ఇల్లు ఖాళీ చేయమంటే బెదిరిస్తున్నాడు 

Person Warning His House Owner By Not Giving Rent In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు : కిరణ్‌ అనే వ్యక్తి తన ఇంటిని అద్దె తీసుకున్నాడు. అద్దె ఇవ్వడంలేదు. ఖాళీ చేయమంటే దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని శ్రీశైలంకు చెందిన సయ్యద్‌ ఫర్వీన్‌బీ జిల్లా ఎస్పీకి విన్నవించింది. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్ప అధ్యక్షతన స్పందన (ఫిర్యాదుల దినోత్సవం) కార్యక్రమం నిర్వహించారు. పలువురు బాధితులు నేరుగా తమ సమస్యలను  ఎస్పీకి విన్నవించారు. సమస్యలపై ఆయన స్పందిస్తూ విచారణ జరిపి నిర్దేశించిన గడువులోపు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్పందన కార్యక్రమంలో లీగల్‌ అడ్వైజర్‌ మల్లికార్జునరావు, డీఎస్పీలు గోపాలకృష్ణ, వెంకట్రామయ్య, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ వాసుకృష్ణ పాల్గొన్నారు. 

ఫిర్యాదుల్లో కొన్ని.. 

  • తన భర్త చేసిన అప్పులకు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తన భర్త గుండెపోటుతో మృతి చెందాడని, ఇద్దరు కుమార్తెలున్న తనకు న్యాయం చేయాలని గడివేముల మండలం గని గ్రామానికి చెందిన లక్ష్మీదేవి ఫిర్యాదు చేశారు.  
  •  ప్రవీణ్‌ అనే వ్యక్తి కారుకు లోన్‌ ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేశాడని కర్నూలు నరసింహారెడ్డి నగర్‌కు చెందిన కరుణాకర్‌ ఫిర్యాదు చేశారు.  
  • రూ.95 లక్షల ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా పరారైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బనగానపల్లె మండలం నందవరం గ్రామానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశారు.  
  • తమ కుమార్తె ఫారిన్‌ వెళ్తుందని చెప్పి డబ్బులు అప్పుగా తీసుకొని 15 రోజుల్లో తిరిగి ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని కర్నూలు గణేశ్‌ నగర్‌కు చెందిన వైవీఎన్‌ రెడ్డి, ఈశ్వరమ్మ దంపతులు ఫిర్యాదు చేశారు.  
  • ఐస్‌క్రీమ్స్‌ తయారు చేయడానికి పెట్టుబడి పెట్టించి ఒక సంవత్సరం తర్వాత మాకు తెలియకుండానే ఖాళీ చేసి వెళ్లి పోయారని ఆదోనికి చెందిన ఉసేనప్ప ఫిర్యాదు చేశారు.    
Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top