ఇద్దరు ప్రియులతో కలసి..

Husband killed By Wife With Help Of Her Boyfriend At Nirmal - Sakshi

భర్త దారుణ హత్య

దుబాయ్‌ పారిపోయిన ఓ ప్రియుడు

మరొకరితో కలసి సహజీవనం

నిందితురాలు ప్రస్తుతం నిండు గర్భిణి

మామడ/నిర్మల్‌: ఇద్దరు ప్రియులతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా తమ సాన్నిహిత్యానికి అడ్డొస్తున్నాడని పథకం ప్రకారం భర్తను హత్య చేయించిందో భార్య. మృతుడితో పాటు నిందితులు నిజామాబాద్‌ వారు కాగా, హత్యోదంతం నిర్మల్‌ జిల్లా మామడ మండలం పొన్కల్‌ శివారులో జరిగింది. 4 నెలల క్రితం జరిగిన ఘటనకు సంబంధించిన కేసును నిర్మల్‌ జిల్లా పోలీసులు ఛేదించారు. నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌కు చెందిన గుజ్జెటి ఉదయ్‌కుమార్‌ (39) మొదటి భార్య చనిపోవడంతో ఆలూరుకు చెందిన పావని ఆలియాస్‌ లావణ్యను రెండో పెళ్లి చేసుకున్నాడు. పావనికీ గతంలో వివాహమైంది. మొదటి భర్తతో విడాకులయ్యాయి. రెండో పెళ్లి చేసుకున్న ఉదయ్, పావనిలు అంకాపూర్‌లోనే కాపురం పెట్టారు. ఉదయ్‌కుమార్‌ కూలీ పనులు చేస్తుండగా, పావని బీడీలు చుడుతూ జీవనం సాగించారు.

రెండో పెళ్లే ప్రాణం తీసింది 
ఉదయ్‌కుమార్‌ రెండో పెళ్లే ఆయన నిండు ప్రాణం తీసింది. పావని భర్తతో ఉంటూనే తన పాత పరిచయస్తుడు దవాతే దౌలాజీ అలియాస్‌ రమేష్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. దౌలాజీ సైతం అంకాపూర్‌లోనే కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ సమయంలోనే తన భర్త ఉదయ్‌కుమార్‌ స్నేహితుడైన గంగాధర్‌తోనూ పావనికి పరిచయం ఏర్పడింది. ఆయనతోనూ వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచుకుంది. భర్త ఉదయ్‌కుమార్‌కు ఇది తెలియడంతో పావనిని మందలించాడు. దీంతె ఇద్దరు ప్రియులతో కలసి భర్తను అంతం చేయాలని పథకం రచించింది.

చచ్చాడా.. లేదా..: 4 నెలల క్రితం జూన్‌ 5న ఉదయ్‌ హత్యకు ప్లాన్‌ చేశారు. భర్తను చంపాలని ప్రియులిద్దరినీ పురమాయించింది. ఈ మేరకు వారిద్దరూ ఉదయ్‌కుమార్‌కు జరిగిందేదో జరిగింది. అన్నట్లుగా మాటలు చెప్పి, దావత్‌ చేసుకుందామని ఒప్పించారు. అదేరోజు అంకాపూర్‌ నుంచి బైక్‌పై నిర్మల్‌–నిజామాబాద్‌ జిల్లాల సరి హద్దులో గోదావరి ఒడ్డున గల నిర్మల్‌ జిల్లా మామడ మండలం పొన్కల్‌ గ్రామ శివారుకు తీసుకొచ్చారు. దౌలాజీ, గంగాధర్‌ తక్కువ మద్యం సేవించారు.

ఉదయ్‌కుమార్‌కు మాత్రం ఎక్కువ మొత్తంలో మద్యం తాగించారు. అక్కడి నుంచే పావనికి ఫోన్‌ చేశారు. ఉదయ్‌కుమార్‌ను చంపాలా.. వద్దా.. అని మరోమారు అడిగారు. ఆమె చంపమని స్పష్టంగా చెప్పిన తర్వాత వారిద్దరూ కలసి ఉదయ్‌కుమార్‌ను గోదావరిలో ముంచి చంపేశారు. చంపిన తర్వాత మళ్లీ పావనికి ఫోన్‌ చేశారు. అప్పుడు కూడా ఆమె.. చచ్చాడా.. లేదా.. చూడమని చెప్పడంతో వారు ఉదయ్‌ మృతదేహాన్ని పైకి లేపి శ్వాస చూసి చనిపోయినట్లు నిర్దారించుకుని.. మృతదేహాన్ని గోదావరి మడుగులో పడేశారు. నాలుగురోజుల తర్వాత జూన్‌ 9న ఉదయ్‌కుమార్‌ మృతదేహం బయటపడింది. స్థానికులు మామడ పోలీసులకు సమాచారం ఇవ్వగా, గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు.

కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి.. 
ఉదయ్‌కుమార్‌ను హత్య చేసిన అనంతరం గంగాధర్‌ గుట్టుచప్పుడు కాకుండా దుబాయ్‌కు వెళ్లిపోయాడు. ఇక దౌలాజీ ఏమి ఎరుగనట్టు మళ్లీ అంకాపూర్‌ చేరుకుని పావనితో సహజీవనం కొనసాగిస్తున్నాడు. నాలుగు నెలలుగా ఉదయ్‌కుమార్‌ కనిపించకపోవడంతో ఆయన కుటుంబసభ్యులు అనుమానం వచ్చి అక్టోబర్‌ 19న పావని వద్దకు వెళ్లారు. అక్కడ ఆమె ప్రియుడు దౌలాజీతో కలసి ఉండటంతో షాక్‌ అయ్యారు. ఉదయ్‌కుమార్‌ ఎక్కడున్నాడని ఆమెను నిలదీశారు. ఉదయ్‌కుమార్‌ మిస్సింగ్‌తోపాటు వీరిపై అనుమా నం ఉన్నట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పావని, దౌలాజీలను కోర్టులో హాజరుపర్చగా వారు బెయిల్‌పై విడుదలయ్యారు.

తీగ లాగితే.. 
మామడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పొన్కల్‌ వద్ద గోదావరిలో బయటపడ్డ ఉదయ్‌కుమార్‌ మృతిపై అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు. ఆర్మూర్‌ పోలీసుల వద్ద అక్టోబర్‌ 19న మిస్సింగ్‌ కేసు నమోదైనట్లు తేలడంతో దానిపై దృష్టి పెట్టారు. పోలీసులు కేసును దర్యాపు చేయడంతో పావని చేసిన కథంతా బయటపడింది. పావని ప్రస్తుతం 8 నెలల గర్భిణి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top