పాపులర్‌ కావాలని హీరో బాలకృష్ణ ఇంట్లో.. | Karri Satish Arrest in Robbery Case hyderabad | Sakshi
Sakshi News home page

సంపన్నులే టార్గెట్‌

Sep 28 2018 9:18 AM | Updated on Oct 2 2018 2:05 PM

Karri Satish Arrest in Robbery Case hyderabad - Sakshi

నిందితుడు కర్రి సతీష్‌..,బాలకృష్ణ

బంజారాహిల్స్‌:  బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–12 ఎమ్మెల్యే కాలనీలో జరిగిన నాలుగు దొంగతనాల్లో నిందితుడిగా ఉండి తప్పించుకు తిరుగుతున్న ఘరానా దొంగ కర్రి సతీష్‌ అలియాస్‌ సత్తిబాబు, అలియాస్‌ బుజ్జిని బెంగళూరు సదాశివనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్‌ జైలులో ఉన్న కర్రి సతీష్‌ గత నెల ఎమ్మెల్యే కాలనీలో డాక్టర్‌ రామారావు, వెంకట్‌రెడ్డి, షీలా అర్మానీ, అశ్వినీరెడ్డి నివాసాల్లో చోరీలకు పాల్పడి బెంగళూరుకు ఉడాయించాడు. సీసీ ఫుటేజ్‌లు, దొంగతనాల తీరును బట్టి చోరీలన్నీ కర్రి సతీష్‌ చేసినవిగానే ధృవీకరించిన  బంజారాహిల్స్‌ క్రైం పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. వైజాగ్‌లోని అతడి నివాసంతో పాటు బంధుమిత్రుల ఇళ్లపై నిఘా వేసి ఇటీవల బెంగళూరుకు మకాం మార్చినట్లు గుర్తించారు. నిందితుడి ఆచూకీ తెలుసుకున్న బంజారాహిల్స్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ కె.రవికుమార్, డిటెక్టివ్‌ ఎస్‌ఐ పల్సా నాగరాజుగౌడ్‌ బెంగళూరుకు వెళ్లి ఈ గజదొంగను పట్టుకునేందుకు సిద్ధమవుతుండగానే అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం అందింది. ఎమ్మెల్యే కాలనీలో చోరీల అనంతరం సతీష్‌ నేరుగా బెంగళూరుకు వెళ్లాడు.

ఈ నెల 9న బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఉంటున్న కర్ణాటక రిటైర్డ్‌ డీజీ శ్రీనివాసులు, అల్లుడు ప్రభు ఇంట్లో చోరీకి యత్నించాడు. అక్కడ విలువైన వస్తువులు దొరక్కపోవడంతో కారు తాళం చెవులు దొంగిలించి పార్కింగ్‌ చేసి ఉన్న కారుతో ఉడాయించాడు. అనంతరం కారు నంబర్‌ తొలగించి బోగస్‌ నంబర్‌ ప్లేట్‌ తగిలించాడు. ఈ నెల 18న సదాశివనగర్‌లో ఉంటున్న చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్‌ ఆదికేశవులు నాయుడు ఇంట్లో చోరీకి వెళ్లాడు. ఇంట్లో ఆయన సతీమణి లక్ష్మీదేవమ్మ ఒక్కరే ఉన్నారు. గేటు దూకుతున్న సమయంలో సదాశివనగర్‌ పెట్రోలింగ్‌ పోలీసులు అతడిని గుర్తించి లోపలికి వెళ్లి చూడగా ముసుగు ధరించిన దొంగ కనిపించాడు. అప్పటికే అప్రమత్తమైన స్థానికులు తప్పించుకొని పారిపోతున్న సతీష్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసు  విచారణలో గతంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్లలో 12 దొంగ తనాలు చేసినట్లు నిర్ధారణ అయింది. గత నెలలోనే ఎమ్మెల్యే కాలనీలో నాలుగు దొంగతనాలు చేసినట్లు అంగీకరించడంతో పోలీసులు చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.  మరింత సమాచారం రాబట్టేందుకు బెంగళూరు పోలీసులు గురువారం బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు.

‘హిల్స్‌’ పరిధిలోనే 12 కేసులు
నిందితుడు సతీష్‌పై బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్లలో 12 కేసులు ఉండటం గమనార్హం. 2016లో ఏప్రిల్‌ 28న ఫిలింనగర్‌ సినార్‌ వ్యాలీలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఎస్‌ఎస్‌ శర్మ ఇంట్లో కిలో బంగారం ఎత్తుకెళ్లాడు. ఈ కేసులో తప్పించుకు తిరుగుతున్న సతీష్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు పట్టుకొని విచారించగా ఈ రెండు పోలీస్‌స్టేషన్ల పరిధిలో 12 దొంగతనం కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించి, 2016, డిసెంబర్‌ 2న అతడిపై పీడీయాక్ట్‌ నమోదు చేశారు. సెప్టెంబర్‌ 14న సతీష్‌ జైలు నుంచి విడుదలైన అతను ఆ తెల్లవారే ఎమ్మెల్యే కాలనీలోని డాక్టర్‌ రామారావు ఇంట్లో రూ.కోటి విలువైన సొత్తును తస్కరించడమేగాక, వరుస దొంగతనాలు చేసి ఇక్కడి నుంచి జారుకున్నాడు. ఎట్టకేలకు బెంగళూరు పోలీసులకు చిక్కడంతో బంజారాహిల్స్‌ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.  

హీరో బాలకృష్ణ ఇల్లు టార్గెట్‌
తనకు జూబ్లీహిల్స్‌లో నివసించే సినీ హీరో నంద మూరి బాలకృష్ణ ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నట్లు నిందితుడు సతీష్‌ బెంగళూ రు పోలీసుల విచారణలో వెల్లడించాడు. బాల కృష్ణ ఇంట్లో దొంగతనం చేస్తే పాపులర్‌ అవుతాన ని చెప్పడం గమనార్హం. దీంతో పోలీసులు నోరెళ్లబెట్టారు. ఒకవేళ బెంగళూరు పోలీసులకు దొరికి ఉండకపోతే వచ్చే నెలలో సతీష్‌ మళ్లీ జూబ్లీహిల్స్‌పై కన్నేసేవాడని ఎట్టి పరిస్థితుల్లోనూ బాలకృష్ణ ఇంట్లో చోరీకి యత్నించేవాడని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement