గుట్కా ఘాటు

Police Attack On Gutka Centers Mahabubnagar - Sakshi

నిఘా కళ్లుగప్పి దొంగచాటున తరలింపు

గద్వాల క్రైం: మన రాష్ట్రంలో మత్తునిచ్చే గుట్కా ప్యాకెట్లను ప్రభుత్వం నిషేధించింది. దీంతో వివిధ కంపెనీలు మూతబడ్డాయి. అయితే వ్యాపారులు కర్ణాటక, మహారాష్ట్ర వంటి ప్రాంతాలనుంచి పోలీసుల నిఘా నేత్రాల దృష్టిలో పడకుండా సరిహద్దులు దాట్టి వేలాది ప్యాకెట్లను దొంగచాటున తీసుకొస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంగా తోడేళ్లలాంటి జాదూగాళ్ల సాయంతో వనపర్తి ప్రాంతానికి చెందిన వ్యాపారులు లక్షలు గడిస్తున్నారు.

షాలో మునిగిన యువత ఆ దురలవాటును మానుకోకపోవడంతో వీరి వ్యాపారం గుట్టుగా జోరుగా సాగుతోంది. పాన్‌ మాసాల, జర్దా, ఖైనీ, తంబాకు, గుట్కాలతో ప్రజలు క్యాన్సర్‌ బారిన పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో వీటి విక్రయాలను నిషేధించారు. అయినప్పటికీ సరఫరా పొరుగు రాష్ట్రాలనుంచి అవుతూనే ఉంది. జిల్లాలో జనవరి ఒక్క నెలలోనే సుమారు రూ.3లక్షల విలువ గల గుట్కాలను పోలీసులు పట్టుకుని 7 కేసులు, 11 మందిని అరెస్ట్‌ చేశారంటే విక్రయాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. 

మూడింతలు లాభం 
మత్తెక్కించే గుట్కాలో దందాలో లాభం కూడా అదేస్థాయిలో ఉంటుంది. ఒక్క గుక్కా ప్యాకెట్‌ ధర రూ.5 ఉంటే బ్లాక్‌ మార్కెట్‌లో రూ.10 నుంచి రూ.15 పలుకుతోంది. అంటే సగటున రోజుకు ఓ  చిరు వ్యాపారి 100 ప్యాకెట్లు అమ్మితే కనీసం రూ.1500ల సంపాదన. ఇలా రోజుకు, వారానికి, నెలకు లెక్కేస్తే వారి ఆదాయం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

నమోదైన కేసులు  

  • జనవరి 5న కర్నూల్‌ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు రాయచూర్‌ నుంచి రూ.27 వేల విలువ గల నిషేధిత గుట్కాలను రహ్యసంగా బైక్‌పై అయిజ మీదుగా తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకుని సరుకును సీజ్‌ చేశారు.
  • 17వ తేదీన వనపర్తి జిల్లాకు చెందిన తండ్రీకొడుకులు రాయచూర్‌ నుంచి గద్వాల మీదుగా రూ.30 వేలు విలువగల గుట్కాలను తరలిస్తుండగా జమ్మిచెడ్‌ శివారులో పట్టుకున్నారు.  
  • అదే రోజున  గద్వాల పట్టణ పోలీసులు సైతం పలువురిని అదుపులోకి తీసుకోగా వారినుంచి వివిధ రకాల గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. సరుకును సీజ్‌ చేసి పలువురిపై కేసులు నమోదు చేశారు. 
  • 18వ తేదీన వనపర్తి జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు రాయచూర్‌ నుంయి కారులో ఎవరికీ అనుమానం రాకుండా రూ.1, 80 లక్షల విలువ గల గుట్కాలను తరలిస్తున్నట్లు కేటీదొడ్డి పోలీసులకు సమాచారం వచ్చింది. నందిన్నె చెక్‌పోస్టు వద్ద పోలీసులు కారును తనిఖీ చేసి పట్టుకున్నారు.  

గుట్కా.. కేరాఫ్‌ కర్ణాటక!
నిషేధిత పాన్‌ మాసాల, జర్దా, తంబాకు, కైనీ, గుట్కా విక్రయాలకు కర్ణాటకలో నిషేధం లేదు. అందులోనూ రెండు రాష్ట్రాలకు సరిహద్దు గల ప్రాంతం కావడంతో అటు  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కర్నూల్‌ జిల్లా వాసులు అలంపూర్‌ చౌరస్తా నుంచి  శాంతినగర్, అయిజ, బల్గెర మీదుగా రాయచూర్‌కు చేరుకుంటారు. అక్కడ సరుకును   కొనుగోలు చేసి రహ్యసంగా బస్సుల్లో బైక్, కారు వంటి వాహనాల్లో తరలిస్తుంటారు.  బల్గెర వద్ద పోలీసుశాఖ చెక్‌పోస్టును ఏర్పాటు చేయగా గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నారు. నామమాత్రంగా తనిఖీలు చేపడితేనే ఇలా పట్టుబడుతుంటే సరిగ్గా ప్రతి వాహనాన్ని పరిశీలించి తనికీ చేస్తే ఇంకెంత సరుకు పట్టుబడుతుందో.

ఇలా తరలిస్తుంటారు.. 
వనపర్తి జిల్లాకు చెందిన వ్యాపారులు గద్వాల జిల్లా మీదుగా సరుకును ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వనపర్తి నుంచి గద్వాల, కేటీదొడ్డి, ధరూర్, దేవరకద్ర, మక్తల్‌ తదితర ప్రాంతల మీదుగా అనువుగా ఉండడం అక్రమార్కులకు అనువుగా ఉంది. అయితే ఇక్కడే తప్పించుకునేందుకు సులువైన మార్గాలు కూడా ఉన్నాయి. కేటీదొడ్డి మండలం నందిన్నె సరిహద్దు వద్ద చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. ఇక మక్తల్‌ వద్ద మాగనూర్‌ దగ్గర మరో చెక్‌పోస్టును పోలీసు శాఖ ఏర్పాటు చేసినప్పటికి అక్కడి సిబ్బంది కళ్లుగప్పి గుట్కా ప్యాకెట్లు చేరాల్సిన ప్రాంతాలకు సునాయాసంగా చేరిపోతున్నాయి. ఇక రాయచూర్‌ నుంచి నిత్యం గుట్కాలను తరలిచడం, తనిఖీలు చేస్తున్న తరుణంలో కర్నాటక డిపోకు చెందిన బస్సుల్లో సైతం రవాణా చేయడం వ్యాపారులకు కలిసి వస్తోంది. ఆర్టీసీ సిబ్బంది కాసులకు కక్కుర్తిపడి ఈ దందాకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఆ కీలక వ్యక్తులు ఎవరు? 
నిషేధిత గుట్కా తరలింపు చేస్తున్నది ఎవరన్నది పోలీసులు బయటపెట్టాలి. పలుకుబడి ఉన్న వ్యక్తులు, పెద్దల అండదండలతో ఈ వ్యవహారం కొన్నసాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. పెద్దల సహాయంతో ముందుగానే పోలీసులను మచ్చిక చేసుకోవడంతో ఎలాంటి తనిఖీలు లేకుండా సరుకు గ్రామాలకు చేరుతోందనే ఆరోపణలు సైతం లేకపోలేదు. పక్కా ప్లాన్‌తో కర్నాటక వ్యాపారులకు, అక్కడి పెద్దలతో నిత్యం టాచ్‌లో ఉండి వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించి ఏ సమయంలో తరలించాలో ముందుగానే చెప్పడంతో లక్షల కొద్దీ సరుకులు సరిహద్దులు దాటిపోతోంది.

గొలుసు కట్టు దుకాణాలే టార్గెట్‌..  
వ్యాపారంలో నిర్ధేశించిన వ్యక్తులు మాత్రమే ప్రణాళిక ప్రకారం గుట్కాలను అమ్మే విధంగా ఏర్పాట్లు చేసుకుంటారు.  ముఖ్యంగా వీధి సైడ్, శివారు ప్రాంతం, పాన్‌ డబ్బాల నిర్వహకులు, టీ స్టాల్స్‌ తదితర వ్యాపారుల నుంచి పక్కా ప్రణాళికలతో గొలుసు కట్టుగా అమ్మకాలు ఉంటాయి. విక్రయాల్లో ఒక్కో దుకాణదారుని వద్ద గుట్కాలకు ఓ రేటు ఉంటుంది. అమ్మిన వ్యాపారి కొత్త వ్యక్తులకు ఎట్టి పరిస్థితిలో విక్రయాలు చేయరు. మరికొంత మందైతే కోడ్‌ భాషలో మాట్లాడితేనే అమ్ముతారు. ఈ వ్యాపారంలో మూడింతల లాభాలు ఉండ డంతో సామాన్యులు సైతం అమ్మకాలు చేయడానికి వెనకాడటంలేదు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తెరవెనుక ఉన్న కేటుగాళ్లను పట్టుకుంటే తప్ప ఈ నిషేధిత గుట్కా వ్యాపారానికి చెక్‌పడదు.

గుట్కా ప్యాకెట్ల పట్టివేత 
గద్వాల క్రైం: జిల్లాకేంద్రానికి గుట్కా ప్యాకెట్లను తీసుకొస్తుండగా పట్టుకున్నట్టు పట్టణ ఏఎస్‌ఐ జిక్కిబాబు తెలిపారు. గద్వాల పట్టణం రెండో రైల్వే గేటు కాలనీకి చెందిన మాణిక్యం ఆదివారం రాయచూర్‌ నుంచి  గుట్కాలను బైక్‌పై గద్వాలకు తీసుకువస్తున్నట్లు సమాచారం వచ్చింది. సాయంత్రం ధరూర్‌ మెట్టు ప్రాంతంలో కాపుకాసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనివద్దనుంచి గుట్కాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.  

క్రిమినల్‌ కేసులు పెడతాం   
నిషేధిత గుట్కాలను కొనుగోలు చేసినా, అమ్మినా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. సరిహద్దులో గట్టి నిఘా ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసి రాష్ట్రంలో అనుమతినిస్తాం.  ప్రజల ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదు. గుట్కా వ్యాపారంలో భాగస్వాములుగా మారి తరలించేవారు పద్ధతి మార్చుకోవాలి. – షాకీర్‌ హుస్సేన్, డీఎస్పీ, గద్వాల

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top