గాంధీలో శిశువుల తారుమారు

Kidnap Case Filed on Women in Gandhi Hospital Hyderabad - Sakshi

చిన్నారులను జంబ్లింగ్‌ చేసిన మహిళ  

బాలింత సోదరి ఫిర్యాదు  

స్పందించిన వైద్యులు, సెక్యూరిటీ సిబ్బంది

సీసీ కెమెరాల పుటేజీతో గుర్తింపు  

మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగింత  

కిడ్నాప్‌ కేసు నమోదు

గాంధీఆస్పత్రి: తెలంగాణ వైద్యప్రదాయినిగా పేరుగాంచిన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ఇటీవల సంచలన ఘటనలకు ప్రధాన కేంద్రమైంది. గాంధీ ఆస్పత్రి ఎన్‌ఐసీయూ వార్డులో శిశువులను తారుమారు చేసిన సంఘటన మంగళవారం కలకలం సృష్టించింది. ఆడశిశువుకు బదులుగా మగశిశువును తీసుకువెళ్లిన మహిళను సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా పట్టుకుని కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి,  ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మాసబ్‌ట్యాంక్‌ చాచానెహ్రూనగర్‌కు చెందిన సఫియాభాను కాన్పు కోసం కోసం గాంధీ ఆస్పత్రి గైనకాలజీ విభాగంలో చేరింది. ఈ నెల 21న ఆమె మగశిశువుకు జన్మనిచ్చింది. త్వరితగతిన స్వస్థత చేకూరేందుకు శిశువును పిడియాట్రిక్‌ విభాగంలోని ఎన్‌ఐసీయూ వార్డులోని ఇంక్యుబేటర్‌ (వైద్యపరికరం)లో ప్రతిరోజు కొంతసమయం పెడుతున్నారు. వెస్ట్‌బెంగాల్‌ న్యూజల్‌పైగురి జిల్లా కెలావాడీ గ్రామానికి చెందిన ఫూల్‌మణిమహాలీ, సోనుమహాలీలు భార్యభర్తలు. కొంతకాలం క్రితం నగరానికి వలస వచ్చి నాచారం మల్లాపూర్‌లోని వెంకటాపురం కాలనీలో ఉంటూ కూలిపనులతో జీవనోపాధి పొందుతున్నారు.  గర్భిణి అయిన ఫూల్‌మణి కొద్దిరోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో చేరి ఆడశిశువుకు జన్మనిచ్చింది.

ఆ శిశువును కూడా ఎన్‌ఐసీయూలోని ఇంక్యూబేటర్‌లో పెడుతున్నారు. ఈ నేపధ్యంలో మంగళవారం ఇరువురు శిశువులను ప్రక్కప్రక్కన గల ఇంక్యుబేటర్‌లో పెట్టారు. ఫూల్‌మణిని పరామర్శించేందుకు ఆమె సోదరి సరితనాయక్, బావ మంజీత్‌నాయక్‌లు మంగళవారం ఉదయం గాంధీఆస్పత్రికి వచ్చారు. సోదరి ఫూల్‌మణికి ఆడపిల్ల పుట్టిందని తెలుసుకున్న సరితనాయక్‌ మనస్తాపానికి గురైంది. పీఐసీయూ ఇంక్యుబేటర్‌లో తమకు చెందిన ఆడశిశువు పక్కనే మగశిశువు ఉన్నట్లు గమనించింది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వైద్యులు, సిబ్బంది కళ్లుగప్పి ఇంక్యుబేటర్‌లో ఉన్న  మగ శిశువును తీసుకుని ఆస్పత్రి బయటకు వెళ్లేందుకు యత్నించింది. పీఐసీయూ వద్ద కాపలాగా ఉన్న సఫియాభాను సోదరి సాదియాభాను కొంతసేపటి తర్వాత ఇంక్యుబేటర్‌లో మగశిశువు లేని విషయాన్ని గమనించి ఎన్‌ఐసీయూ వైద్యులు, సిబ్బందికి చెప్పింది. స్పందించిన వైద్యులు సెక్యూరిటీ సిబ్బందిని ఎలర్ట్‌ చేసి ఆస్పత్రి పాలన యంత్రాంగానికి సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న అవుట్‌పోస్టు పోలీసులు ఎన్‌ఐసీయూ వద్దకు చేరుకున్నారు. సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించగా ఇంక్యుబేటర్‌లో ఉన్న మగశిశువును సరితనాయక్‌  తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. సరితానాయక్‌ను ఆస్పత్రి ప్రాంగణంలో అడ్డుకున్నారు. పొరపాటు జరిగిందని బుకాయించేందుకు ఆమె ప్రయత్నించింది.  సోదరికి ఆడశిశువు పుట్టిందని తెలియడంతో మనస్తాపానికి గురయ్యానని, అందుకే ఇంక్యుబేటర్‌లో ఉన్న మగశిశువును తీసుకువెళ్లేందుకు ప్రయత్నించానని పోలీసుల విచారణలో వెల్లడించింది. తారుమారైన శిశువులను తల్లుల చెంతకు చేర్చడంతో కథ సుఖాంతమైంది. బాధితురాలు సఫియాభాను సోదరి సాదియాబానుతోపాటు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ ఫిర్యాదుల మేరకు నిందితురాలు సరితనాయక్‌పై కిడ్నాప్‌ కేసు నమోదు చేసినట్లుచిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి స్పష్టం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top