దారుణం

Murder in Conflicts West Godavari - Sakshi

ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ

గొడవ ఆపేందుకు వెళ్లిన వ్యక్తిపై చాకుతో దాడి

కంఠం తెగడంతో మృతి

మరొకరికి తీవ్రగాయాలు

తాడేపల్లిగూడెంలో ఘటన

పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం అర్బన్‌ : ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణను ఆపేందుకు వెళ్లిన వ్యక్తి హత్యకు గురైన సంఘటన తాడేపల్లిగూడెం పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం ఎన్నికల సందర్భంగా పట్టణంలో హడావిడి నెలకొంది. స్థానిక మసీదు సెంటర్‌ ప్రాంతానికి చెందిన షేక్‌జాని, మద్దుకూరి సంపత్‌ గురువారం రాత్రి అదే ప్రాంతంలో తిరుగుతున్నారు. గతంలో వీరిద్దరి మధ్య గొడవలు జరగడంతో మనస్పర్థలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో గురువారం  అర్థరాత్రి షేక్‌జానీని మద్దుకూరి సంపత్‌ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. దీంతో షేక్‌జాని సంపత్‌పై కలబడేందుకు ప్రయత్నించాడు. సంపత్‌ తన వద్ద ఉంచుకున్న సర్జికల్‌ చాకుతో జానీపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అదే ప్రాంతానికి చెందిన పిల్లి వెంకటేశ్వరరావు (38) (పిల్లి వెంకన్న) వారిద్దరు గొడవపడుతుండడాన్ని చూసి వారించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో సంపత్‌ వెంకన్నపైనా దాడి చేశాడు. దీంతో వెంకన్న అడ్డుకునేందుకు ప్రయత్నించగా మణికట్టుపై  గాయమైంది. చేతిపై గాయాన్ని చూసుకుంటున్న సమయంలో సంపత్‌ వెంకన్న కంఠంపై బలంగా చీరాడు. దీంతో తీవ్రగాయమైంది. వెంకన్న తన కంఠానికి చేయి అడ్డుపెట్టుకుని రోడ్డుపై పరుగుతీశాడు. అదే సమయంలో వెంకన్న స్నేహితుడు జోసెఫ్‌ మోటారుసైకిల్‌పై వస్తున్నాడు. జోసఫ్‌ సహకారంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నాడు.

చికిత్స పొందుతూ మృతి
కంఠానికి తీవ్రగాయం కావడంతో అధికంగా రక్తస్రావమైంది.వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో వెంకన్న మృతి చెందాడు. కంఠంపై తీవ్రగాయం అయిన సమయంలో వెంకన్న శరీరం నుంచి అయిన రక్తస్రావం రోడ్డుపై చారికలుగా పడింది.ఆ దృశ్యాన్ని చూసిన ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. వెంకన్నకు భార్య, ఇద్దరు కుమార్తెలు, తల్లి, ఇద్దరు సోదరులు, సోదరి ఉన్నారు. వెంకన్న మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను, స్నేహితులను కంఠతడి పెట్టించాయి.

పోలీసుల అదుపులో సంపత్‌
పిల్లి వెంకన్న, షేక్‌జానీలపై విచక్షణా రహితంగా చాకుతో దాడిచేసిన మద్దుకూరి సంపత్‌ను పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. దాడికి సంభవించిన కారణాలపై విచారిస్తున్నారు. సీఐ సుభాష్‌ ఆధ్వర్యంలో ఎస్సై బి.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆసుపత్రిలో కోటుకుంటున్న షేక్‌జానీ
సంపత్‌ సర్జికల్‌ చాకుతో చేసిన దాడిలో షేక్‌జానీ తీవ్రంగా గాయపడ్డాడు. కుడిచేతి మణికట్టు వద్ద నుంచి మోచేయి వరకు తీవ్రగాయమైంది. శరీరంపై తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వెంటనే షేక్‌జానిని పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తణుకు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం షేక్‌జాని ఆరోగ్య స్థితి బాగానే ఉందని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top