వెలుగులోకి పొల్లాచ్చి మృగాళ్ల మరో దారుణం

Pollachi assault case: CID summons son Thendral Manimaran of DMK functionary  - Sakshi

పొల్లాచ్చిలో చిన్నారి హతం ?

మాధ్యమాల్లో ఆడియో వైరల్‌

మహిళా ఉన్నతాధికారిణితో విచారణకు ఆదేశించాలని వినతి

డీఎంకే నేత కుమారుడికి సీబీసీఐడీ సమన్లు జారీ 

సాక్షి ప్రతినిధి, చెన్నై: పొల్లాచ్చికి చెందిన నలుగురు మృగాళ్లు లైంగికదాడులే కాదు, ఓ చిన్నారిపై వరుసగా సామూహిక అత్యాచారానికి పాల్పడి ప్రాణాలు కూడా తీసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో ఒక ఆడియో వైరల్‌ అవుతోంది. పొల్లాచ్చిలో తిరునావుక్కరసర్‌ సహా నలుగురు యువకులు యువతులు, మహిళలతో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయాలు పెంచుకుని, ప్రేమ, మాటలతో లోబరుచుకుని లైంగికదాడులకు పాల్పడడం రాష్ట్రంలో కలకలం రేపింది. అంతేగాక తమ వలలో పడిన యువతుల నగ్నదృశ్యాలను, లైంగికదాడులను సెల్‌ఫోన్‌ వీడియో దృశ్యాలను చిత్రీకరించి పదే పదే లైంగిక హింసకు పాల్పడడం, భయభ్రాంతులకు గురిచేసి సొమ్ముదోచుకోవడం వంటి రాక్షసకృత్యాలకు పాల్పడ్డారు. (చదవండి: భారీ సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు)

ఇలా వందమందికి పైగా యువతులు తమ ధన, మానాలను కోల్పోగా ఓ చిన్నారి ప్రాణాలను కూడా కోల్పోయిన సమాచారం బాధిత యువతి ఆడియో ద్వారా సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘తిరునావుక్కరసర్‌ నలుగురు యువకులతోపాటు ఈ ముఠాలో మరో 8 మంది ఉన్నారు. బాధిత యువతుల్లో ఆరుగురు నా వద్ద తలదాచుకుని ఉండేవారు. వారిలోని ఒక చిన్నారిపై ఆ యువకులు పదేపదే లైంగిక దాడులకు పాల్పడడంతో ప్రాణాలు కోల్పోయింది. ఆ చిన్నారి మృతదేహాన్ని వారి పైశాచికత్వానికి సాక్ష్యంగా నిలిచిన ఇంటికి సమీపంలో పూడ్చిపెట్టారు. ఈ ఘోరాన్ని ఎలా బైటపెట్టాలో తెలియక ఇన్నాళ్లు తపించాను. ఇప్పటికి ధైర్యం తెచ్చుకుని ఆడియో ద్వారా వెలుగులోకి తెచ్చాను’  అని ఆమె చెప్పారు. ఈ ఆడియోలోని వివరాలపై ఆరా తీస్తున్నామని సీబీసీఐడీ అధికారి ఒకరు చెప్పారు.

మద్రాసు హైకోర్టులో మహిళా న్యాయవాదుల పిటిషన్‌
రాష్ట్రంలో పెను సంచలనానికి దారితీసిన పొల్లాచ్చి అత్యాచారాల పరంపర కేసును మహిళా పోలీసు ఉన్నతాధికారిచే విచారణ జరిపించేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ మహిళా న్యాయవాదులు మద్రాసు హైకోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయవాదులు అజిత, ఆదిలక్ష్మి లోకమూర్తి, సుధ దాఖలు చేసిన పిటిషన్‌లో వివరాలు ఇలా ఉన్నాయి. పొల్లాచ్చి లైంగికవేధింపులకు గురైన యువతి పేరును బైటపెట్టడం ద్వారా బాధితులకు రక్షణ కల్పించే విషయంలో తమిళనాడు ప్రభుత్వం విఫలమైంది. అంతేగాక బాధిత యువతి కేసు విషయంలో విశ్వాసాన్ని కోల్పోయింది. 

అంతేగాక బాధిత యువతులు, వారి కుటుంబీకులకు తగిన రక్షణ కల్పించడంలో కూడా తగిన హామీని ఇవ్వలేకపోయింది. ఈ కారణాల వల్ల సీబీఐలోని ఉన్నత మహిళాఅధికారిచే కేసు విచారణ చేపట్టేలా ఆదేశించాలి. బాధిత యువతులకు మానసిక స్థైర్యంకల్పించేలా మానసిక నిపుణులచే కౌన్సెలింగ్, వైద్య సదుపాయం, న్యాయపరమైన తోడ్పాటు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి. బాధిత యువతులకు సాక్షులకు భద్రత చట్టం కింద రక్షణ కల్పించాలి. విద్యాసంస్థల్లో అవగాహనా శిబిరాలు నిర్వహించాలని వారు కోరారు. ఈ పిటిషన్‌పై ఈనెల 29న విచారణను చేపట్టనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి తహీల్‌ రమణి, న్యాయమూర్తి దురైస్వామిలతో కూడిన బెంచ్‌ ప్రకటించింది. చదవండి...(పొల్లాచ్చి కేసు : మద్రాస్‌ హైకోర్టు సంచలన ఆదేశాలు)

డీఎంకే నేత కుమారుడికి సీబీసీఐడీ సమన్లు
ఇదిలా ఉండగా, పొల్లాచ్చి ఘటనపై డీఎంకే నేత కుమారుడికి సీబీఐ సమన్లు జారీచేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు తిరునావుక్కరసర్‌ ఇచ్చిన వాంగ్మూలాన్ని అనుసరించి ఈనెల 28వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా డీఎంకే పొల్లాచ్చి నగర ఇన్‌చార్జ్‌ తెన్రల్‌ సెల్వరాజ్‌ కుమారుడు మణిమారన్‌కు సీబీసీఐడీ పోలీసులు మంగళవారం సమన్లు జారీచేశారు. బాధిత యువతి అన్నపై దాడిచేసిన కేసులో అరెస్టయి బెయిల్‌పై బైటకువచ్చిన బార్‌ నాగరాజ్‌ సైతం ఆదేరోజున విచారణకు హాజరుకావాల్సిందిగా సమన్లు పంపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top