భార్యాబాధితుడి కేసులో కొత్త మలుపు | new turn in wife domestic violence case | Sakshi
Sakshi News home page

భార్యాబాధితుడి కేసులో కొత్త మలుపు

Jan 24 2018 10:36 AM | Updated on Jul 27 2018 2:21 PM

new turn in wife domestic violence case - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న రామ్‌కుమార్, పక్కన భార్య సాయిచైతన్య

అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ సెంట్రల్‌) :  తనకు ముందే పెళ్లయి విడాకులు తీసుకున్న విషయాన్ని దాచిపెట్టడమే కాకుండా, అదనపు కట్నం తీసుకురమ్మంటూ తన భార్య వేధిస్తోందని రాష్ట్రంలో తొలిసారిగా ఓ భర్త తన భార్యపై దాఖలు చేసిన గృహ హింస కేసు కొత్తమలుపు తిరిగింది. తాము రాజీపడి జీవిస్తున్నా కూడా లాయర్‌ డబ్బుల కోసం తమను వేధిస్తున్నాడని, తమ అంగీకారం లేకుండా మీడియాకు తమ వివరాలను వెల్లడించాడని అతనిపై చర్యలు తీసుకోవాలంటూ భార్యాభర్తలిద్దరూ మంగళవారం నున్న రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో అక్కడ హైడ్రామా నడిచింది. వివరాల్లోకెళ్తే.. నున్న ప్రాంతానికి చెందిన సాయిచైతన్య (28) అనే మహిళ, విజయవాడ విద్యాధరపురం చెరువు సెంటర్‌ ప్రాంతానికి చెందిన గోగు రామ్‌కుమార్‌ అనే వ్యక్తి నాలుగు నెలల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే సాయి చైతన్యకు ముందుగానే వేరే వ్యక్తితో వివాహమై, పిల్లలు కూడా ఉన్నారని ఆ విషయాలను ఆమె తనకు చెప్పకుండా దాచి వివాహం చేసుకోవడంతో పాటు తనను అదనపు కట్నం తీసుకురమ్మని వేధింపులకు గురిచేస్తోందంటూ భర్త రామ్‌కుమార్‌ తన భార్యపై గృహహింస కేసు పెట్టాడు.

భార్య బాధితులు కూడా గృహహింస నిరోధక చట్టం ద్వారా కేసు దాఖలు చేయవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా మన రాష్ట్రంలో తొలిసారిగా ఈ కేసును నమోదు చేశారు. దీంతో ప్రసార మాధ్యమాల్లో ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకొని, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో తన ప్రమేయమేమీ లేదని, లాయర్‌ ప్రోద్భలంతోనే తన భార్యపై కేసు పెట్టాల్సి వచ్చిందంటూ బాధితుడు రామ్‌కుమార్‌ ప్లేట్‌ ఫిరాయించాడు. తన భార్యతో విభేదాలు వచ్చిన మాట వాస్తవమేనని తనకు న్యాయం చేయాల్సిందిగా లాయర్‌ పుప్పాల శ్రీనివాసరావు దగ్గరకు వెళ్లగా లక్ష రూపాయలు ఫీజు అడిగారని, ఇందులో రూ.40 వేలు చెల్లించామని తెలిపారు. అయితే ఆ తరువాత భార్యభర్తలిద్దరం రాజీపడి  20 రోజుల నుంచి కలిసి జీవిస్తున్నారు. ఈ విషయం లాయర్‌కు చెబితే నువ్వు అలా చేయడం కరెక్ట్‌ కాదని, మిగిలిన రూ.60 వేలు ఫీజు కట్టాలని అడుగుతూ వాటిని ఇవ్వలేదనే అక్కసుతో తమ ప్రమేయం లేకుండా తమ పేర్లను మీడియాకు చెప్పాడని ఆరోపించారు. దీనివల్ల తమ కుటుంబ పరువు పోయిందని లాయర్‌పై తగిన చర్యలు తీసుకోవాలంటూ నున్న రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. కాగా పోలీసులు పరువునష్టం కేసు కోర్టులో వేసుకోవాలంటూ చెప్పి పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement