ఆధ్యాత్మిక వేత్త గిరీష్‌ కుమార్‌ అరెస్టు

Hyderabad Police Arrested Fake Spiritual Leaders Girish Singh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆధ్యాత్మికవేత్తగా ప్రజలను మోసం చేస్తున్న కుమార్‌ గిరిష్‌ సింగ్‌ అనే బురిడి బాబాను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. డీమ్‌ బ్రిడ్జ్‌ మనీ సర్క్యూలేషన్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న గిరీష్‌ సింగ్‌తోపాటు అతని సోదరుడు దిలిప్‌ సింగ్‌ను ఎస్‌ఆర్‌ నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాలుగు కార్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీకి చెందిన గిరీష్‌ సింగ్‌ ఆధ్యాత్మిక వేత్తగా ప్రజలను మోసం చేస్తూ దాదాపు రూ.40  కోట్లు కాజేశారు. 

పోలీసుల వివరాల ప్రకారం.. నెల్లూరుకు చెందిన గిరీష్‌ సింగ్‌ చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడంతో ఆధ్యాత్మికతను బోధించడం ప్రారంభించాడు. అనంతరం సోదరుడు దిలీప్ సింగ్‌తోపాటు ‘అద్వైత ఆధ్యాత్మిక రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’ (ASRCE) ను ప్రారంభించాడు. ఇంటర్‌ ఫెయిల్‌ అయిన గిరీష్‌ కుమార్‌ హిమాలయాన్‌ యూనివర్సిటీ నుంచి నకిలీ డిగ్రీ పట్టా పొందాడు. అయితే తెలుగుతో పాటు ఇంగ్లీష్‌, హిందీ భాషల మీద మంచి పట్టు ఉండటంతో బురిడీ బాబా బుట్టలో ఈజీగా పడిపోయేవాళ్లు.

గత ఏడాది గిరీష్ సింగ్  తన అనుచరురాలైన దివ్యను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి డబ్బుపై ఆశ పెంచుకున్న గిరీష్‌...యువతులను టార్గెట్ చేసుకొని నేరుగా వెళ్లి కలిసి వాళ్లకి ఆధ్యాత్మిక బోధనలు ఇచ్చేవాడు. పలు టీవీ ఛానల్లో సైతం ఆధ్యాత్మిక బోధనలు ఇస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు. ఈ క్రమంలో గిరీష్ సింగ్ అనేక మంది నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి, చివరికి వారికి కుచ్చు టోపీ పెట్టడంతో బాధితులు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గిరీష్ సింగ్, అతని సోదరుడు దిలీప్‌ను పలు కేసుల కింద అరెస్టు చేశారు. జనాల నుంచి వసూలు చేసిన డబ్బుతో అతగాడు దాదాపు ఇరవై దేశాలు చుట్టేసి...  అక్కడ జల్సాలు చేశావాడు.   అతగాడు ఏర్పాటు చేసిన గొలుసుకట్టు వ్యాపారంలో లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి చివరికి మోసపోయామని గ్రహించి పోలీసుల్ని ఆశ్రయించారు. గత ఏడాదే గిరీష్‌ కుమార్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయినా అతగాడిలో ఏ మార్పు రాలేదు. ఆధ్యాత్మికం ముసుగులో మళ్లీ దందా షురూ చేశాడు.

రాచకొండ ఉమ్మడి కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్ సిటీలో గిరీష్, దివ్యల వివాహం కోసం ప్రజల నుంచి రూ.3 కోట్ల సేకరించి ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అలాగే అతని తరగతులకు హాజరయ్యే వారి నుంచి రూ.10,000 నుంచి రూ .2 లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇతనిపై 4 పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయని,  గిరీష్‌, అతని సోదరుడి పేరుతో భారీగా ఆస్తులు కూడబెట్టారని పేర్కొన్నారు. అలాగే ప్రజల నుంచి డిబెంచర్లు, డ్రీం బ్రిడ్జ్‌ల రూపంలో రూ.40 కోట్లు కాజేశారని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top