కాలి నొప్పితో వస్తే కాటికి పంపారు

man Died In Private hospital With Doctors Negligance - Sakshi

చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి

బంధువుల ఆందోళన

పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

రాంగోపాల్‌పేట్‌: కాలి నొప్పితో బాధపడుతూ సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వస్తే వైద్యులు ఏకంగా కాటికే పంపారని ఆరోపిస్తూ మృతుని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చీర్యాలకు చెందిన యాదయ్య (38) గత కొద్ది రోజుల నుంచి వాస్కులర్‌ సమస్యతో బాధపడుతున్నాడు. కాళ్ల నొప్పులు తీవ్రం కావడంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వచ్చిన అతను వాస్కులర్‌ సర్జన్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ను సంప్రదించాడు. గుండె నుంచి కాలికి రక్తం సరఫరా చేసే ప్రధాన నాళంలో క్యానర్స్‌ గడ్డ ఉన్నందున శస్త్ర చికిత్సచేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.

ఇందుకు రూ.4లక్షలు ఖర్చవుతుందన్నారు.  యాదయ్య ఈ నెల 24న రూ. 3 లక్షలు చెల్లించి ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యాడు.  25న అబ్జ్వర్వేషన్‌లో ఉంచిన వైద్యులు 26న  శస్త్ర చికిత్స చేశారు. రాత్రి 9గంటల సమయంలో యాదయ్య చనిపోయినట్లు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే అతను మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. దీనిపై రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

అరుదైన కేసు: ఆస్పత్రి యాజమాన్యం
యాదయ్యకు సంబంధించి అరుదైన క్లిష్టమైన కేసు. 1996  నుంచి ఇప్పటివరకు ప్రపంచంలో కేవలం 22 కేసులు మాత్రమే గుర్తించారు.  గుండె నుంచి రక్తం సరఫరా చేసే ప్రదాన రక్త నాళంలో క్యాన్సర్‌ గడ్డ ఉంది. ఇలాంటి కేసుల్లో శస్త్ర చికిత్స చేసినా బతకడం కష్టం. కీ విషయాన్ని బంధువులకు ముందుగానే చెప్పాము.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top