అడ్డదారి తొక్కిన అడ్వకేట్‌!

Lawyer Arrest in Finance Company Cheating Case - Sakshi

ఫైనాన్స్‌ ఎగ్గొట్టడానికి కారు చోరీ కథ

వాహనం రంగు, నంబర్‌    మార్చి వినియోగం

వలపన్ని పట్టుకున్న సీసీఎస్‌ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో:అతడో న్యాయవాది... ఫైనాన్స్‌పై ఓ హైఎండ్‌ వెహికిల్‌ కొన్నాడు... ఇంత వరకు బాగానే ఉన్నా.. అతడికి పుట్టిన ఓ దుర్బుద్ధి కటకటాల్లోకి పంపింది. ఫైనాన్స్‌ ఎగ్గొట్టడంతో పాటు కారును సొంతం చేసుకోవడానికి చోరీ నాటకానికి  తెరలేపాడు. అబిడ్స్‌ ఠాణాలో నమోదైన ఈ కేసు సీసీఎస్‌కు బదిలీ కావడంతో అతగాడి గుట్టురట్టయింది. శుక్రవారం ఆటోమొబైల్‌ టీమ్‌ అధికారులు న్యాయవాది సయ్యద్‌ సఫియుల్లా హుస్సేనీని అరెస్టు చేసినట్లు డీసీపీ అవినాష్‌ మహంతి పేర్కొన్నారు. 

ముందు బ్యాంకు... ఆపై ఫైనాన్స్‌ సంస్థ...
హస్సేనీ 2016 అక్టోబర్‌ 18న చాంద్రాయణగుట్టలోని కేబీ మోటర్స్‌ నుంచి రూ.17.5 లక్షలు వెచ్చించి సెకండ్‌ హ్యాండ్‌ కారు (ఏపీ 03 ఏజెడ్‌ 0001) ఖరీదు చేశాడు. 2017లో రాణిగంజ్‌లో ఉన్న యాక్సస్‌ బ్యాంకులో వాహన రుణం కోసం దరఖాస్తు చేశాడు. దీంతో అదే ఏడాది ఫిబ్రవరి 19న రూ.10.24 లక్షలు మంజూరయ్యాయి. దాదాపు ఏడాది పాటు వాయిదాలు చెల్లించిన హుస్సేనీ ఆపై ప్రైవేట్‌ సంస్థ నుంచి రుణం తీసుకోవాలని భావించాడు. దీంతో గతేడాది ఫిబ్రవరిలో బంజారాహిల్స్‌లోని క్లిక్స్‌ ఫైనాన్స్‌ ఇండియా అన్‌ లిమిటెడ్‌ సంస్థను ఆశ్రయించాడు. పూర్వాపరాలు పరిశీలించిన ఈ సంస్థ అదే నెల 28న రూ.12.67 లక్షలు రుణం మంజూరు చేసింది. ఇందులో రూ.9.24 లక్షల్ని యాక్సిస్‌ బ్యాంక్‌నకు బదిలీ చేసిన ఈ సంస్థ మిగిలిన రూ.3.42 లక్షల్ని హుస్సేనీ ఖాతాకు పంపింది. 

అవి మార్చేసి స్వస్థలానికి తరలించి...
ఈ ప్రైవేట్‌ సంస్థకు కేవలం ఒక్క నెల మాత్రమే వాయిదా చెల్లించిన హుస్సేని ఆపై అసలు కథ మొదలెట్టాడు. ఈ వాహనం చోరీకి గురైందని ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించాలని అనుకున్నాడు. అలా చేస్తే ఈ కేసు క్లోజ్‌ అయిన తర్వాత ఫైనాన్స్‌ సంస్థకు ఇన్సూరెన్స్‌ సొమ్ము వస్తుందని అనుకున్నాడు. క్లోజ్‌ అయినందుకు పోలీసులు, సొమ్ము వచ్చినందుకు ఇన్సూరెన్స్‌ కంపెనీ వారూ తనను పట్టించుకోరని, కారు సొంతమైపోతుందని పథకం వేశాడు. దీన్ని అమలులో పెట్టేందుకు లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని దుకాణాల్లో తన తెల్ల రంగు కారుకు నల్లరంగు వేయించడాడు. రిజిస్ట్రేషన్‌ నంబర్‌ సైతం ఏపీ 03 ఏటీ 0567గా మార్చేశాడు. ఈ వాహనాన్ని తన స్వస్థలమైన సంగారెడ్డికి తీసుకువెళ్లి తన షెడ్‌ వెనుక వైపు రహస్యంగా దాచేశాడు. 

‘ఆధారాలు దొరక్కుండా’ ఫిర్యాదు...
అబిడ్స్‌లోని బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ వద్ద పార్క్‌ చేసిన తన కారు పోయిందంటూ స్థానిక పోలీసుల్ని ఆశ్రయించాలని భావించాడు. అయితే వెంటనే ఫిర్యాదు చేస్తే సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తే తన బండారం బయటపడుతుందని అనుకున్నాడు. దీంతో నాలుగు నెలల పాటు వేచి చూసి గతేడాది జూలైలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి వరకు సీసీ కెమెరాల ఫీడ్‌ ఉండదుకాబట్టి తాను సేఫ్‌ అని అనుకున్నాడు. ఈ కేసును రెండు నెలల పాటు దర్యాప్తు చేసిన అబిడ్స్‌ అధికారులు చివరకు సీసీఎస్‌కు బదిలీ చేశారు. దర్యాప్తు ప్రారంభించిన ఆటోమొబైల్‌ టీమ్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.లచ్చిరాం అనేక అంశాలపై దృష్టి పెట్టారు. వాహనం చోరీ అయితే ఎవరైనా వెంటనే ఫిర్యాదు చేయాలి. నాలుగు నెలలు ఆలస్యంగా పోలీసు వద్దకు రావడాన్ని ఆయన అనుమానించారు.

నెల రోజులు కాపుకాసి...
దీంతో న్యాయవాది పూర్వాపరాలపై దృష్టి పెట్టారు. ఆయన స్వస్థలమైన సంగారెడ్డిలోని మునిపల్లికీ పలుమార్లు వెళ్లొచ్చారు. అయినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ కేసులో హుస్సేనీనే ప్రధాన అనుమానితుడిగా భావించిన ఇన్‌స్పెక్టర్‌ లచ్చిరాం తన బృందంతో సంగారెడ్డి చుట్టుపక్కల నెల రోజుల పాటు కాపు కాశారు. గురువారం నల్లరంగు కారులో బయటకు వచ్చిన అతగాడిని బుడేరా క్రాస్‌రోడ్స్‌లో పట్టుకున్నారు. వాహనం రంగు, రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ మారినప్పటికీ ఇంజిన్, ఛాసిస్‌ నెంబర్లు తనిఖీ చేయగా అసలు విషయం బయట పడింది.దీంతో హుస్సేనీని అరెస్టు చేసిన సీసీఎస్‌ పోలీసులు వాహనం స్వాధీనం చేసుకుని నగరానికి తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top