నా భార్యను అప్పగించకపోతే ఆత్మహత్యే శరణ్యం

Man Complaint on Life Threats Wife Kidnap in Hyderabad - Sakshi

పంజగుట్ట: ప్రేమించి పెళ్లి చేసుకున్న తమను విడదీసి ఆమె కుటుంబసభ్యులు తన భార్యను బలవంతంగా తీసుకెళ్లడమే కాకుండా పోలీసుల అండతో తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని తనను కాపాడాలని బాధితుడు విశాఖపట్నం ప్రాంతానికి చెందిన పొన్నాన ప్రభాస్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ విశాఖపట్నం నగరానినికి చెందిన తాను హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఉంటూ బిఎఫ్‌ఏ చదువుతున్నట్లు తెలిపారు. గత డిసెంబర్‌లో అదే ప్రాంతంలోని లోధా అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న తన్వి అనే యువతితో పరిచయం ఏర్పడటంతో ఇద్దరం ప్రేమించుకున్నట్లు తెలిపాడు. ఫిబ్రవరి 15న శ్రీనగర్‌కాలనీలోని సాయిబాబా దేవాలయంలో స్నేహితులు, తన్వి సోదరి సమక్షంలో పెళ్లి చేసుకున్నామన్నారు. తన్వి తరచూ తనను వారి ఇంటికి తీసుకువెళ్లేదని, వారి అమ్మతో మాట్లాడే వాడినని తెలిపాడు.

గత ఆరు నెలలుగా అదే అపార్ట్‌మెంట్‌లోనే  ఫ్లాట్‌ అద్దెకు తీసుకుని ఉంటున్నామన్నారు. గత నెల 7న తన్వీ కుటుంబసభ్యులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లి గృహనిర్భంధం చేశారని, అదే రోజు రాత్రి కెపీహెచ్‌బీ పోలీసులు తనను బలవంతంగా అరెస్టు చేసి తీసుకు వెళ్లారని, స్టేషన్‌లో మూడు గంటల పాటు చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిపాడు. పోలీసుల ఎదుటే తన్వి తండ్రి శ్రీనివాసరావు కొందరు వ్యక్తులు తనపై దాడి చేశారని, తన ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసి తన భార్య దుస్తులు, పెళ్లి జరిగిన ఆధారాలను తీసుకెళ్లినట్లు తెలిపారు. తన ఫోన్, ల్యాప్‌ట్యాప్, ఇంట్లో ఉన్న బంగారం కూడా తీసుకెళ్లారని ఆరోపించాడు. న్యాయం చేయాల్సిన పోలీసులే నిందితులతో చేతులు కలిపి తనను వేధిస్తున్నారని ఆరోపించాడు. ప్రతీ రోజు తనను చంపేస్తామని బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని, తన ప్రాణాలకు హాని ఉందన్నారు. ఈ విషయం తెలియడంతో తమ కుటుంబసభ్యులు తనను విశాఖపట్నం రానివ్వడంలేదని, అటు భార్య దూరమై, ఇటు కన్నవారు దూరమై ఒంటరి అయిపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్యను అప్పగించకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమన్నాడు. తన్వి చాలా మంచిదని, ఆరు నెలలు తాము ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. తన్విని గృహ నిర్భంధం చేసిన ఆమె కుటుంబసభ్యులు తనను కలవకుండా చూస్తున్నారన్నారు. రాష్ట్ర హోం మంత్రి, పోలీస్‌ కమిషనర్‌ జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని కోరాడు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top