శ్రీగౌతమి కేసు దర్యాప్తు ఏమైనట్టు!

Narsapur Police Delayed On Sri Gowthami Murder Case West Godavari - Sakshi

హత్యే అని తేల్చిన సీఐడీ సీఐకి అవార్డు

కేసు పక్కదారి పట్టించిన పోలీసులపై చర్యలులేవు

ఇంకా చార్జ్‌షీట్‌ ఫైల్‌చేయని పోలీసులు

బాధితులకు జరగని న్యాయం

సాక్షి, నరసాపురం(పశ్చిమగోదావరి) : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన దంగేటి శ్రీగౌతమి హత్య కేసులో చురుగ్గా వ్యవహరించిన సీఐడీ సీఐ (రాజమండ్రి) శేఖర్‌బాబు నేర పరిశోధనల్లో ప్రతిభకు ఇచ్చే ఏబీసీడీ అవార్డుకు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా బెస్ట్‌ ఇన్వెస్టిగేషన్‌ విభాగంలో ద్వితీయస్థానంలో నిలిచారు. విజయవాడలో సోమవారం జరిగిన కార్యక్రమంలో హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ ఠాగూర్‌ చేతులమీదుగా శేఖర్‌బాబు అవార్డు అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీగౌతమి కేసును దర్యాప్తు చేసినందుకే శేఖర్‌బాబును ఈ అవార్డు వరించింది. అయితే ఈ కేసును మొదట్లో పక్కదోవ పట్టించిన పోలీసు అధికారులపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ఇంకా సగం దర్యాప్తు మిగిలి ఉందని చెప్పిన పోలీసు అధికారులు, ఇంకా కోర్టులో చార్జ్‌షీట్‌ ఫైల్‌ చేయకపోవడంపైనా ఆరోపణలు ఉన్నాయి.

మంట కలిసిన పోలీసుల ప్రతిష్ట
2017 జనవరి 18 రాత్రి శ్రీగౌతమి హత్య జరిగింది. కేసును 15 రోజుల్లోనే అప్పటి పోలీసు అధికారులు క్లోజ్‌చేశారు. ప్రమాదం నుంచి బయటపడ్డ శ్రీగౌతమి సోదరి పావని అది హత్య అని ఎంతమొత్తుకున్నా పోలీసులు పెడచెవిన పెట్టారు. సోదరికి జరిగిన అన్యాయంపై పావని ఒంటరి పోరాటం చేసింది. సీఐడీని ఆశ్రయించడంతో కథ మలుపు తిరిగింది. సీఐడీ సీఐ శేఖర్‌బాబు నేతృత్వంలోని అధికారులు ఇది పక్కా ప్లాన్‌తో చేసిన హత్య అని, ఇందులో ప్రధానంగా సజ్జా బుజ్జితో పాటు మరో ఆరుగురు ఉన్నారని తేల్చారు. ఈ వివరాలను పోలీసులకు అందించారు. దీంతో హడావిడిగా మళ్లీ పోలీసులు కేసును తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఏ1, ఏ2లుగా  ఉన్న టీడీపీ నేత సజ్జా బుజ్జి, బొల్లంపల్లి రమేష్‌తో పాటు ఏ3 గా ఉన్న నరసాపురం జెడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్, అతని సోదరుడు బాలం ఆండ్రూలను జూన్‌ 26న అరెస్ట్‌ చేశారు. మరోవారం తరువాత బొల్లంపల్లి రమేష్‌ కారు డ్రైవర్‌ కవురు లక్ష్మణ్‌ను, పథకాన్ని పక్కాగా అమలుచేసి శ్రీగౌతమి ప్రాణాలు తీసిన సుఫారి హంతకులు సందీప్, దుర్గాప్రసాద్‌ను అరెస్ట్‌చేసి కోర్టుకు పంపారు. నిజానికి ఇక్కడి వరకూ దర్యాప్తు చేసింది సీబీసీఐడీనే. పోలీసులు కనుక్కున్న కొత్త విషయం ఏమీలేదు. శ్రీగౌతమి కేసులో ప్రతిష్ట పోగొట్టుకున్న జిల్లా పోలీసులు దానిని సరిచేసుకునే యత్నం ఏమీచేయకపోవడం విశేషం. ప్రారంభంలో కేసు దర్యాప్తు పూర్తిగా పక్కదారి పట్టినట్టుగా సీబీసీఐడీ తేటతెల్లం చేసింది. ముఖ్యంగా అప్పటిలో నరసాపురం డీఎస్పీ, పాలకొల్లు రూరల్‌ సీఐ ఇతర దర్యాప్తు అధికారులు అంతా కూడా సజ్జా బుజ్జి సొంత సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో కేసు పక్కదారి పట్టించారనే విమర్శలు ఉన్నాయి.


హోంశాఖ మంత్రి చినరాజప్ప చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న సీఐడీ సీఐ  శేఖర్‌బాబు

చార్జ్‌షీట్‌ ఇంకా ఎందుకు వేయలేదు?
హత్యకేసులో 90 రోజుల్లో చార్జ్‌షీట్‌ వేయాలి. అసలు శ్రీగౌతమి ప్రమాద కేసును 2018 జూన్‌ 26న హత్య కేసుగా మార్చారు. 5 నెలలు అవుతున్నా చార్జ్‌షీట్‌ ఫైల్‌ చేయలేదు.  అంతకుముందు ప్రమాదంగా చెప్పిన అంశంపైనా చార్జిషీట్‌ ఫైల్‌ చేయలేదు.  సజ్జా బుజ్జిని, ఇతర నిందితులను కాపాడడానికి అదృశ్య శక్తులు ఇంకా పనిచేస్తూనే ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు పోలీసులూ ప్రారంభంలో జరిగిన తప్పును ఇప్పటి తూతూమంత్రపు దర్యాప్తుతో దులిపేసుకుంటున్నట్టుగా కనిపిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నరసాపురం సబ్‌జైలులో రిమాండ్‌ అనుభవించిన నిందితులకు ఇటీవల కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. చివరికి ఈ కేసు ఏం జరుగుతుందనే అంశం ఆసక్తిగా మారింది. 

దొరకని ప్రశ్న!
‘సజ్జా బుజ్జితో పాటు మరో ఆరుగురి పాత్రను గుర్తించాం. అయితే ఈ కేసు దర్యాప్తు ఇప్పటికీ సగమే పూర్తయ్యింది’ అని పాలకొల్లు రూరల్‌ సీఐ కె.రజనీకుమార్‌ శ్రీగౌతమి హత్యకేసు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టే ముందు గత జూన్‌నెల 26న చెప్పిన మాట ఇది. సాక్షాత్తు పోలీసులే చెప్పిన మిగిలిన సగం దర్యాప్తు ఏమైయ్యిందనేది ఎవరికీ సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది.

న్యాయం జరిగే వరకూ పోరాటం: పావని
మా అక్కను దారుణంగా చంపేశారు. అప్పట్లో పోలీసులు మా గోడు పట్టించుకోలేదు. కేసును పక్కదారి పట్టించిన పోలీసులపై చర్యలు తీసుకోలేదు. ఇది దారుణం. అప్పట్లో మా అక్కను చంపేశారు అంటే చాలా హీనంగా మాట్లాడేవారు. ఈ కేసులో పోలీసులు ఏమీ చేయలేదు. సీఐడీ వారే చేశారు. వారికి అవార్డు రావడం సంతోషమే. హత్య  వెనుక ఉన్న వ్యక్తులను బయటకు లాగాలి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top