ఇన్‌ఫార్మర్‌ నెపంతో చంపేశారు

Maoists Killed TRS Leader Nalluri Srinivasa Rao - Sakshi

కిడ్నాప్‌ అయిన టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ హత్య

సోమవారం రాత్రి నల్లూరి శ్రీనివాసరావు అపహరణ

శుక్రవారం హతమార్చిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మృతదేహం లభ్యం

ఘటనా స్థలంలో చర్ల–శబరి కమిటీ కార్యదర్శి పేరుతో లేఖ

ఇన్‌ఫార్మర్‌ కావడంతోనే చంపినట్టు వెల్లడి

సాక్షి, కొత్తగూడెం : టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ కిడ్నాప్‌ ఉదంతం విషాదాంతమైంది. ఇన్‌ఫార్మర్‌ నెపంతో మావోయిస్టులు ఆయన్ను హత్యచేశారు. అనంతరం మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్‌ సరి హద్దు అటవీ ప్రాంతంలో వదిలి వెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధి లోని బెస్తకొత్తూరుకు చెందిన పెదమిడిసిలేరు ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును ఈనెల 8న మావోయిస్టులు అపహరించి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనివాసరావును మావోయిస్టులు బలవంతంగా ఆయన బైక్‌పైనే తీసుకెళ్లారు. అనంతరం ఆయన్ను చంపేశారని ఒకసారి, విడుదల చేశారని మరోసారి ఊహాగానాలు చెలరేగాయి. చివరకు ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఆయన మృతదేహం లభ్యంకావడంతో హత్య సంగతి వెలుగుచూసింది. మావోయిస్టులు శుక్రవారం సాయంత్రం చర్ల నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రంపాడు శివారులో ఛత్తీస్‌గఢ్‌లోని పుట్టపాడుకు వెళ్లే మార్గంలో శ్రీనివాసరావు మృతదేహాన్ని, ఆయన బైక్‌ను వదిలిపెట్టి వెళ్లారు. మృతుడికి భార్య దుర్గ, కుమారుడు ప్రవీణ్‌కుమార్‌ ఉన్నారు. శ్రీనివాసరావు 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పెదమిడిసిలేరు నుంచి ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వచ్చే నెల 7వ తేదీ వరకు ఆయన పదవీకాలం ఉంది. 

వేడుకున్నా కనికరించలేదు.. 
శ్రీనివాసరావును విడుదల చేయాలని కుటుంబ సభ్యులు వేడుకున్నా మావోయిస్టులు కనికరించలేదు. ఆయన కిడ్నాప్‌ అయిన వెంటనే గ్రామానికి చెందిన సుమారు 300 మంది సరిహద్దు అటవీప్రాంతంలో గాలించారు. ఈ క్రమంలో తారసపడిన కొందరు ఆదివాసీలు.. శ్రీనివాసరావును వదిలిపెడతారని, మీరు వెనక్కి వెళ్లిపోవాలని వారికి చెప్పడంతో ఆయన్ను విడుదల చేస్తారని భావించారు. అయితే, బుధవారం ఆయన్ను చంపేశారంటూ ప్రచారం జరగ్గా.. గురువారం విడుదల చేశారంటూ ప్రచారం సాగింది. చివరకు హత్యచేసిన సంగతి శుక్రవారం నిర్ధారణ అయింది. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కార్యకర్తను మావోయిస్టులు హతమార్చడం ఇదే మొదటిసారి. మృతదేహం వద్ద చర్ల–శబరి ఏరియా కమిటీ కార్యదర్శి శారద పేరుతో మావోయిస్టులు ఓ లేఖ వదిలి వెళ్లారు. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నందునే శ్రీనివాసరావును హతమార్చినట్లు అందులో పేర్కొన్నారు. పోలీసులతో కలిసి మావోయిస్టు పార్టీని నిర్మూలించేందుకు ఆదివాసీ గ్రామాల్లో ఇన్‌ఫార్మర్లను తయారు చేస్తున్నాడని.. దళాల సంచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పోలీసులకు చేరవేయడంతోపాటు ప్రజాసంఘాల వారిని అరెస్టు చేయిస్తున్నాడని ఆరోపించారు. ‘‘ఆదివాసీలకు చెందిన 70 ఎకరాల భూమిని పోలీసుల ప్రోద్బలంతో అక్రమంగా గుంజుకున్నాడు. ప్రశ్నించేవారిని అరెస్టులు చేయిస్తున్నాడు. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరోతో కలిసి ఆదివాసీ సంఘాల పేరుతో మావోయిస్టులపై దుష్ప్రచారం చేస్తున్నాడన్నాడు. ఆదివాసీలకు, వారికి నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీకి అడ్డుగా నిలుస్తుండటంతో ఖతం చేశాం’’అని ఆ లేఖలో పేర్కొన్నారు. 

గతంలో అపహరించినవారిని విడిచిపెట్టారు.. 
2014లో తెలంగాణ మొదటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని నెలలకు టీఆర్‌ఎస్‌ భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జి మానె రామకృష్ణ, మరో నలుగురిని మావోయిస్టులు అపహరించి ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. నాలుగు రోజుల తర్వాత వదిలిపెట్టారు. మావోయిస్టులకు అనుకూలమని చెప్పిన టీఆర్‌ఎస్‌.. తర్వాత వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, ఈ వైఖరి మార్చుకోవాలని హెచ్చరిస్తూ విడుదల చేస్తున్నట్లు అప్పుడు పేర్కొన్నారు. శ్రీనివాసరావును కూడా అలాగే విడుదల చేస్తారని భావించినా, ఆయన్ను హతమార్చారు. 

శ్రీనివాసరావు ఇన్‌ఫార్మర్‌ కాదు 
చర్ల మండలం బెస్త కొత్తూరు గ్రామానికి చెందిన నల్లూరి శ్రీనివాసరావు అనే రైతును నాలుగు రోజుల క్రితం కిడ్నాప్‌ చేసిన మావోయిస్టులు శుక్రవారం ఆయన్ను దారుణంగా కొట్టి చంపారు. ఇది హేయమైన చర్య. శ్రీనివాసరావు పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ కాదు. ఆయనకు పోలీసులతో ఎలాంటి సంబంధం లేదు. మావోయిస్టులు తమ మనుగడ కోసం చర్ల ప్రాంతానికి చెందిన రైతులు, వ్యాపారస్తులను డబ్బుల కోసం వేధిస్తున్నారు. రైతులకు అండగా నిలిచే శ్రీనివాసరావు వంటి వ్యక్తులను చంపుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు. ఇలాంటి సంఘ విద్రోహక చర్యలకు పాల్పడే మావోయిస్టులపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం. – సునీల్‌దత్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top