వెలుగులోకి మోసాల చిట్టా | KSS Travels Cheating Files Hikes In YSR Kadapa | Sakshi
Sakshi News home page

వెలుగులోకి మోసాల చిట్టా

May 31 2018 12:53 PM | Updated on May 31 2018 12:53 PM

భేటీ...రాజంపేట: కేఎస్‌ఎస్‌ ట్రావెల్స్‌ బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా రాజంపేటలో బాధితులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. 70మంది వద్ద రూ.26 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదు చేశారు. దీంతో పట్టణ పోలీసుస్టేషన్‌లో బాధితులతో డీఎస్పీ లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. బాధితుల కథనం మేరకు.. పెనగలూరు మండలం కొత్తపల్లెకు చెందిన షేక్‌ షామీర్‌బాషా ఈ ఏడాది ఏప్రిల్‌లో మక్కాకు పోవాలనే ఉద్దేశంతో రాజంపేట బైపాస్‌రోడ్డులోని కేఎస్‌ఎస్‌ ట్రావెల్స్‌కు చెందిన అలీపీర్‌కు మార్చి 23వతేదీ రూ.23వేలు నగదు ఇచ్చారు. అందుకు రసీదు కూడా ఇచ్చారు. మక్కాకు వెళ్లేందుకు పాస్‌పోర్టుతో పాటు ధ్రువీకరణపత్రాలను తీసుకున్నారు. వీసా తదితరాలను తానే కల్పిస్తానని నమ్మబలికారు.

ఏప్రిల్‌ 25 నుంచి మే 5వతేదీలోపు పంపించే ఏర్పాట్లు చేస్తామన్నారు. మే 5న బాధితుడు తనను మక్కా ఎందుకు పంపలేదని నిలదీశారు. దానికి సమాధానం ఇవ్వకుండా నిర్వహకుడు జారుకున్నారు. ఈనెల 27న ఉదయం రాజంపేట బైపాస్‌లో ఉన్న కేఎస్‌ఎస్‌ ట్రావెల్స్‌ దగ్గరకు పోగా మూసివేశారు. అలీపీరాకు ఫోన్‌ చేయగా 28న కడప ఆల్మాస్‌పేట్‌లోని మెయిన్‌బ్రాంచికి రావాలన్నారు. అలాగే  అక్కడికి వెళితే మెయిన్‌ ఆఫీస్‌ కూడా మూసివేయడంతో ఆరా తీశారు. వారు మోసం చేశారని తెలుసుకున్నారు. రాజంపేటకు వచ్చి విచారిస్తే సత్తార్, కరీముల్లా, సుభాన్‌తో పాటు మరికొంతమంది కూడా మోసపోయారని తెలుసుకున్నారు. దీంతో బాధితులు మూకుమ్మడిగా స్టేషన్‌కు వచ్చి అలీతోపాటు కేఎస్‌ఎస్‌ ట్రావెల్స్‌ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, మాడబ్బులు, పాస్‌పోర్టులను వెనక్కి ఇప్పించాలని ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పట్టణ పోలీసుస్టేషన్‌కు చేరుకున్న డీఎస్పీ, సీఐలు విచారణ చేశారు. బాధితుల మేరకు చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్‌ఐ రాజగోపాల్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement