ఆ నవ వధువు ఇంకా షాక్‌లోనే..

Odisha New bride Is In Still Shock Of Gift Bomb Explosion - Sakshi

సాక్షి, భువనేశ్వర్‌ : ఇటీవల ఓ పెళ్లిలో వచ్చిన కానుక పేలడం వధూవరుల కుటుంబాల్లో విషాధం నింపిన విషయం తెలిసిందే. గిఫ్ట్ ప్యాక్ బాంబు షాక్ నుంచి వధువు ఇంకా తేరుకోలేదని, భర్తను కోల్పోయానన్న వార్తను ఆమె జీర్ణించుకోలేక పోతుందని కుటుంబీకులు చెబుతున్నారు.

ఆ వివరాల్లోకెళ్తే.. స్థానికంగా ఉండే సౌమ్య శేఖర్‌ సాహూకి రీమా అనే యువతితో ఈ నెల 18వ తేదీన వివాహం జరగ్గా.. 21వ తేదీన రిసెప్షన్‌ నిర్వహించారు. ఫిబ్రవరి 23న ఒడిషా బోలన్‌గిర్‌ జిల్లాలోని పట్నాఘడ్‌ లో రిసెస్పన్ గిఫ్ట్ ప్యాక్‌లను వరుడు చూస్తున్నారు. ఓ గిఫ్ట్‌ గట్టిగా ప్యాక్ చేయడంతో వంటింట్లోకి వెళ్లిన వరుడు సౌమ్య శేఖర్ చాకుతో ప్యాక్ ఓపెన్ చేయగానే పెద్ద శబ్ధంతో అది పేలిపోయింది. అతడి వెనకాలే వచ్చిన నానమ్మ అక్కడికక్కడే చనిపోగా, దంపతులు సౌమ్య శేఖర్, రీమాలు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగానే వరుడు మృతిచెందగా, 35 శాతం కాలిన గాయాలతో ఉన్న నవ వధువు రీమాకు వైద్యులు ఇంకా చికిత్స చేస్తున్నారు.

రీమా సోదరుడు శేఖర్ ఈ దారుణఘటనపై స్పందించారు. ‘నా సోదరి రీమాకు బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో వివాహం చేశాం. కానీ కొన్ని రోజులకే ఇలా జరగుతుందని కలలో కూడా ఊహించలేదు. రీమా ఇంకా గిఫ్ట్‌ బాంబ్ పేలిన షాక్ నుంచి బయటకు రాలేదు. భర్త చనిపోయిన విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది. అయితే వంటింట్లోనే బాంబు పేలినా అక్కడే ఉన్న సిలిండర్ పేలలేదు. అయితే సిలిండర్ పేలకుండా ఉన్నందుకు రెండు కుటుంబాలు ప్రాణాలతో ఉన్నాయని సంతోషించాలా.. లేక సోదరి భర్త, అతడి నానమ్మ చనిపోయారని బాధపడాలో తెలయని పరిస్థితి మాది. నా సోదరికి శరీరం ఎడమభాగంలో తీవ్ర కాలిన గాయాలయ్యాయి. దెబ్బతిన్న ఎడమ చెవి, ఎడమ కన్ను పనిచేస్తాయో లేదో. ఆమె ఈ షాక్ నుంచి తెరుకోవడానికి మరింత కాలం పడుతుందని’వధువు సోదరుడు శేఖర్ వివరించారు.

ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పట్నాఘడ్‌ ఎమ్మెల్యే, బీజేపీ నేత కేవీ సింగ్ దేవ్ ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ను కోరారు. మరోవైపు తమ రెండు కుటుంబాలకు శత్రువులు లేరని, ఎవరిపై అనుమానం లేదని చెప్పడంతో నిందితలును పట్టుకోవడంలో జాప్యం జరుగుతోందని పోలీసులు తెలిపారు.
(చదవండి : పేలిన పెళ్లి కానుక.. )

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top