భర్తే హంతకుడు!

Husband killed wife - Sakshi

 బంగారం గొలుసు ఇవ్వకపోవడం వల్లే కుమార్తె ప్రాణం తీసింది

మృతురాలు గౌతమి తల్లి ఆరోపణ

పోలీసుల అదుపులో మృతురాలి భర్త

భామిని: గౌతమి హత్య కేసులో భర్తే హంతకుడిగా మృతురాలి తల్లి ఆరోపిస్తుంది. బంగారం గొలుసు ఇవ్వకపోవడం వల్లే తన కుమార్తెను కోల్పోయానని ఆవేదన చెందుతుంది. తన పేదరికమే గర్భశోకం మిగిల్చిందని లబోదిబోమంటుంది. భామిని మండలం వడ్డంగిగూడ గ్రామంలో గిరిజన వివాహిత తాడంగి గౌతమి గురువారం మధ్యాహ్నం హత్యకు గురైన విషయం తెలిసిందే. సంఘటనా స్థలాన్ని పాలకొండ డీఎస్పీ జి.స్వరూపారాణి శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఆమె వద్ద మృతురాలి తల్లి పార్వతి, పిన్ని దివ్య తమ కుమార్తెను అల్లుడు మనోహరే పొట్టనపెట్టుకున్నాడని విలపించారు. తన కుమార్తె గౌతమి, అల్లుడు మనోహర్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని మృతురాలి తల్లి తెలిపారు.

పెళ్లి సమయంలో కట్నం, బంగారం గొలుసు ఇవ్వమని అల్లుడు కోరాడని వివరించారు. అయితే తమ పేదరికం వల్ల ఆ సమయంలో ఇవ్వలేకపోయామని, తర్వాత వీలు చూసుకొని కొని ఇస్తామని చెప్పామన్నారు. ఏళ్లు గడుస్తున్నా కట్నం, బంగారం గొలుసు ఇవ్వకపోవడంతో తన కుమార్తెకు వేధింపులు ప్రారంభమయ్యాయన్నారు. పిల్లలు లేకపోవడం, కన్నవారి నుంచి ఆర్థిక సహాయం లేకపోవడంతో రెండేళ్లుగా తన(కన్నవారి) ఇంటికి కూడా గౌతమిని పంపలేదని ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో తన కుమార్తెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి హత్యకు పాల్పడ్డాడని డీఎస్పీ వద్ద ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ముందుగా డీఎస్పీ స్వరూపారాణి, పాతపట్నం సీఐ ప్రకాశరావు, భామిని తహసీల్దార్‌ బంకిపల్లి సత్యం, బత్తిలి ఎస్సై ఎం.ముకుందరావు సంఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలించారు. క్లూస్‌ టీం వచ్చి వివరాలు సేకరించింది. అలాగే గురువారం రాత్రి నుంచి సంఘటనా స్థలం వద్ద సాయుధ పోలీస్‌ బలగాలు కాపలాకాసాయి. మృతురాలి భర్త మనోహర్‌ను గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకొని బత్తిలి స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. గౌతమి మృతికి ప్రధాన కారకుడు మనోహరేనని పోలీస్‌లు భావిస్తున్నారు. ఇదిలావుండగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం సాయంత్రం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top