
బనశంకరి: బెంగళూరు భూపసంద్రలో అదృశ్యమైన ఇద్దరు పిల్లలు ఆచూకీ తిరుపతిలో లబించింది. వీరిద్దరిని నగరపోలీసులు సురక్షితంగా తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలు...సంజయనగర పోలీస్‌స్టేషన్ పరిధిలోని భూపసంద్ర మెయిన్‌రోడ్డు 5వ క్రాస్‌లో ప్రశాంత్, శైలజా దంపతులు నివాసముంటున్నారు. వీరికి నమ్రత (7), నమిత్ (5) అనే పిల్లలున్నారు. గత నెల 25 తేదీ రాత్రి 7.30 గంటలకు అక్కడే కొబ్బరిబొండాలు అమ్మే అవ్వ వద్ద ఉన్నారు. ప్రశాంత్ కుటుంబానికి పరిచయమైన వినోద్ (26) అనే యువకుడు ఆడుకునే నెపంతో నమ్రతా, నమిత్ ఇద్దరినీ అపహరించుకెళ్లాడు. రాత్రి 9 గంటల వరకు ఇంటికి పిల్లలు రాకపోవడంతో తల్లిదండ్రులు పలు చోట్ల గాలింపు చర్యలు చేపట్టారు. కానీ వీరి ఆచూకీ లభించకపోవడంతో సంజయనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పట్టించిన సీసీ కెమెరాలు
పోలీసులు పిల్లలు ఆడుకుంటున్న సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. ఇందులో వినోదే పిల్లలను తీసుకెళ్లినట్లు తెలిసి అతని ఫోటోలను అందరికీ వాట్సప్‌లో పంపారు. తిరుపతిలో ఉన్న ప్రశాంత్ బంధువుల అవినాశ్ తిరుపతిలో పిల్లలను గమనించి ప్రశాంత్‌కు సమాచారం అందించాడు. వెంటనే సంజయనగగర పోలీసులు తిరుపతికి వెళ్లి స్థానిక పోలీసుల సహాయంతో పిల్లల వద్దకు వెళ్లారు. పోలీసులను చూసి వినోద్ పరారు కాగా, పోలీసులు పిల్లలను గురువారం ఉదయం నగరానికి తీసుకువచ్చారు. తల్లిదండ్రులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి నమ్రతా, నమిత్‌ను అప్పగించారు. పరారీలో వినోద్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.