చదువుపై అనాసక్తి.. జీవితం సమాప్తి..

Pharmacy Student Commits Suicide In Ysr Kadapa - Sakshi

ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య

తన గదిలో ఉరి వేసుకున్న చైతన్య

కళాశాలకు తరచూ గైర్హాజరు

ముందు రోజు కాలేజికి వచ్చి మాట్లాడిన విద్యార్థి తండ్రి

ప్రొద్దుటూరు క్రైం : మండలంలోని శ్రీవెంకటేశ్వర ఫార్మసీ కాలేజిలో డీ ఫార్మసీ చదువుతున్న ఆవుల చైతన్య యాదవ్‌ (18) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాలకు వెళ్లని విద్యార్థి జమ్మలమడుగు రోడ్డులోని తన గదిలోనే ఫ్యాన్‌కు టవల్‌ కట్టి ఉరి వేసుకున్నాడు. త్రీ టౌన్‌ పోలీసులు తెలిపిన మేరకు కర్నూలు జిల్లా, నంద్యాలలోని సంజీవనగర్‌కు చెందిన ఆవుల వెంకటసుబ్బయ్యకు భార్య లక్ష్మితో పాటు కుమారుడు చైతన్య, కుమార్తెలు అపర్ణ, శ్రావణి ఉన్నారు. అతను ఫ్యాన్సీ స్టోర్‌ నిర్వహిస్తున్నాడు. చైతన్య ఇంటర్‌ పూర్తి చేసిన వెంటనే ఏడాది క్రితం తిరుపతిలో రేడియాలజి కోర్సులో చేరాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ కోర్సు చేయడం తనకు ఇష్టం లేదని చెప్పడంతో చైతన్యను ప్రొద్దుటూరులో చేర్పించారు.

కళాశాలకు సరిగా వెళ్లేవాడు కాదు..
చైతన్యతోపాటు అదే కాలేజికి చెందిన సంజీవ్, నవీన్‌ అనే మరో ఇద్దరు విద్యార్థులు కలిసి జమ్మలమడుగు రోడ్డులో ఓ గదిని బాడుగకు తీసుకొని ఉంటున్నారు. కాలేజిలో చేరినప్పటి నుంచి చైతన్య సరిగా వచ్చేవాడు కాదని స్నేహితులు చెబుతున్నారు. రోజు కళాశాలకు వెళ్లడానికి అందరూ గదికి తాళం వేసి రాగా చైతన్య మాత్రం ‘ మీరు వెళ్లండి.. నేను టిఫెన్‌ చేసి వస్తాను’ అని చెప్పి వచ్చేవాడు కాదని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఈ క్రమంలో మే నెలలో కాలేజికి రెండు వారాలు వేసవి సెలవులు ఇచ్చారు. ఈ నెల 1 నుంచి తరగతులు ప్రారంభమైనా అతను నంద్యాల నుంచి రాలేదు.

కుటుంబ సభ్యులతో కలిసిపుట్టిన రోజు వేడుకలు.
ఈ నెల 18న చైతన్య పుట్టిన రోజు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలను బాగా చేసుకున్నాడు. 19న ప్రొద్దుటూరుకు వచ్చిన అతను కాలేజికి వెళ్లలేదు. తండ్రికి ఫోన్‌ చేసి ప్రొద్దుటూరుకు రమ్మని చెప్పడంతో ఆయన రెండు రోజుల క్రితం వచ్చారు. కాలేజికి వెళ్లాలనిపించలేదు నాన్నా..! అని తండ్రికి చెప్పాడు. గురువారం కుమారుడ్ని తీసుకొని తండ్రి వెంకటసుబ్బయ్య కాలేజికి వెళ్లి అక్కడి అధ్యాపకులతో మాట్లాడారు. శుక్రవారం నుంచి కాలేజికి వస్తానని చైతన్య అధ్యాపకులతో అన్నాడు. బాగా చదువుకోమని చెప్పి తండ్రి అదే రోజు నంద్యాలకు వెళ్లాడు. శుక్రవారం ఉదయం కూడా తండ్రి ఫోన్‌ చేసి కాలేజికి వెళ్లాలని, బాగా చదువుకోవాలని  చెప్పాడు. గదిలో ఉన్న స్నేహితులు కాలేజికి రమ్మని చెప్పగా ‘మీరు వెళ్లండి.. నేను తర్వాత వస్తానని’ చెప్పాడు. వారు వెళ్లిన కొంత సేపటికే అతను గదిలో ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం సమయంలో కళాశాలకు చెందిన స్నేహితులు గదికి వెళ్లి చూడగా అప్పటికే చైతన్య ఉరికి వేలాడుతున్నాడు. దీంతో వారు స్నేహితులకు, స్థానికులకు సమాచారం అందించారు. విషయం తెలియడంతో త్రీ టౌన్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు.

చదవలేనని అక్కకు చెప్పొచ్చు కదరా..
తల్లిదండ్రులు హుటాహుటిన ప్రొద్దుటూరుకు వచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసి వారు విలపించసాగారు.  ‘చదువుకోలేనని మాతో చెప్పకుంటే.. అక్కతోనైనా చెప్పొచ్చుకదరా..మమ్మల్ని మోసం చేసి వెళ్లిపోతావా నాయనా.. ఏం బాధ వచ్చిందిరా నీకు..’ అంటూ తల్లి లక్ష్మీ కుమారుడి మృతదేహంపై పడి రోదించసాగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. చైతన్య స్నేహితులు జిల్లా ఆస్పత్రికి చేరుకొని చైతన్య మృతదేహాన్ని సందర్శించారు. కళాశాల యాజమాన్యం కూడా మార్చురీ వద్దకు వచ్చి తల్లిదండ్రులను ఓదార్చారు.  విద్యార్థి తండ్రి వెంకటసుబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణంరాజునాయక్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top