భార్య హత్య.. ఆస్తి రాసిస్తేనే అంత్యక్రియలు | Husband Killed Wife in Karnataka | Sakshi
Sakshi News home page

అనుమానం ప్రాణం తీసింది

Jan 28 2020 10:48 AM | Updated on Jan 28 2020 1:11 PM

Husband Killed Wife in Karnataka - Sakshi

భర్త సురేష్‌తో శశికళ (ఫైల్‌)

రోడ్డున పడిన ఇద్దరు కుమార్తెలు

కర్ణాటక, బొమ్మనహళ్లి : 17 ఏళ్ల పాటు సాగిన అన్యోన్య దాంపత్యంలో ఒక్కసారిగా అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను హత్య చేసి జైలుపాలుకాగా ఇద్దరు అమ్మాయిలు రోడ్డున పడిన ఘటన మైసూరు సమీపంలోని చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా అంకహళ్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. అంకహళ్లిలో నివాసం ఉంటున్న సురేశ్‌కు, పడగూరు గ్రామానికి చెందిన శశికళతో 17 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన సురేశ్‌ నిత్యం మద్యం మత్తులో భార్యతో గొడవపడేవాడు. తీవ్రంగా అనుమానించేవాడు. దీంతో పెద్ద కుమార్తెను తాత ఇంటికి పంపించారు. చిన్న కుమార్తె అక్కడే ఉంటోంది. శనివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సురేశ్‌ భార్యతో గొడవపడి ఆగ్రహంతో తలపై కట్టెతో బలంగా బాదడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సురేశ్‌ను అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించారు. 

ఆస్తి రాసిస్తేనే అంత్యక్రియలు : పిల్లలు అనాథలుగా మారడంతో సురేశ్‌ ఇటీవల 14 ఎకరాల భూమిని తన అక్కలకు రాసివ్వడంతో ఆ భూమిని తమ పిల్లలకు రాసిస్తేనే శశికళ అంత్యక్రియలు నిర్వహిస్తామని శశికళ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన నిర్వహించారు. దీంతో సురేశ్‌ అక్కలు అక్కడికి చేరుకుని ఆస్తిని పిల్లల పేరుతో రాసిస్తామని హామీ ఇవ్వడంతో సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.  

Advertisement
 
Advertisement
Advertisement