జంట హత్యలకు పాతకక్షలే కారణం | Sakshi
Sakshi News home page

ఇద్దరి దారుణ హత్య

Published Fri, Jul 27 2018 1:51 PM

Old Faction Reason For Two Murders In Guntur - Sakshi

పాతకక్షల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. మాచవరం మండలం వేమవరంలో గురువారం జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. మృతులు  షేక్‌ జమాల్‌(45), షేక్‌ జిలాని(35)  ఇదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ పోశం శ్రీనివాసరావు హత్య కేసులో నిందితులు. జంట హత్యల నేపథ్యంలో పల్నాడు ప్రాంతం వణికిపోతోంది.

మాచవరం: గోటికి పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారు. ఒకే పార్టీలో ఉండే రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుగా మారింది. ఇదే గతంలో మాజీ సర్పంచ్‌ శ్రీనివాసరావు, తాజాగా షేక్‌ జమాల్, జిలానీ ప్రాణాలు కోల్పోయేలా చేసింది. 

వాటర్‌ ప్లాంట్‌ వివాదమే హత్యలకు కారణం
గత ఎన్నికల్లో వేమవరం సర్పంచ్‌గా కాంగ్రెస్‌ అభ్యర్థి పోశం శ్రీనివాసరావు పోటీ చేశారు. టీడీపీ శ్రీనివాసరావుకు మద్దతు ప్రకటించింది. వైఎస్సార్‌ సీపీ తరఫున చంద్రశేఖర్‌ పోటీ చేశారు. ఎన్నికల్లో శ్రీనివాసరావు గెలుపొందారు. గ్రామంలో ముస్లిం వర్గం ఎక్కువ. కొంత కాలం తర్వాత గ్రామంలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకునేందుకు ముస్లిం వర్గానికి చెందిన షేక్‌ జమాల్, జిలానీ పంచాయతీ తీర్మానం అడిగారు. నిరాకరించిన సర్పంచ్‌ శ్రీనివాసరావు స్వయంగా వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. దీంతో వారి మధ్య వివాదం రేగింది. కొన్నాళ్ల తర్వాత వాటర్‌ ప్లాంట్‌ అమ్మకానికి పెట్టారు. అదే సమయంలో జమాల్, జిలానీ తమకు విక్రయించాలని పెద్దల ద్వారా చెప్పించారు. అందుకు శ్రీనివాసరావు అంగీకరించకపోవడంతో వారి మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరింది. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధికి పార్టీ శ్రేణులు తీసుకెళ్లినా సమస్య పరి ష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు హత్యకు గురయ్యాడు. తాజాగా షేక్‌ జమాల్, జిలానీ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

పకడ్బందీ వ్యూహంతోనే హత్య
మాజీ సర్పంచ్‌ శ్రీనివాసరావు హత్యకు ప్రతీకారంగానే ప్రస్తుత జంట హత్యలు జరిగినట్లు సమాచారం.  శ్రీనివాసరావు హత్య కేసులో షేక్‌ జమాల్, జిలానీ ప్రధాన నిందితులు. శ్రీనివాసరావు హత్య తర్వాత గ్రామం ఏడాదిపాటుగా ప్రశాంతంగా ఉంది. గురువారం సాయంత్రం జమాల్‌ను హత్య చేశారు. అర్ధ రాత్రి 11 గంటల వరకు గాలించగా వేమవరం, తురకపాలెం రోడ్డులో జిలాని మృతదేహాన్ని గుర్తించారు.

Advertisement
Advertisement