కారు టైర్‌ పేలి కానిస్టేబుల్‌ మృతి

Police constable killed with car tire burst - Sakshi

కిడ్నాప్‌ కేసులో నిందితుడిని తీసుకొస్తుండగా ఘటన

ప్రమాదంలో నిందితుడు రోషన్‌ సైతం మృతి

హైదరాబాద్‌: ఓ యువతి కిడ్నాప్‌ కేసులో బిహార్‌ రాష్ట్రానికి వెళ్లి నిందితుడిని తీసుకొస్తుండగా మార్గమధ్యంలో టైర్‌ పేలిన ఘటనలో నిందితుడు రోషన్‌తోపాటు కానిస్టేబుల్‌ మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రగాయాల పాలయ్యారు. వివరాలు.. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కుషాల్‌ ప్లాస్టిక్‌ పరిశ్రమలో అంకిత, బిహార్‌ రాష్ట్రానికి చెందిన రోషన్‌ పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా వీరు ప్రేమించుకుంటున్నారు. కుటుంబ సభ్యులకు తెలియడంతో అంకితను పని మాన్పించారు. దీంతో రోషన్‌ అంకితను తీసుకొని బిహార్‌కు వెళ్లిపోయాడు. దీనిపై కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు.

రోషన్‌ స్వగ్రామానికి ఏపీ 28 బీపీ 2228 ఇన్నోవా వాహనంలో బయలుదేరిన పోలీసులు రోషన్, అంకితను హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా దిండోరి జిల్లా జబల్‌పూర్‌ ప్రాంతంలో కారు టైర్‌ పేలి 3 పల్టీలు కోట్టింది. ఈ ఘటనలో నిందితుడు రోషన్, మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న తులసీరామ్‌ మృతిచెందగా.. ప్రైవేటు డ్రైవర్‌తోపాటు ఎస్‌ఐ రవీంద్రనాయక్, మహిళా కానిస్టేబుల్‌ లలిత, అంకితలు తీవ్రగాయాలకు గురయ్యారు. దీంతోవారిని ఆస్పత్రికి తరలించారు. 2018 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌ తులసీరామ్‌కు మే 8వ తేదీన వివాహం జరిగింది. విధి నిర్వహణలో ఎంతో చురుకుగా ఉండే తులసీరామ్‌ పెళ్లి జరిగిన కొద్ది రోజుల్లోనే మృతి చెందడం పట్ల పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top