుడిని చంపేస్తామంటూ బాధితురాలిని కొందరు బెదిరించారని..ఈ వ్యవహారంలో శబరి రాజన్‌, సతీష్‌, నాగరాజ్‌ అనే వ్యక్తులను అరెస్ట్‌ చేశామన్నారు. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా కీలక నిందితుడు తిరువునక్కరసును నిన్న తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు.

అయితే నటుడు, రాజకీయ నాయకుడు కమల్‌ హాసన్‌ ఈ  గ్యాంగ్‌పై  తొలిసారి స్పందించారు. అధికార పార్టీ అండ ఉండటంతో ఈ ముఠా చెలరేగిపోతోందని ఆగ్రహం వ్యక‍్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలో మహిళలకు, యువతులకు రక్షణ లేకుండా పోయిందని డీఎంకె ఛీప్‌ ఎంకే స్టాలిన్‌ మండిపడ్డారు. కీలక నిందితులను  ఏఐడీఎంకె పార్టీ వెనకేసుకొస్తోందని ధ్వజమెత్తారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధితురాలికి రక్షణ కల్పించాల్సిందిగా ఆయన డిమాండ్‌ చేశారు. అటు దీనిపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. సీబీసీఐడీ దర్యాప్తును డిమాండ్‌  చేస్తున్నాయి.

ఈ వ్యవహారంపై ఏఐడీఎంకే స్పందించింది. బార్‌ నాగరాజును పార్టీలోని అన్ని పదవులనుంచి తొలగిస్తున్నట్టు అన్నాడీఎంకే అధిష్ఠానం సోమవారం ప్రకటించింది.

కాగా కేవలం నలుగురు మాత్రమే నిందితులుగా ఉన్నారనీ, నాలుగు వీడియోలు మాత్రమే లభించాయని జిల్లా ఎస్‌పీ తాజాగా ప్రకటించారు. నిందితులపై గూండా యాక్ట్‌ ప్రయోగించినట్టు చెప్పారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top