జసిత్‌ కిడ్నాప్‌ కేసులో చిక్కిన అపరిచిత వ్యక్తి

police Arrested A Unknown In Jasith Kidnap Case In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి(మండపేట) : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కిడ్నాప్‌ ఘటనను అడ్డుపెట్టుకుని సులువుగా డబ్బులు సంపాదించేందుకు ఎత్తుగడ వేసిన అపరిచిత వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన వివరాలను సీఐ అడపా నాగమురళి గురువారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు. పట్టణంలోని విజయలక్ష్మి నగర్‌కు చెందిన నాలుగేళ్ల బాలుడు జసిత్‌ కిడ్నాప్‌ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన విషయం విదితమే. మండపేటలో బ్యాంకు ఉద్యోగులుగా పనిచేస్తున్న నూకా వెంకటరమణ, నాగావళి దంపతుల కుమారుడు జసిత్‌ గత నెల 22న కిడ్నాప్‌కు గురై 25వ తేదీ ఉదయం క్షేమంగా తల్లిదండ్రులను చేరాడు. 60 గంటల పాటు సాగిన కిడ్నాప్‌ కథ సుఖాంతమైనా కిడ్నాప్‌కు గల కారణాలు ఇంకా మిస్టరీగానే మిగిలాయి. కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. సంఘటనతో భయాందోళనకు గురైన జసిత్‌ తల్లిదండ్రులు తమ స్వస్థలమైన శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేయించుకుని అక్కడికి వెళ్లిపోయారు. అతడి మేనమామ రామరాజు కాకినాడలో నివాసముంటున్నారు. తాము అడిగిన సొమ్ములు ఇవ్వకపోతే ఈ సారి జసిత్‌ను విడిచిపెట్టబోమంటూ మంగళవారం బెదిరింపు కాల్స్‌ రావడంతో ఆయన పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై బుధవారం కేసు నమోదు చేసిన పోలీసులు వచ్చిన ఫోన్‌ నంబర్ల ఆధారంగా అపరిచిత వ్యక్తి ఆచూకీ కనిపెట్టి పథకం ప్రకారం అతడిని అదుపులోకి తీసుకున్నారు.  

సులువుగా సొమ్ములు సంపాదించాలని..
జసిత్‌ కిడ్నాప్‌ వ్యవహారంపై మీడియా, సోషల్‌ మీడియాలో వచ్చిన వార్తలతో సులువుగా డబ్బులు సంపాదించాలని భావించిన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాళ్లముదునూరిపాడు గ్రామానికి చెందిన చిక్కాల నరేష్‌ జసిత్‌ తండ్రికి ఫోన్‌ చేశాడు. ‘నేనే మీ అబ్బాయిని కిడ్నాప్‌ చేసి క్షేమంగా కుతుకులూరులో వదిలిపెట్టి వెళ్లానని, వెంటనే రూ.50 వేలు ఇవ్వాలని బెదిరించాడు. జసిత్‌ తండ్రి వెంకటరమణ తన బావమరిది రామరాజుకు ఫోన్‌చేసి మండపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్సై తోట సునీత దర్యాప్తు చేపట్టారు. రామచంద్రపురం డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టారు. డబ్బులు తీసుకునేందుకు మండపేట రావాలని ఫోన్‌ చేసి జసిత్‌ తండ్రి వెంకటరమణతో నరేష్‌కు చెప్పించారు. డబ్బులు తీసుకునేందుకు మండపేట వచ్చిన నరేష్‌ను సినిమా రోడ్డులో సీఐ నాగమురళీ, ఎస్సై సునీత సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. నరేష్‌ గతంలో తెలంగాణలోని కాళేశ్వరం ఇసుక ర్యాంపులో పనిచేసేవాడని, నిందితుడికి భార్య, కుమారుడు ఉన్నట్టు సీఐ నాగమురళీ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top