ఆర్టీసీ కడప డిపోలోనే బంగారు ఆభరణాలు

jewellery bag still in aps rtc kadapa depot from 5months

ఐదు నెలలుగా గోప్యంగా ఉంచిన వైనం  

కడప అర్బన్‌ : ఏపీఎస్‌ఆర్టీసీ కడప డిపోలో ఐదు నెలలుగా ఓ ప్రయాణికునికి చెందిన దాదాపు 72 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.....కడప నుంచి అనంతపురం వెళ్లి వచ్చిన ఓ ఆర్టీసీ బస్సులో గుర్తు తెలియని వ్యక్తి సూట్‌కేస్‌ను మరిచిపోయాడు. ఆ సూట్‌కేసును బస్సు డ్రైవర్, కండక్టర్‌ డిపో అధికారులకు అప్పగించారు. ఈ సూట్‌కేసులో ఉన్న దుస్తులను, సూట్‌కేసును నెలరోజులు గడిచిన తర్వాత నిబంధనల మేరకు వేలం వేశారు. విలువైన బంగారు ఆభరణాలను మాత్రం సీజ్‌ చేసి తమ వద్దనే భద్రపరిచారు.

సంఘటన జరిగిన రోజుగానీ, మరుసటిరోజుగానీ సూట్‌కేస్, ఆభరణాల గురించి పోలీసులకుగానీ, పత్రికలకుగానీ తెలుపకుండా గోప్యంగా ఉంచడం పలు ఆరోపణలకు తావిస్తోంది. ఈ విషయంపై విలేకరులు డిపో మేనేజర్‌ గిరిధర్‌రెడ్డిని వివరణ కోరగా బస్సుల్లో ఎవరైనా ప్రయాణికులు వస్తువులను పోగొట్టుకుంటే నెల రోజులపాటు అందుబాటులో ఉంచుతామన్నారు. తర్వాత వాటిని వేలం వేస్తామన్నారు. బంగారు వస్తువులకు సంబంధించి కమిటీ ద్వారా తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top