బాధితులా..? నిందితులా..?

Police Inquiry on Interstate Passport Gang - Sakshi

అంతర్రాష్ట్ర ముఠాకు ‘చిక్కిన’ వారిపై సందిగ్ధం

పాస్‌పోర్టు ఇతరులకుఅప్పగించడమూ నేరమే

విచారణ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్న పోలీసులు

నిందితులపై గతంలోనూ కొన్ని కేసులు

సాక్షి, సిటీబ్యూరో: పాస్‌పోర్టులను ట్యాంపరింగ్‌ చేస్తూ నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సోమవారం చిక్కిన ముఠా ఓ క్లిష్ట సమస్యను తెరపైకి తెచ్చింది. ఈ గ్యాంగ్‌ నుంచి పోలీసులు దాదాపు 80 పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఎవరు నిందితులు? ఎవరు బాధితులుగా మారుతారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ముఠా సూత్రధారి రహీముద్దీన్‌ను పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించడంతో పాటు ఆయా వ్యక్తులను పిలిచి ప్రశ్నించిన తర్వాతే నిందితులా? బాధితులా? అనేది తేలుస్తామని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ పేర్కొన్నారు.  

తెలిసీ చేస్తే చర్యలు తప్పవు...
రహీముద్దీన్‌ సైదాబాద్‌లోని శాంత ప్యాలెస్‌లో అక్రమ వీసా కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న సంస్థ అని కస్టమర్లకు తెలిసి ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే కొందరు సక్రమ వ్యవహారమే అని భావించి వీసా ప్రాసెసింగ్‌కు ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. మరికొందరు తమకు అర్హత, అవకాశం లేకపోయినా అక్రమ మార్గంలో వీసాలు పొంది ఆయా దేశాలకు వెళ్లాలని భావించిన వాళ్లూ ఉంటారు. ఇలా తమ పాస్‌పోర్టులను రహీముద్దీన్‌కు అప్పగించిన వారు నిందితులుగా మారుతారని పోలీసులు చెబుతున్నారు. ఇతడితో పాటు ఇతర ముఠా సభ్యుల నుంచి  స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లలోని డేటా, వీరు రూపొందించిన బోగస్‌ సర్టిఫికెట్లు పరిశీలిస్తే తెలిసీ ముందుకు వచ్చింది ఎవరనేది గుర్తించడం తేలిక అవుతుందని భావిస్తున్నారు.  

కశ్మీర్‌ వాసిని యూఎస్‌ రెసిడెంట్‌గా...
అనేక కారణాలు, నేపథ్యాల్లో జమ్మూకు చెందిన వ్యక్తులకు అమెరికా, కెనడా, యూరోపియన్‌ దేశాలు వీసాలు ఇవ్వడం లేదు. దీంతో తమను సంప్రదించిన జమ్మూ వాసి వికాస్‌ను రహీముద్దీన్‌ అండ్‌ గ్యాంగ్‌ అమెరికా రెసిడెంట్‌గా మార్చేసింది. ఇతడి పాస్‌పోర్ట్‌ను ట్యాంపర్‌ చేసిన  గ్యాంగ్‌ ఆఖరి పేజీలో అమెరికా నుంచి అది రీ–ఇష్యూ అయినట్లు మార్చేసింది. దీంతో పాటు అతడికి యూఎస్‌ రెసిడెంట్‌ కార్డునూ సృష్టించేసింది. దీని ఆధారంగా అతను వీసా ఇంటర్వ్యూకు  వెళ్లగా.. అనివార్య కారణాలతో తిరస్కరణకు గురైంది. మరోసారి ట్యాంపర్‌ చేస్తూ యూకే రెసిడెంట్‌గా చూపడానికి రహీముద్దీన్‌ ‘ఏర్పాట్లు’ చేసేశాడు. అలాగే మియాపూర్‌కు చెందని ఓ యువకుడికి ఇదే పంథాలో టర్కీ వెళ్లడానికి జాబ్‌ వీసా ఇప్పించేశాడు. మొత్తం 450 మందిలో ఇలా దేశం దాటేసిన వాళ్లు ఎవరు? వీసా రాక ఇక్కడే ఉన్నది ఎవరు? అనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయనున్నారు.  

వీరిపై కేసులు ‘రాసులు’....
ఈ అంతరాష్ట్ర గ్యాంగ్‌కు చెందిన చెందిన వారిలో దాదాపు ప్రతి ఒక్కరికీ గతంలో నేరచరిత్ర ఉంది. సూత్రధారి రహీముద్దీన్‌పై ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదయ్యాయి. 2010లో చాదర్‌ఘాట్, 2012, 2013ల్లో హుస్సేనిఆలం, 2016లో లంగర్‌హౌస్‌ ఠాణాల్లో ఇవి రిజిస్టర్‌ అయ్యాయి. చెన్నైకి చెందిన ఇలియాస్‌పై అక్కడి సీసీఆర్బీ టీమ్‌లు 2003, 2007లో కేసులు నమోదు చేసి అరెస్టు చేశాయి. స్టాంపుల తయారీదారుడు జహీరుద్దీన్‌పై గత ఏడాది హుస్సేనిఆలం పోలీసులు కేసు నమోదు చేశారు. రహీముద్దీన్‌పై నమోదైన కేసులు ప్రస్తుతం దర్యాప్తు దశలోనే ఉన్నాయి. తాజా ఉదంతాలకు సంబంధించి ముఠాపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదులతో సైదాబాద్, బేగంపేట, ముషీరాబాద్, చాదర్‌ఘాట్, నాంపల్లి, గోల్కొండ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఈ ముఠాపై పీడీ యాక్ట్‌ ప్రయోగించడానికి నగర పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.  

స్టాంపుల తయారీదారులపై స్పెషల్‌ డ్రైవ్‌
నగరంలో అనేక మంది రబ్బర్‌ స్టాంపులు తయారు చేసే వారు ఉన్నారు. రహీముద్దీన్‌ గ్యాంగ్‌ పాస్‌పోర్ట్స్‌ ట్యాంపర్‌ చేసి కాన్సులేట్లను మోసం చేయడంలో రబ్బర్‌ స్టాంపుల పాత్ర కీలకం. ఏ తయారీదారుడూ సంబంధిత శాఖ, సంస్థ నుంచి అధీకృత లేఖ లేనిదే స్టాంపులు తయారు చేయరాదు. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు. దీన్ని పరిశీలించేందుకు నగర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్స్‌ చేయాలని నిర్ణయించాం.– అంజనీకుమార్, కొత్వాల్‌ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top