పోలీసు అధికారిణికి వేధింపులు, నిందితుడి అరెస్ట్‌

Man arrested For creating Fake Profiles Of Women IAS, IPS Officers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి అసభ్యంగా పోస్టులు పెడుతూ సీనియర్‌ పోలీసు అధికారిణిని వేధిస్తున్న వ్యక్తిని నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తన పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలు సృష్టించి అధికారిక ఫొటోలను మార్ఫింగ్‌ చేసి అసభ్యకర వ్యాఖ్యలతో పోస్టులు పెడుతున్నారని ఓ సీనియర్‌ పోలీసు అధికారిణి ఈ నెల 3న సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌ మోహన్‌రావు నేతృత్వంలోని బృందం టెక్నికల్‌ డాటాతో నిందితుడు కృష్ణా జిల్లాలో ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం నిందితుడు కూనపురెడ్డి మన్మోహన్‌ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.   

నిందితుడి స్వస్థలం కృష్ణాజిల్లా పెద ఓగిరాల. నిందితుడు  కూనపురెడ్డి మన్మోహన్‌ సివిల్స్‌కు ప్రయత్నం చేశాడు. అయితే పరీక్షలో పాస్‌ అయినా... ఇంటర్వ్యూలో ఫెయిల్‌ అయ్యాడు. దీంతో అతగాడు సైకోలా మారాడు. మహిళా ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారిణుల పేరుతో సోషల్‌ మీడియాలో ఖాతాలు తెరిచి అసభ్యకర పోస్టులు పెడుతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రలో విధులు నిర్వహిస్తున్న సుమారు 54మంది అధికారుణుల పేరుతో ఈ ఖాతాలు తెరిచి...పోస్టులు చేస్తున్నాడు. హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారిణి  తన పేరుతో ఫేస్‌బుక్‌లో  ఉన్న నకిలీ ఖాతాను గుర్తించారు. దీంతో ఫేస్‌బుక్‌ సంస్థ ప్రతినిధుల ద్వారా దాన్ని తొలగించినా... నిందితుడు మళ్లీ ఖాతా సృష్టించి అసభ్యకర పోస్టులు పెట్టాడు. ఇలా ఏకంగా నాలుగుసార్లు చేయడంతో విసుగెత్తిన ఆ అధికారిణి సైబర్‌ క్రైమ్‌ను ఆశ్రయించారు. దీంతో సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్నారు.

సివిల్స్‌లో ర్యాంకు రావడం లేదని.. ఆత్మహత్యాయత్నం 
సివిల్స్‌లో ర్యాంకు రాకపోవడంతో మనస్తాపానికిలోనైన ఓ యువతి మూసీనదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం రాత్రి అంబర్‌పేట పోలీస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌కుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వనస్థలిపురం ప్రాంతానికి చెందిన సైదా కుమార్తె ఇంద్రజ(27) సివిల్స్‌కు శిక్షణ పొందుతోంది. పలుమార్లు పరీక్ష రాసినా ర్యాంకు రాలేదు. దీంతో గత కొంత కాలంగా మానసికంగా బాధపడుతోంది. 


ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కారులో అంబర్‌పేట నుంచి మూసారాంబాగ్‌ మూసి బ్రిడ్జి మీదుగా ఇంటికి వెళుతున్న ఆమె కడుపులో తిప్పుతున్నట్లు అవుతుందని, కారు అపాల్సిందిగా డ్రైవర్‌ను కోరడంతో కారును నిలిపాడు. కారులో దిగిన ఆమె బ్రిడ్జి పైనుంచి ఒక్కసారిగా నదిలోకి దూకింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్‌ నీటిలోకి దూకాడు. నీటి ప్రవాహానికి ఆమె ఒడ్డువైపు రావడంతో డ్రైవర్, వాహనదారులు కలిసి రక్షించారు. పోలీసులు ప్రాథమిక చికిత్స చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top