వరకట్న దాహానికి బలైన యువతి

Married Woman Commits Suicide Over Dowry Harassment - Sakshi

సాక్షి, సారంగాపూర్‌(జగిత్యాల) : మూడుముళ్లు వేసి ఏడడుగులు నడిచిన భర్తను కాదని మరో యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. చివరికి వరకట్నం వేధింపులకు నిండు జీవితం బలైన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్సై రాజయ్య కథనం ప్రకారం..సారంగాపూర్‌ మండలం నాగునూర్‌ గ్రామానికి చెందిన నలువాల నర్మద (22) అనే వివాహిత యువతి శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. గతంలో పెద్దలు నిర్ణయించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అనంతరం మరో యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకొని రెండేళ్లు కాపురం చేసింది. అంతలోనే భర్త, అత్త , బావలు వరకట్నం వేధింపులకు గురి చేయడంతో తల్లిగారింటికి వచ్చి ఉరి వేసుకుంది. (నా సహ భారతీయుడా: ప్రధాని మోదీ)

జగిత్యాల రూరల్‌ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన నలువాల శ్రీనివాస్‌ని నర్మద ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నినెలలపాటు వీరిదాంపత్యం సాఫీగానే సాగింది. వరకట్న వేధింపులు నర్మదను కష్టాల్లోకి నెట్టాయి. భర్త శ్రీనివాస్‌తోపాటు, అత్త నలువాల లక్ష్మీ, బావ నలువాల అనిల్‌ రూ.2 లక్షలు తీసుకురావాలని వేధించారు. తీవ్ర మానసిక క్షోభకు గురైన నర్మద కుటుంబసభ్యులకు చెప్పగా పెద్దల సమక్షంలో చర్చించి కాపురం సాఫీగా సాగేలా చేశారు. అయినా వేధింపులు ఆగలేదు. మార్చిలో నాగునూర్‌ గ్రామంలో తల్లిగారింటికి రాగా శుక్రవారం భర్త శ్రీనివాస్‌ గ్రామానికి వచ్చి నర్మదను దూషించాడు. గ్రామస్తులంతా గమనిస్తుండగానే తిడుతూ ఆమెపై చేయిచేసుకున్నాడు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మనస్తాపానికి గురైన నర్మద ఇంట్లోని దూలానికి చున్నీతో ఉరివేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు పోలీస్‌వాహనంలో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందింది. సంఘటన స్థలాన్ని డీఎస్పీ వెంకటరమణ, సారంగాపూర్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌ పంచనామా నిర్వహించారు. నర్మద భర్త శ్రీనివాస్, అత్త లక్ష్మీ, బావ అనిల్‌ ముగ్గురిపై మృతురాలి తల్లి అరికిల్ల శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. (‘కబీర్‌ సింగ్‌’ చూసి.. అమ్మాయిలకు ఎర! )

అదృశ్యమై...చెట్టుకు ఉరేసుకొని..
సైదాపూర్‌(హుస్నాబాద్‌): ఐదురోజులక్రితం ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన వ్యక్తి ఐదురోజులకు చెట్టుకు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం ఎగ్లాస్‌పూర్‌లో నల్లకుంటప్రాంతంలో శుక్రవారం సంఘటన చోటు చేసుకుంది. సైదాపూర్‌ పోలీసులు, గ్రామస్తుల ప్రకారం..ఎగ్లాస్‌పూర్‌ గ్రామానికి చెందిన చిక్కుల కొమురయ్యకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండో కుమారుడు చిక్కుల మొగిలి(35)కి పదేళ్లక్రితం హైదరాబాద్‌లో ఓ మహిళతో వివాహం జరిగింది. మొగిలి చిన్నప్పుడు 7వతరగతి అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. ఏడేళ్ల తర్వాత హైదరాబాద్‌లో దొరికాడు. అప్పటినుంచి హైదరాబాద్‌–ఎగ్లాస్‌పూర్‌ వస్తూపోతుంటాడు. (యూకేలో భారత సంతతి వైద్యుడి మృతి )

పదేళ్లక్రితం హైదరాబాద్‌ యువతితో పెళ్లి చేసుకున్నాడు. భార్యాభర్తలు అక్కడే ఉంటున్నారు. మార్చిలో కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌తో ఎగ్లాస్‌పూర్‌ వచ్చారు. నెలక్రితం భార్య హైదరాబాద్‌ వెళ్లింది. మొగిలి మాత్రం ఇక్కడే ఉండిపోయాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని ఇంటి వద్ద గుంట స్థలం ఇటీవలే విక్రయించిన తండ్రి కొమురయ్య అప్పులు తీర్చాడు. కాగా మొగిలి మద్యానికి బానిసై ఈ నెల 25న సాయంత్రం ఇంట్లోంచి బయటికి వెళ్లి రేకొండ వైపు వెళ్లాడు. మొగిలి కనిపించడం లేదని ఈ నెల 28న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఎగ్లాస్‌పూర్‌ గ్రామ శివారులోని నల్లకుంట ప్రాంతంలో గొర్రెల కాపరులు చెట్టుకు ఉరేసుకొని మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇచ్చారు. సైదాపూర్‌ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడికి పిల్లలు లేరు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top