ఆత్మహత్య కోసం రివాల్వర్‌ చోరీ

old men threft revolver for comit to suicide - Sakshi

వృద్ధుని వింత నిర్ణయం

పోలీసులకు లొంగుబాటు

యలహంక (బెంగళూరు): ఓ వైపు వృద్ధాప్యం, మరో వైపు కుంగదీస్తున్న అనారోగ్యం అతన్ని చోరీల బాట పట్టించింది. వైద్య ఖర్చుల కోసం నగదు,  ఒకవేళ రోగం నయం కాకపోతే ఆత్మహత్య చేసుకునేందుకు రివాల్వర్‌ను తస్కరించాడు. అయితే తప్పు తెలుసుకున్న ఆయన పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన బెంగళూరులో బుధవారం వెలుగు చూసింది. వివరాలు..కేరళకు చెందిన రాయర్‌ (63) పొట్టకూటి కోసం బెంగళూరు చేరుకున్నాడు. యలహంకలోని అగ్రగామి ప్రైవేటు స్కూల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఇంటిలో పనిమనిషిగా చేరాడు. ఇటీవల కడుపు నొప్పిరావడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.

వైద్యం చేయించుకునేందుకు చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితుల్లో యజమాని ఇంట్లో నాలుగు రోజుల క్రితం రూ.1.5లక్షల నగదు, ఒక రివాల్వర్‌ తస్కరించాడు. ఈ విషయం యజమానికూడా గుర్తించలేకపోయాడు.  అయితే సదరు వృద్ధుడు ఏమనుకున్నాడో ఏమోకాని..బుధవారం యలహంక పోలీసు స్టేషన్‌కు చేరుకున్నాడు. తాను తన యజమాని ఇంట్లో చోరీ చేశానని చెప్పి రివాల్వర్‌ పోలీసులకు అప్పగించి లొంగిపోయాడు. రూ.1.50లక్షల నగదు వైద్యం కోసం ఖర్చు అయినట్లు వివరించాడు. రివాల్వర్‌ ఎందుకు చోరీ చేశావని పోలీసులు ప్రశ్నించగా...అనారోగ్యం నుంచి తాను కోలుకోలేని పక్షంలో ఆత్మహత్య చేసుకునేందుకు అని పేర్కొనడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top