స్కర్ట్‌ ధరించడం వల్లే.. మోడల్‌కు షాకింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌!

model details molestation ordeal in social media - Sakshi

ఇండోర్‌: నడిరోడ్డుపై తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఇండోర్‌కు చెందిన ఓ మోడల్‌, బ్లాగర్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించారు. యాక్టివా బైక్‌ మీద వెళుతుంటే.. ఇద్దరు వ్యక్తులు వెంబడించి.. తాను ధరించిన స్కర్ట్‌ను లాగేందుకు ప్రయత్నించారని ఆమె తెలిపారు. సోమవారం ఇండోర్‌లోని రద్దీ రోడ్డులో ఈ ఘటన జరిగిందని ఆమె వెల్లడించారు.

‘ఇది ఈ రోజే జరిగింది. నేను యాక్టివా మీద వెళుతుంటే.. ఇద్దరు ఆకతాయిలు నా స్కర్ట్‌ను లాగేందుకు ప్రయత్నించారు. ‘దాని కింద ఏముంది చూపించు’ అంటూ అసభ్య వ్యాఖ్యలు చేశారు. వాళ్లను నేను ఆపేందుకు ప్రయత్నించి.. బ్యాలెన్స్‌ తప్పి కిందపడిపోవడంతో గాయాలు అయ్యాయి. ఇండోర్‌లోని రద్దీ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఎవరూ వారిని ఆపేందుకు ప్రయత్నించలేదు. వారు వెళ్లిపోయారు. వారి బైక్‌ నంబర్‌ను కూడా చూడలేకపోయాను. ఎప్పుడులేనిది నేను ఎంతో నిస్సహాయురాలినని అనిపించింది. ఏం జరిగినా చూస్తూ ఉండే అమ్మాయిని కాదు నేను. కానీ, ఆ రాక్షసులు వెళ్లిపోతున్నా నేను చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. నా స్నేహితులు దగ్గరిలోని కేఫ్‌కు తీసుకెళ్లారు. నేను బలహీనురాలిని కాదు కానీ ఆ సమయంలో ఘటనను మరిచిపోవాలనుకున్నా. నోట మాటరాకుండా స్తబ్ధుగా ఉండిపోయాను’అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఏ దుస్తులు వేసుకోవాలన్నది తన ఇష్టమని, స్కర్ట్‌ వేసుకున్నంత మాత్రాన అసభ్యంగా ప్రవర్తించే హక్కు వారికి ఇచ్చినట్టు కాదని ఆమె ఘాటుగా పేర్కొన్నారు. స్కర్ట్‌ వేసుకున్నందుకే ఇలా జరిగిందని తాను పడిపోయిన తర్వాత సాయంగా వచ్చిన ఓ వ్యక్తి చెప్పాడని, ఆ వ్యాఖ్య తనను ఎంతగానో బాధించిందని ఆమె అన్నారు. రద్దీ రోడ్డులోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఎవరు లేని వీధుల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందోనని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు కూడా లేవని, అయినా ఘటనపై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, పోలీసులు ఆ ఆకతాయిలను గుర్తించకపోయినా, తన హక్కును వినియోగించుకోవడానికి వెనుకాడబోనని ఆమె పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ సీఎం శివ్‌రాజ్‌ చౌహాన్‌ ట్విట్టర్‌లో స్పందించారు. దుండగులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top