ఒన్‌ సైడ్‌ ఉన్మాదం | Man Killed his Uncle Daughter in Tamil Nadu | Sakshi
Sakshi News home page

ఒన్‌ సైడ్‌ ఉన్మాదం

Apr 8 2019 12:00 PM | Updated on Apr 8 2019 8:44 PM

Man Killed his Uncle Daughter in Tamil Nadu - Sakshi

ప్రగతి మృతదేహం

లైంగిక దాడి జరిగింది..మూడు చోట్ల కత్తిపోట్లు

కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చిలో యువతలకు భద్రత కరువు అవుతోంది. ఇటీవల పొల్లాచ్చిలో మానవ మృగాళ్లు సాగించిన పైశాచికత్వం మరవకముందే, మరో ఘటన వెలుగు చూసింది. వందలాది మంది యువతుల జీవితాలతో ఆ మృగాళ్లు చెలగాటం ఆడితే, తాజాగా పొల్లాచ్చి పూజారి పట్టి వద్ద రోడ్డు పక్కనే అతి కిరాతకంగా హతమార్చ బడ్డ యువతి మృతదేహం బయటపడడంతో కలకలం రేపింది.

సాక్షి, చెన్నై: వన్‌ సైడ్‌ ప్రేమోన్మాదం మరోమారు పెట్రేగింది. మేనమామ కుమార్తెను అతి కిరాతకంగా ఉన్మాది కడతేర్చాడు. గొంత కోసి హతమార్చినట్టు నిందితుడు పేర్కొంటున్నా, ఆమె లైంగిక దాడికి గురైనట్టు, శరీరంపై మూడు చోట్ల కత్తి గాట్లతో పాటు, చేతి వేళ్లను సైతం కత్తిరించినట్టుగా పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేయడంతో విచారణ వేగం పెరిగింది. పట్టుబడ్డ నిందితుడికి సహకారంగా మరెవరైనా ఉన్నారా అన్న కోణంలో నాలుగు ప్రత్యేక బృందాలు దర్యాప్తులు నిమగ్నమయ్యాయి.

కలకలం : దిండుగల్‌ జిల్లా ఒట్టన్‌చత్రంకు చెందిన వెల్లైస్వామి కుమార్తె ప్రగతి(20) కోయంబత్తూరు జిల్లా ఆవారం పాళయంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. ప్రగతికి కుటుంబీకులు వివాహ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయంత్రం కళాశాల నుంచి ఆమె బయటకు వచ్చింది. షాపింగ్‌ అనంతరం స్వగ్రామానికి వెళ్లేందుకు నిర్ణయించింది. అయితే, తమ బిడ్డ ఎంతకు ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబీకుల్లో ఆందోళన బయలుదేరింది. కళాశాల వద్ద విచారించారు. పలుచోట్ల గాలించారు. ఎక్కడ ఆమె ఆచూకీ కానరాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అసలే పొల్లాచ్చిలో మానవ మృగాళ్ల పైశాచికత్వం వ్యవహారం కలకలం రేపి ఉన్న నేపథ్యంలో ప్రగతికి ఏదేని హాని జరిగిందా అన్న ఆందోళన కుటుంబీకుల్లో పెరిగింది.

కిరాతకంగా ..
పొల్లాచ్చి పూజారి పట్టి సమీపంలో శనివారం మధ్యాహ్నం రోడ్డు పక్కనే ఉన్న పొదల్లో స్థానికులు ఓ యువతి మృతదేహాన్ని గుర్తించారు. ఆమె గొంత కోయబడి ఉండడం, అర్ధనగ్నంగా పడి ఉండడం కలకలం రేపింది. పొల్లాచ్చి మృగాళ్ల వ్యవహారంతో ఈ కేసుకు సైతం ఏదేని సంబంధం ఉన్నదా అన్న అనుమానాలు బయలుదేరాయి. యువతిపై సామూహిక లైంగిక దాడి జరిగిన విధంగా మృతదేహం పరిస్థితి ఉండడంతో నాలుగు ప్రత్యేక బృందాల్ని పోలీసులు రంగంలోకి దించారు. విచారణలో ఆ యువతి ప్రగతిగా తేలడంతో కుటుంబీకుల్ని విషాదంలోకి నెట్టింది. గత నెల వివాహ నిశ్చితార్థం జరిగినట్టుగా తేలడంతో వన్‌ సైడ్‌ లవ్‌ వ్యవహారంలో ఈ హత్య జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రగతిని ఓ యువకుడు ప్రేమించాలని వెంటబడుతున్నట్టుగా సహచర విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు వేగాన్ని పెంచారు. ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా, ప్రగతి తనను తిరస్కరించడంతో తన దారి తాను చూసుకున్నట్టు ఆ యువకుడు పోలీసుల విచారణలో పేర్కొన్నాడు.

పట్టించిన నిఘా నేత్రాలు : కళాశాల నుంచి ప్రగతి బయటకు వచ్చిన సమయంలో ఆమె వెంట ఎవరైనా పడ్డారా అన్న కోణంలో నిఘా నేత్రాలపై దృష్టి పెట్టారు. ఓ పెట్రోల్‌ బంక్‌లో లభించిన దృశ్యాలు కేసును మరింత ముందుకు తీసుకెళ్లాయి. ఓ కారులో ప్రగతి, ఆమె పక్కన ఓ వ్యక్తి ఉండడంతో ఇది బాగా తెలిసిన వారి పనిగా ఉండవచ్చన్న నిర్ధారణకు పోలీసులు వచ్చారు. ఆ దృశ్యాల మేరకు ఆ వ్యక్తి తమ బంధువేనని ప్రగతి కుటుంబీకులు తేల్చారు. దీంతో కేసు ఓ కొలిక్కి వచ్చినట్టు అయింది. రాత్రికి రాత్రే ఆ యువకుడ్ని తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేపట్టగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ యువకుడు ఒట్టన్‌ చత్రంకు చెందిన సతీష్‌(27)గా తేలింది.

ప్రగతికి వరసకు బావ అయ్యే సతీష్‌ మూడేళ్లగా ఆమెను ప్రేమిస్తూ వచ్చాడు. కేరళ రాష్ట్రం పాలక్కాడులో ఫైనాన్స్‌ సంస్థ నడుపుతున్నారు. తనకు ప్రగతిని ఇచ్చి వివాహం చేయాలని రెండేళ్ల క్రితం మేనమామ వెల్‌లైస్వామిని సతీష్‌ అడిగాడు. ఇందుకు ఆయన అంగీకరించలేదు. చివరకు సతీష్‌కు మరో యువతితో కుటుంబీకులు వివాహం చేశారు. తనకు పెళ్లి అయినా ప్రగతిని మాత్రం సతీష్‌ ప్రేమిస్తూ వచ్చాడు. మేనమామ కుమార్తె కోయంబత్తూరులో చదువుతుండడం తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. తరచూ ఆమెను కలవడం, ఆమె అవసరాలను తీర్చడం జరిగేది. బావే కదా అన్న చనువుతో అతనితో మెలిగిన ప్రగతి చివరకు ఆ బావ చేతిలో అతి దారుణంగా హతమైంది.

పోస్టుమార్టం నివేదికతో మరిన్ని అనుమానాలు :  సతీష్‌ వద్ద జరిపిన విచారణలో శుక్రవారం ఏమి జరిగిందో అన్న వివరాలు బయటకు వచ్చాయి. కళాశాల ముగించుకుని షాపింగ్‌కు వెళ్లడానికి ప్రగతి సిద్ధ పడిందని పేర్కొన్నాడు. ఇదే అదనుగా ఆమెను కలిసి, ఇంటికి వెళ్దామంటూ కారులో తీసుకెళ్లానని వివరించాడు. మార్గమధ్యంలో వివాహ నిశ్చితార్థం విషయాన్ని తన దృష్టికి తెచ్చిందని, అలాగే, తన స్నేహితులకు విందు నిమిత్తం కొంత డబ్బు సైతం అడిగినట్టు పేర్కొన్నాడు. మరొకడికి సొంతం కాబోతున్న దానికి ఇంకెంత సొమ్ము ఇవ్వాలి, నగలు కొని ఇవ్వాలంటూ తనలోని ఉన్మాదిని సతీష్‌ బయటకు తీశాడు. తనను పెళ్లి చేసుకోవాలని వేధించడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

కోపోద్రిక్తుడైన సతీష్‌ కారులో ఉన్న కత్తితో ఆమె గొంతు కోశాడు. కాసేపు కారులోనే మృతదేహాన్ని ఉంచుకుని అర్ధరాత్రి సమయంలో పూజారి పట్టి వద్ద పడేసి వెళ్లినట్టు పోలీసులకు సతీష్‌ వాంగ్మూలం ఇచ్చాడు. అయితే, ప్రగతిపై లైంగిక దాడి జరిగినట్టు, శరీరం మీద మూడు చోట్ల కత్తి గాట్లు ఉండడం , ఆమె చేతి వేళ్లను కొరికినట్టుగా లేదా, కత్తితో నరికినట్టుగా ఉందని పోస్టుమార్టం నివేదిక తేల్చడంతో అనుమానాలు మరింతగా పెరిగాయి. సతీష్‌ ఒక్కడే ఈ కేసులో నిందితుడా వెనుక మరెవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు వేగాన్ని పెంచారు. సతీష్‌ను రహస్య ప్రదేశంలో ఉంచి తీవ్రంగా విచారిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం ప్రగతి మృతదేహాన్ని కుటుంబీకులకు పోలీసులు అప్పగించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement