పాకిస్తాన్‌ ముజాహిద్దీన్‌!

Pakistan Mujahideen Whatsapp Group Viral in Tamil Nadu - Sakshi

వాట్సాప్‌ గ్రూప్‌ హల్‌ చల్‌

కోవై పోలీసుల అదుపులో పశ్చిమ బెంగాల్‌ యువకుడు

తమిళనాడు చిరునామాతో ఆధార్, రేషన్‌ కార్డులు

విచారణ ముమ్మరం

సాక్షి, చెన్నై: పాకిస్తాన్‌ ముజాహిద్దీన్‌ పేరిట వాట్సాప్‌ గ్రూప్‌ కోయంబత్తూరులో హల్‌చల్‌ చేస్తుండడం వెలుగులోకి వచ్చింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అయితే, ఉత్తరాది ఆ యువకుడికి కోయంబత్తూరులోని చిరునామాతో ఆధార్, రేషన్‌ కార్డులు సైతం జారీ చేసి ఉండడం పోలీసుల్ని విస్మయంలో పడేసింది. ఈ కార్డులు ఆ యువకుడికి ఎలా వచ్చాయో అన్న కోణంలోనూ విచారణను వేగవంతం చేశారు.

రాష్ట్రంలో ఇటీవల కాలంగా చాపకింద నీరులా సాగుతూ వస్తున్న ఐసిస్‌ మద్దతుదారుల కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. శ్రీలంకలో సాగిన బాంబు పేలుళ్ల అనంతరం ఎన్‌ఐఏ వర్గాల దృష్టి తమిళనాడుపై పడింది. తరచూ ఇక్కడ దాడులు నిర్వహించడం ఐసిఎస్‌  మద్దతు దారుల్ని పట్టుకెళ్లడం జరుగుతోంది. అలాగే, నిషేధ తీవ్రవాద సంస్థల పేరిట సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న వ్యవహారాల్ని గుర్తించి విచారణలు ముమ్మరం చేశారు. ప్రధానంగా కోయంబత్తూరు చుట్టూ ఎన్‌ఐఏ వర్గాల విచారణలు, దాడులు ముమ్మరం చేసి ఉన్న తరుణంలో గత నెలాఖరులో తీవ్రవాదులు చొరబడ్డ సమాచారం ఉత్కంఠను రేపింది. కోయంబత్తూరులో జల్లెడ పట్టి మరీ గాలింపు సాగింది. సముద్ర మార్గంలో తమిళనాడులోకి తీవ్ర వాదులు ప్రవేశించి ఉన్నట్టుగా కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో ప్రధాన నగరాల్లో పోలీసుల యంత్రాంగం అప్రమత్తంగానే వ్యవహరిస్తూ వస్తున్నది. ఈనేపథ్యంలో పాకిస్తాన్‌ ముజాహిద్దీన్‌ పేరిట వాట్సాప్‌ గ్రూప్‌ హల్‌చల్‌ చేస్తుండడం వెలుగులోకి రావడంతో కోయంబత్తూరులో భద్రతను ప్రశ్నార్థకం చేసింది. ఓ సెల్‌ఫోన్‌ సర్వీసు సెంటర్‌లో పనిచేస్తున్న వ్యక్తి గుర్తించే వరకు పోలీసులు కూడా ఈ వ్యవహారాన్నిపసిగట్ట లేని పరిస్థితి ఉండడం గమనార్హం.

సెల్‌ఫోన్‌ ద్వారానే వెలుగులోకి..
కోయంబత్తూరులో ఉన్న ఓ నగల తయారీ కర్మాగారంలో ఫారూక్‌ కౌశర్‌ అనే యువకుడు పనిచేస్తున్నాడు. ఇతడి ఆండ్రాయిడ్‌ ఫోన్‌ మరమ్మతులకు గురైంది. దీనిని నగరంలోని ఆర్‌ఎస్‌ పురంలో ఉన్న ఓ సెల్‌ ఫోన్‌ సర్వీసు సెంటర్‌లో ఇచ్చాడు. ఆ సెంటర్‌లో పనిచేస్తున్న సిబ్బంది ఆ ఫోన్‌కు మరమ్మతులు పూర్తి చేశారు. ఆ సెల్‌ఫోన్‌ పనిచేయడంతో అందులో ఉన్న యాప్స్‌ను పరిశీలించాడు. అందులో పాకిస్తాన్‌ ముజాహిద్దీన్‌ పేరిట ఓ వాట్సాప్‌ గ్రూప్‌ ఉండడం, అందులో ప్రధానంగా తుపాకులు, ఆయుధాల ఫొటోలు, వాటి తయారీ గురించిన  సమాచారాలు ఉండడంతో అనుమానాలు బయలు దేరాయి. అలాగే, ఆ సెల్‌ ఫోన్‌లోని గూగుల్‌ సెర్చ్‌లోనూ తుపాకీల తయారీ గురించే అధికంగా సెర్చ్‌ జరిగి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు.  కోయంబత్తూరు పోలీసులు ఆ సెల్‌ఫోన్‌ను పరిశీలించారు. అందులో ఉన్న ఫొటోలు, వాట్సాప్‌ గ్రూప్‌ను తనిఖీలు చేశారు. ఆ నగల కర్మాగారంలో ఉన్న ఫారూక్‌ కౌశర్‌ (28)ను ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అతగాడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువకుడిగా గుర్తించారు. అతడి వద్ద కోయంబత్తూరు చిరునామాతో ఆధార్‌ , రేషన్‌ కార్డు సైతం ఉండడంతో అవి ఎలా వచ్చాయో ఆరా తీస్తున్నారు. రహస్య ప్రదేశంలో ఉంచి అతడి వద్ద విచారణ సాగుతోంది. అలాగే, పాకిస్తాన్‌ ముజాహిద్దీన్‌ పేరిట వాట్సాప్‌ గ్రూప్‌ను నడుపుతున్న వ్యక్తి, అందులోఉన్న వారి వివరాలను సెల్‌ ఫోన్‌ నంబర్ల ఆధారంగా సేకరించి, ఆయా ప్రాంతాల్లోని పోలీసుల ద్వారా విచారణను వేగవంతం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top