పుట్టిన రోజునే పరలోకానికి..

man died in a canal  - Sakshi

వాగులో ఈతకు వెళ్లిన బాలుడు దుర్మరణం

అన్నయ్యకు, స్నేహితుడికి తప్పిన ముప్పు

ఐదు గంటల తరువాత మృతదేహం లభ్యం

కొత్తగూడెంఅర్బన్‌ : నిన్నటి గురువారం.. ఆ బాలుడి పుట్టిన రోజు. స్నేహితుడితో, అన్నయ్యతో కలిసి సరదాగా వాగులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఇసుక కోప్‌లో పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సీఐ శ్రీనివాస్, స్థానికులు తెలిపిన వివరాలు... రామవరం సాయిబాబా టెంపుల్, సీఆర్‌పీ క్యాంపునకు చెందిన భూతరాజు జగదీశ్వర్‌ అలియాస్‌ చంటి(15), రామవరం ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. నిన్నటి గురువారం అతడి పుట్టిన రోజు. అన్నయ్య సత్యసాయి, స్నేహితుడు గోపితో కలిసి రామవరం స్వర్ణభారతి స్కూల్‌ వెనుక భాగంలోగల గోధుమ వాగు వద్దకు మధ్యాహ్నం 3.30 సమయంలో వెళ్లాడు.

ముగ్గురూ ఒక్కసారిగా వాగులోకి దూకారు. రెండుసార్లు దూకి బయటికొచ్చారు. మూడోసారి మళ్లీ దూకారు. కొద్దిసేపు ఈదిన తరువాత సత్యసాయి, గోపి వెనక్కు వచ్చారు. జగదీశ్వర్‌ రాలేదు. వాగులో కనిపించ లేదు. ఎంతసేపటికీ రాకపోవడంతో వారిద్దరూ తీవ్ర భయాందోళనతో స్థానికులకు, కుటుంబీకులకు సమాచారమిచ్చారు. పోలీసులకు తెలిసింది. అందరూ వచ్చారు. ఈతగాళ్లతో ఐదు గంటలపాటు పోలీసులు వెతికించారు. రాత్రి 8.30 గంటల సమయంలో, జగదీశ్వర్‌ ఎక్కడైతే ఈత కోసం వాగులోకి  దూకాడో అక్కడే మృతదేహం దొరికింది. అతడి తల్లిదండ్రులు శ్రీను, రమ గుండెలు పగిలేలా పెద్దపెట్టున రోదించారు. వీరికి ఇద్దరే సంతానం. జగదీశ్వర్‌.. చిన్నోడు. 

అప్పటివరకు తమతో సరదాగా, సంతోషంగా గడిపిన జగదీశ్వర్‌.. అంతలోనే విగతుడిగా మారడాన్ని అతడి అన్న, స్నేహితుడు జీర్ణించుకోలేకపోయారు. ‘పుట్టిన రోజే.. చివరి రోజు అయిందారా..., అప్పడే నీకు నూరేళ్లు నిండాయా..?’ అంటూ తల్లిదండ్రులు రోదించారు. వారిని ఏదార్చడం ఎవరి తరం కాలేదు. మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. 

మృతికి ఇదే కారణమా...? 

‘‘రామవరం గోధుమ వాగు నుంచి కొందరు గత ఆరు నెలలుగా ఇసుకను తోడుతున్నారు. ఇటీవలి వర్షాలతో... ఇసుక తీసిన గుంతలు నీటితో నిండాయి. ఆ ఇసుక కోప్‌లోనే జగదీశ్వర్‌ దూకాడు. లోపల చిక్కుకుపోయి, బయటకు రాలేక మృతిచెందాడు’’ అని, పోలీసులు.. స్థానికులు భావిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top